అధికారులు అయినా రాజకీయ నాయకులు అయినా ప్రజలను పాలించడానికే ఉన్నారు. వారి ఆలనా పాలనా చూడడానికే ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన చక్కని అవగాహన ఉండాలి. ఒక విధంగా చెప్పాలి ఆంటే వారు పాలనా రథానికి రెండు చక్రాలు లాంటి వారు. అలాగే, రెండు కళ్ళ లాంటి వారు. ఈ ఇద్దరిలో ఎవరు తగ్గినా లేక ఎవరు హెచ్చినా కూడా ఇబ్బందులు తప్పవు.
ఇదంతా ఎందుకంటే విశాఖలో ఇపుడు ఒక ఉన్నత మహిళా అధికారి విషయంలో వివాదం సాగుతోంది. ఆమె బదిలీ కోరుతున్నారు ప్రజా ప్రతినిధులు. దాని మీద ఈ మధ్య ఒక సమావేశం కూడా జరిగింది.
ఆమె ఒక రాజకీయ పార్టీకి వారికి అనుకూలమని కూడా అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బదిలీ చేసి తీరాల్సిందే అని వారు పంతం పట్టి కూర్చున్నారు. ఇదే రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంటే తాజాగా ఆ మహిళా ఉన్నతాధికారి చేసిన ఒక ట్విట్ మరింతగా కాక పుట్టిస్తోంది.
ధర్మం తప్పకూడదు, ధీరుడు, వీరుడు ధర్మం వైపు ఉండాలి. ఎవరికీ భయపడకూడదు అంటూ ఆమె చేసిన ఈ ట్విట్ ఎవరిని ఉద్దేశించి అన్నది అర్ధం కాక విశాఖ రాజకీయ నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
మొత్తానికి విశాఖలో ఆ మహిళా అధికారి వర్సెస్ అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయింది అనే అంటున్నారు. మరి చూడాలి. ఇది ఎంత దూరం వెళ్తుందో.. ఏమి జరగనుందో…