ఢిల్లీలో కేసీఆర్ మంత్రాంగం ఏమిటి ?

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి అయిదు రోజులైపోయింది. తెలంగాణా భవన్ శంకుస్థాపన కోసం ఆయన పర్యటన షెడ్యూల్ మూడు రోజులు మాత్రమే. రెండో తేదీన శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం ఒకటో తేదీన వెళ్లారు. ఈ కార్యక్రమం…

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి అయిదు రోజులైపోయింది. తెలంగాణా భవన్ శంకుస్థాపన కోసం ఆయన పర్యటన షెడ్యూల్ మూడు రోజులు మాత్రమే. రెండో తేదీన శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం ఒకటో తేదీన వెళ్లారు. ఈ కార్యక్రమం అయిపోయాక తెల్లవారి తిరిగి రావాల్సి ఉంది. కానీ ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో అక్కడ ఏం రాచ కార్యాలు చేస్తున్నారు ? ఏం మంత్రాంగం నడిపిస్తున్నారు? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఊరకే రారు మహాత్ములు అన్నట్లుగా ఊరకే వెళ్ళరు.  మహాత్ములు అని అనుకోవలసి వస్తోంది. కేసీఆర్ చేసే ప్రతి పనికి ఒక అర్థం, అంతరార్థం ఉంటాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే కేసీఆర్ ప్రతి పనిలో రాజకీయ ప్రయోజనాలు చూస్తారు.

పైకి ఆయన తెలంగాణా భవన్ శంకుస్థాపన కోసం వెళ్లినట్లు కనబడుతున్నా పక్క ప్లాన్ తో వెళ్లారని రాజకీయ విశ్లేషకులు, మీడియా వాళ్ళు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఈజీగానే దొరికింది. ఇంకా రాష్ట్రపతిని, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలవాల్సి ఉంది. ఆ పని ఈరోజు అవుతుందేమో. మోదీ, అమిత్ షా కు దాదాపు ఒకే రకమైన విజ్ఞప్తులు చేశారు కేసీఆర్. ఇద్దరూ బాగా ఎక్కువ సమయమే ఇచ్చారు. రెడీ మెడ్ గా తయారుచేసి పెట్టుకున్న వినతిపత్రాలు వారికి అందచేశారు. ఇది పైకి కనిపించేది, మీడియాకు అందిన న్యూస్.

కానీ లోపల ఇంకా ఏం జరిగి ఉంటుంది? మీడియాలో వస్తున్న ఇన్నర్ స్టోరీస్ లో ఎక్కువగా ఇలా జరిగి ఉండొచ్చన్న అంచనాలే ఉంటాయి. కొంత మేరకు వాస్తవం కూడా ఉండొచ్చేమో చెప్పలేం. తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ పైకి కొట్టుకుంటున్నట్లు కనబడుతున్నా కేసీఆర్ – మోదీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని, కొట్టుకోవడం కూడా ఒక విధమైన డ్రామా అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటుంది. కొన్ని విషయాలను చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. దక్షిణ భారత దేశానికి చెందిన ఏ రాజకీయ పార్టీకీ ఢిల్లీలో ఇప్పటివరకు సొంత భవనం లేదు. బీజేపీతో ఏళ్ళ తరబడి అంటకాగిన టీడీపీకి సైతం దేశ రాజధానిలో భవనం లేదు. దక్షిణాదిలో చాలా పార్టీలు టీఆరెస్ కంటే సీనియారిటీ ఉన్నవి. టీఆరెస్ జస్ట్ ఇరవై ఏళ్ళ కిందటిది.

కానీ కేంద్రం దానికి భవనం కోసం స్థలం ఇచ్చింది. సత్సంబంధాలు లేకపోతే ఇది సాధ్యమా ? పార్టీ భవనం కోసం స్థలం ఇచ్చేసరికి తాజా భేటీలో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి కూడా భవనం కట్టుకుంటామని, స్థలం కావాలని అడిగారు. సరేనని మోదీ హామీ ఇచ్చారు. ఇక తెలంగాణా పర్యటనలకొచ్చే కేంద్ర మంత్రుల్లో ఎక్కువమంది కేసీఆర్ పథకాలను యమ పొగుడుతుంటారు. 

రాష్ట్ర బీజేపీ నాయకులేమో అవే పథకాలను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఈ మధ్యనే ఒక మంత్రి వచ్చి పల్లె ప్రగతి కార్యక్రమం బ్రహ్మాండంగా ఉందని కితాబిచ్చాడు. కేంద్ర మంత్రులు రాష్ట్ర పథకాలను పొగడటం తమకు ఇబ్బందిగా ఉందని ఇక్కడి నాయకులు చాలా సార్లు కేంద్ర మంత్రులకు చాలాసార్లు చెప్పారు. ఇక కేసీఆర్ రీసెంట్ పర్యటనలో కూడా ఆయనకు అసలు అప్పాయింట్ మెంట్ ఇవ్వొద్దని ప్రధానిని కోరారట. కానీ అపాయింట్ మెంట్ వెంటనే దొరికింది.

కేంద్రంలో మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ తమకు సీట్లు తగ్గితే టీఆర్ఎస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. దీనిపై కేసీఆర్-మోదీ మధ్య చర్చలు జరిగే ఉంటాయని మీడియా అంచనా వేస్తోంది. గతంలో కేసీఆర్ కూతురు కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఆమెకు మంత్రి పదవి ఇస్తామని మోదీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు కవిత కూడా పరిశీస్తామని చెప్పింది. కానీ బ్లంట్ గా చేరబోమని చెప్పలేదు. 

కేసీఆర్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని మొండిగా వ్యతిరేకించలేదు. తనకు కొంత అవకాశం ఉంచుకున్నారు. కేంద్ర తెచ్చిన పలు బిల్లులను టీఆర్ఎస్ సమర్ధించింది. మద్దతు ఇచ్చింది. బీజేపీకి అంశాలవారి మద్దతు ఇస్తామని తెలిపింది. పెద్దనోట్ల రద్దును, జీఎస్టీని సమర్ధించింది. ఇతర పార్టీలు రైతు వ్యతిరేక చట్టాలు ఉంటున్నవాటికి కూడా మద్దతు పలికింది. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలతో పూర్తిగా కలిసి నడవడంలేదు గులాబీ పార్టీ. తాగాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా కేసీఆర్ – మోదీ భేటీ తరువాతే వాయిదా పడిందంటున్నారు.

స్కూళ్ళు తెరవడానికి అడ్డుపడని కరోనా హుజూరాబాదు కు ఎందుకు అడ్డం వచ్చాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తొందరగా జరగాలని రాష్ట్ర బీజేపీ కోరుకుంటుంటే అది ఇంకా వెనక్కి పోయింది. ఈ విధంగా కేంద్రం టీఆర్ఎస్ విజయానికి అవకాశం కల్పించిందని అంటున్నారు. రాజకీయ నాయకులు ఏ పనీ ప్లాన్ లేకుండా చేయరు. ఏ మాటా ప్లాన్ లేకుండా మాట్లాడారు. ముఖ్యంగా కేసీఆర్.