బొత్స లీక్స్ : అమరావతిలో ’సుజనాలు‘!!

వీకీలీక్స్ లాగా.. ‘బొత్స లీక్స్’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రాజధాని అమరావతికి సంబంధించి.. కొన్నిరోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్నిరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నా.. ఎందరు నాయకులు కొత్త…

వీకీలీక్స్ లాగా.. ‘బొత్స లీక్స్’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రాజధాని అమరావతికి సంబంధించి.. కొన్నిరోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్నిరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నా.. ఎందరు నాయకులు కొత్త పుకార్లకు ఆస్కారం కల్పిస్తున్నా… ఒకవైపు ఇది మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి మధ్య పరస్పర విమర్శనాస్త్రాల రూపు సంతరించుకుంది. తాజాగా సుజనా నోటికి తాళాలు వేసేలా.. బొత్స అనేక వివరాలను బయటపెట్టారు.

తెలుగుదేశం నుంచి తాను భాజపాలోకి ఫిరాయించినప్పటికీ.. అమరావతి రాజధాని తరలిపోతోందనే పుకార్లపై తెలుగుదేశం వారికంటె ఎక్కువగా సుజనాచౌదరి ఆగ్రహోదగ్రులయ్యారు. రాజధానిని తరలించడానికి వీల్లేదని కొన్ని రోజులుగా ప్రతిచోటా చెబుతున్నారు. తనకు రాజధాని ప్రాంతంలో ఎలాంటి ఆస్తులు లేవని, అలా ఉంటే చూపించవచ్చునని, తాను ఆస్తులకోసం కాకుండా… రాష్ట్ర ప్రయోజనాలకోసమే మాట్లాడుతున్నానని సుజనా అన్నారు. దీనిపై బొత్స ఘాటుగానే స్పందించారు. ఆయన సవాలు చేస్తే గనుక.. వివరాలు మొత్తం వెల్లడిస్తానని… ఎవరెవరి బినామీలకు ఎన్నెన్ని ఆస్తులున్నాయో చెబుతామని అన్నారు.

తాజాగా మంగళవారం నాడు సుజనా చౌదరి.. మళ్లీ అమరావతిపై విమర్శలు చేశారు. రాజధాని అంటే ఒకటి తీసేసి మరొకటి వేసుకునే చొక్కా లాగా కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలని అన్నారు. జగన్ ప్రకటన వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యచరణ ఉంటుందన్నారు. అవినీతి జరిగితే విచారించాలే తప్ప.. తరలింపు సరికాదన్నారు.

దీంతో బొత్స చెప్పిన గడువు పూర్తయిపోయింది. సుజనా ప్రకటన వచ్చిన వెంటనే బొత్స కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. రాజధాని ప్రాంతంలో సుజనా బినామీలకు ఎన్నేసి ఆస్తులున్నాయో లెక్కలు చెప్పారు. వారి జాతకాలు మొత్తం బయటపెట్టారు. కేవలం సుజనా బినామీలే కాదు, బాలకృష్ణ తరఫు వారికి ఎవరికి ఎంత అక్రమంగా భూములు కట్టబెట్టారో కూడా వివరాలు చెప్పారు. ఆ ప్రకారం చూస్తే..

సుజనాకు చెందిన కళింగ గ్రీన్ టెక్ కంపెనీ జితిన్ కుమార్ కు చండర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయి. సుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి ఋషికన్యకు వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి 493 ఎకరాలు లక్ష రూపాయల చొప్పున ఇచ్చారు. ఈ భూములను తొలుత ఏపీఐఐసీ ద్వారా భూమి ఇచ్చిన తర్వాత సీఆర్డీఏలో కలిపారు.. ఈ వివరాలను బొత్స బయటపెట్టారు. ఇంకా ఇలాంటి వివరాలు చాలా ఉన్నాయని చెప్పారు.

తెలుగుదేశం నాయకులు రాజధాని తరలిపోతుందని ఎందుకు ఆక్రోశిస్తున్నారో.. గొల్లు మంటున్నారో ఈ వివరాలు చూస్తే అర్థమవుతుంది. మరి వీటిపై ఆయా నాయకులు ఏం చెబుతారో చూడాలి.

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..