భారీగా స్క్రీన్లు, రికార్డు స్థాయిలో థియేటర్లు, అదనంగా షోలు.. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో సాహో మేనియా నడుస్తోంది. ఈ హంగామా మొత్తాన్ని ఇప్పుడు తనవైపు తిప్పుకుంది దుబాయ్. అవును.. ప్రపంచం మొత్తమ్మీద అన్ని లొకేషన్స్ లో కంటే ముందుగా దుబాయ్ లోనే సాహో మొదటి షో పడబోతోంది.
దుబాయ్ కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు దుబాయ్ లో ఐమ్యాక్స్ ఫార్మాట్ లో సాహో సినిమాను ప్రసారం చేయబోతున్నారు. కాకపోతే ఇది తెలుగు వెర్షన్ కాదు. దుబాయ్ లో ఏకంగా 4 స్క్రీన్స్ లో సాహో హిందీ వెర్షన్ ను ప్రసారం చేయబోతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం, రేపు రాత్రి 10 గంటలకే సాహో మొదటి షో పడబోతోందన్నమాట.
అటు దుబాయ్ తో పాటు షార్జాలో కూడా అదే టైమ్ కు సాహో స్క్రీనింగ్ ప్రారంభం కాబోతోంది. సో.. రేపు అర్థరాత్రికి సాహో ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చేస్తుంది. ఆ వెంటనే కొన్ని గంటలకు ఇండియా అంతటా షోలు ప్రారంభం అవుతాయి. ఏపీలోని కొన్నిచోట్ల ఉదయం 5 గంటలకే సాహో మొదటి షో పడబోతోంది.
సాహో మొదటి షో పడే టైమ్ కు ప్రభాస్ దుబాయ్ లోనే ఉంటాడు. ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం కల్పించడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి కాసేపు సాహో సినిమా చూడబోతున్నాడు ప్రభాస్. తిరిగి ఇండియాలో సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కు హైదరాబాద్ చేరుకుంటాడు. ఇక సినిమా విడుదల తర్వాత లండన్ లో పర్యటించబోతున్నాడు ప్రభాస్.
వరల్డ్ వైడ్ సాహో సినిమాను 319 కోట్ల రూపాయలకు అమ్మారు. తెలుగులో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే కనీసం 130 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక హిందీ వెర్షన్ కు 120 కోట్ల రూపాయలు రావాలి.