విశాఖను పవన్ మరచిపోలేకపోతున్నారా. ఆయన ఆలోచనలు అన్నీ విశాఖ చుట్టూనే తిరుగుతున్నాయా. అవునేమో అనిపిస్తోంది. ఈ నెల 15న వైసీపీ విశాఖ గర్జన పేరిట కార్యక్రమానికి పిలుపు ఇస్తే పవన్ అదే రోజు విశాఖ చేరుకున్నారు. ఆ తరువత ఆయన ఎయిర్ పోర్టు నుంచి విశాఖ బీచ్ వద్ద ఉన్న నోవెటెల్ హొటల్ వరకూ భారీ ర్యాలీగా సాగి వచ్చారు.
ఆ తరువాత నుంచే కధ మొదలైంది. పోలీసులు విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల మీద జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని కట్టడి చేయడం ఆరంభించారు. దాడిని పాల్పడ్డారని అనుమానించిన వారిని అరెస్ట్ చేశారు. పవన్ విషయంలో అయితే ఆయన హొటల్ కే పరిమితం అయిపోయారు. తన పార్టీ వారు అరెస్ట్ అయ్యారు కాబట్టి జనవాణిని వాయిదా వేసుకున్నామని చెప్పారు.
ఆ తరువాత ఆయన విజయవాడ వచ్చినా హైదరాబాద్ వెళ్లినా రోజులు గడచినా విశాఖ విషయం మాత్రం మదిలో అలాగే ఉంది అంటున్నారు. దాంతో ఇపుడు ఆయన విశాఖలో భారీ ఎత్తున లాంగ్ మార్చ్ ని తలపెట్టబోతున్నారుట. దాదాపుగా అయిదు కిలోమీటర్ల మార్చ్ ని నవంబర్ 3న నిర్వహించేందుకు పవన్ సన్నాహాలు చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. దీని మీద మంగళగిరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
ఇప్పటికి మూడేళ్ళ క్రితం 2019 లో విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. అయితే ఆనాటి పరిస్థితులు వేరు. ఇపుడు రాజకీయం వేరు. పవన్ లాంగ్ మార్చ్ అయిదు కిలోమీటర్లు అంటే పోలీసులు అనుమతి ఇస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి. విశాఖ గర్జనను మించి మూడు రాజధానుల నినాదాన్ని మరపించేలా విశాఖ మార్చ్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది.