రాయలసీమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే మొనగాడు, మొగాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూపంలో వచ్చాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలో సీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన అనంతరం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహిరంగ సభ జరిగింది. భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి భూమన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
రాయలసీమకు చంద్రబాబునాయుడు చేసిన ద్రోహం అంతాఇంతా కాదన్నారు. పిల్లనిచ్చిన మామతో పాటు గద్దెనెక్కిచ్చిన సీమను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని విమర్శించారు. మన ప్రాంతం అభివృద్ధి కాకూడదని, రాయలసీమలో న్యాయ రాజధాని వుండకూడదని, 29 గ్రామాల టీడీపీ నేతల కోసం, మన వెంకన్న దగ్గరికి, మనం నాశనం కావాలని, అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని పాదయాత్ర చేస్తే …చంద్రబాబునాయుడు ఎర్రతివాచీలు పరిచారని విరుచుకుపడ్డారు. ఇదా సీమ గడ్డపై పుట్టిన వాడి పౌరుషం? పౌరుషం అంటే ఏంటో జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని భూమన కోరారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా దాడులు చేసినా, ద్రోహం చేయాలని తలపెట్టినా, జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని అనుకున్నా అదిరేబెదిరే గుండె దేవుడు ఆయనకు ఇవ్వలేదన్నారు.
రాయలసీమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో 85 ఏళ్లుగా ఏదో ఒక రూపంలో ఉద్యమాలు చేస్తున్నట్టు భూమన గుర్తు చేశారు. ప్రజల నాడి తెలిసిన నాయకుడు, ప్రజల హృదయాల పట్ల తన గుండెల్లో తడి నింపుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి సంకల్పంతో కర్నూలుకు న్యాయరాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు, ఆయన్ను సమర్థించే నాయకులు పదేపదే కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే… రాయలసీమ అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నిస్తున్నారన్నారు.
హైకోర్టు పెడితే అభివృద్ధి కాదని చంద్రబాబునాయుడుకు భూమన చెప్పారు. న్యాయ రాజధాని వస్తే రాయలసీమలోని 8 జిల్లాల ప్రజానీకం ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. ఇంత కాలానికి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే మొనగాడు, మగాడు ఒకడొచ్చాడు జగన్ రూపంలో అని భూమన చెప్పుకొచ్చారు. ఆ సంతృప్తి రాయలసీమ వాసులకు మిగులుతుందన్నారు. దమ్మున్న నాయకుడు కావడం వల్లే సీమకు న్యాయ రాజధాని తీసుకొచ్చాడని ఆయన అన్నారు. దమ్మున్న నాయకుడు కావడం వల్లే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సంకల్పించాడన్నారు.
కరవు సీమ ఆక్రందనను అర్థం చేసుకున్న వ్యక్తిగా, రాయలసీమ స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చివేస్తాడనే నమ్మకం ఈ రోజు తరలివచ్చిన లక్షలాది మంది జనమే నిదర్శనమన్నారు. ఇది కేవలం జగన్ తీసుకున్న నిర్ణయానికి సమర్థనే కాదు, చంద్రబాబు చేసిన ద్రోహానికి సమాధానం అని స్పష్టం చేశారు. చంద్రబాబును సమర్థిస్తున్న దుష్టశక్తులకు ఇదే హెచ్చరిక అన్నారు. తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన అని ప్రకటించగానే, ఈ మహాయజ్ఞంలో రక్తం పోయడానికి రాక్షసుల్లా చంద్రబాబు, ఆయన్ను సమర్థించే రాజకీయ పక్షాలు పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
అలాంటి వాళ్లంతా జనస్పందన ఏంటో చూడాలని హితవు పలికారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఇవాళ మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన జనాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని భూమన అన్నారు.