తెల్లారడమే ఆలస్యం… జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటారు. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు, లోకేశ్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎలా విమర్శించాలనే అంశాలను రాసి పెట్టుకుని వుంటారు. జగన్‌పై విమర్శల యావలో కేంద్రాన్ని పరోక్షంగా వెనకేసుకు రావడం విమర్శలకు దారి తీస్తోంది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడితే, రాష్ట్రంలో జేఎంఎం ట్యాక్సులు కట్టి పనులు ప్రారంభించాల్సి వస్తోందని ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్సులు చెల్లిస్తేనే పనులు చేయనిస్తున్నారని ఆయన విమర్శించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే ఇందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
దేశంలోని ప్రభుత్వ ఆస్తులన్నింటిని మోడీ సర్కార్ తెగనమ్ముతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటిది మోడీ సర్కార్ కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలు పెట్టడాన్ని అచ్చెన్నాయుడు ఎక్కడ చూశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఏపీలో ఒకవైపు సంక్షేమ పథకాలకు ప్రభుత్వ సొమ్మునంతా పంచుతోందని విమర్శలు చేస్తూనే, మరోవైపు ట్యాక్స్ చెల్లించనదే పనులు జరగనివ్వడం లేదని అచ్చెన్నాయుడు విమర్శలు చేయడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏది నిజమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.