ఏపీలో రోడ్ల పరిస్థితి ఎందుకిలా ఉంది..? నిధులున్నాయా..లేవా? కాంట్రాక్టర్లు ఎందుకు మందుకు రావడం లేదు.. అనే విషయాలను పక్కనపెడితే. ఇటీవల రోడ్లపై ఉన్న గుంతల పక్కన నిలబడి ఫొటోలు దిగి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జనసేన ప్రచారం మొదలు పెట్టింది. కాస్తో కూస్తో దాని ప్రభావం వైసీపీపై పడింది. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలతో జనసేన నాయకులకు ఘర్షణలు కూడా జరిగాయి. ఈ ఘర్షణల వల్ల జనసేనకు మరింత మైలేజీ పెరిగింది.
అయితే ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోడ్ల సమస్యలపై ఎందుకు పోరాటం చేయలేదనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు గుంతలు తేలిన నాసిరకం రోడ్లన్నీ చంద్రబాబు హయాంలో వేసినవే. వైసీపీ అధికారంలోకి వచ్చాక బాబు ఈ విషయాన్ని హైలెట్ చేయకపోవడానికి కారణం అదే. అంతే కాదు.. బాబు హయాంలో వేసిన రోడ్లకు బిల్లులు చెల్లించకుండా దాటవేశారు. ఆ భారం కూడా వైసీపీపై పడింది. వైసీపీ ఈ చెల్లింపుల వ్యవహారాన్ని నాన్చడంతో రోడ్లు మరమ్మతులు చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.
ఒక రకంగా ఇదంతా టీడీపీ పాపమే. టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూడా కాంట్రాక్టర్లకు డబ్బులివ్వకుండా టీడీపీ దిగిపోయింది. రోడ్ల వ్యవహారం కూడా అలాగే బిల్లు చెల్లింపుల వద్దే ఆగిపోయింది.
అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారవుతున్నా టీడీపీ నోరు మెదపడంలేదు. ఎంత సేపు.. లేని సమస్యలను ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ, కళ్లముందు కనపడుతున్న రోడ్ల సమస్యని మాత్రం టీడీపీ పూర్తిస్థాయిలో హైలెట్ చేయలేకపోయింది. ఈ క్రమంలో జనసేన ఎంట్రీతో చంద్రబాబుకి షాక్ తగిలింది.
ఇన్నాళ్లూ తాము కప్పిపెట్టామనుకున్న వ్యవహారాన్ని జనసేన హైలెట్ చేసింది. పరోక్షంగా అది చంద్రబాబు పాపమేననే విషయం బయటపడింది. ఆ పాపాన్ని బయటపెట్టిన ఘతన మాత్రం జనసేనకు, పవన్ కల్యాణ్ కే దక్కుతుంది.
అయితే వైసీపీ దీన్ని ఇంకా సాగదీయడం మంచిది కాదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా గత ప్రభుత్వం తప్పుకి ప్రజల్ని శిక్షించడం మంచిది కాదు. రోడ్లపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఇది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ రేట్ల పెంపు పాపాన్ని కూడా కాంగ్రెస్ పై నెట్టేసినట్టు.. ఏపీలో రోడ్ల దుస్థితికి వైసీపీ ఇంకా టీడీపీనే నిందిస్తూ కూర్చోవడం సరికాదు. కేవలం నవరత్నాలే నా టార్గెట్ అనుకుంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ఇకనైనా రోడ్ల మరమ్మతులపై జగన్ దృష్టిపెట్టాలి.