నిధులు తేలేరు కానీ… ఇవ్వొద్దు అని చెబుతారట

ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు బారెడు అని ఏపీ బీజేపీ నేతలు ఎపుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే విభజన గాయాలను నిండా మోస్తున్న ఏపీకి ఇవ్వాల్సింది ఎంతో ఉందన్న విషయం మాత్రం వారు…

ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు బారెడు అని ఏపీ బీజేపీ నేతలు ఎపుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే విభజన గాయాలను నిండా మోస్తున్న ఏపీకి ఇవ్వాల్సింది ఎంతో ఉందన్న విషయం మాత్రం వారు సౌకర్యవంతంగా మరచిపోతారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే ఏపీకి  వివిధ పథకాలకు నిధులు ఇస్తోంది.

అయితే అవే ఎక్కువ అని టముకు వేసుకునే బీజేపీ నాయకులు ఇపుడు కేంద్రం నుంచి ఆ నిధులు కూడా ఆపించేస్తామనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు జగనన్న కాలనీలు ఏంటి అంటూ ఎకసెక్కమాడుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా అందులో ఉన్నాయని ఆయన అంటున్నారు.  

వెంటనే జగనన్న పేరుని తీయించేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా కనుక చేయకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ ప్రధాని ఆవాస యోజన కింద ఏపీకి వచ్చే నిధులను ఆపించేస్తానని గట్టి హెచ్చరిక కూడా చేశారు. సోము తీరు చూస్తే ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడం అంతా వారి దయా దాక్షిణ్యం మీదనే ఆధారపడి ఉందని భావిస్తున్నారులా ఉంది అంటున్నారు.

లేకపోతే దేశంలో ఏపీ ఒక రాష్ట్రం, పైగా ఏపీ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఆదాయం వెళ్తోంది. కేంద్రం ఏపీకే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆవాస యోజన పధకం అమలుచేస్తోంది. కేంద్రం నిధులతోనే ఏపీలో ఇళ్ళు తయారవుతున్నాయని సోము లాంటి నాయకులు ఎలా అనుకుంటున్నారో కానీ ఆ ఇళ్లకు స్థలాన్ని ఇచ్చేది ఏపీ సర్కార్, ఆ ఇంటి పూర్తికి రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇస్తోంది.

ఇన్ని ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ పేరు ఉండేలా చూసుకోవడంలో తప్పెక్కడ  కనిపించిందో సోము వీర్రాజే చెప్పాలని అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలకు సత్తా ఉంటే కేంద్రం నుంచి ఏపీకి దండీగా నిధులు తేవాలి కానీ ఇలా వచ్చే వాటిని ఆపేయించేస్తామని దబాయించడమేంటని విమర్శలు కూడా వస్తున్నాయి.