జనసేనాని పవన్‌కల్యాణ్, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య ఎడెతగని పోరు నడుస్తూనే వుంది. పవన్‌కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేయడంలో వెల్లంపల్లి ముందు వరుసలో వుంటారు. తాజాగా పవన్‌కు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్‌లో వెల్లంపల్లి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కు పిచ్చి పెరిగిపోయిందని ఘాటు విమర్శ చేశారు. పశ్చిమ నియోజకవర్గంపై పవన్ సమీక్షించడం కాదని, దమ్ముంటే తనపై పోటీ చేయాలని జనసేనానికి సవాల్ విసిరారు.
తనతో ఢీకొంటే పవన్ సత్తా ఏంటో, తన దమ్ము ఏంటో తేలిపోతుందని వెల్లంపల్లి తేల్చి చెప్పారు. వీకెండ్ హాలిడేకి వచ్చి వెళ్లడం కాదని, దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని మాజీ మంత్రి డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. పనిలో పనిగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కూడా వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడికి దున్నపోతులాగా వయసు పెరిగిందే తప్ప జ్ఞానం పెరగలేదని విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడి పని అయిపోయిందన్నారు.
వెల్లంపల్లి గతంలో పీఆర్పీలో ఉన్నారు. 2009లో విజయవాడ పశ్చిమనియోజకవర్గం నుంచి పీఆర్పీ తరపున గెలుపొందారు. అప్పట్లో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మేయర్ మల్లికాబేగంను ఆయన ఓడించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి తరపున సీపీఐ బరిలో దిగింది.
మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు పోటీ చేసి మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. రాజకీయంగా తాము భిక్ష పెట్టినట్టు వెల్లంపల్లిపై జనసేన నేతలు విమర్శలు చేస్తుంటారు. అందుకే జనసేన, వెల్లంపల్లి మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా వుంటోంది. తాజాగా వెల్లంపల్లి ఓపెన్ ఛాలెంజ్‌ను జనసేనాని ఎలా తీసుకుంటారో చూడాలి!