సాహో సినిమా వాయిదా పడ్డంతో.. వాల్మీకి, గ్యాంగ్ లీడర్ సినిమాల మధ్య పోటీ తప్పలేదు. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 13కే ఫిక్స్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో వాల్మీకి యూనిట్ అస్సలు తగ్గలేదు. అందరికంటే ముందే తాము ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నామని కాస్త బెట్టు చేశారు. ఎట్టకేలకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ చొరవతో ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికింది.
దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వ్యక్తుల మధ్యవర్తిత్వంతో ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకుండా చేయగలిగారు. ఫలితంగా వాల్మీకి సినిమా ఓ వారం వెనక్కితగ్గింది. 13న రావాల్సిన ఈ సినిమాను 20కు వాయిదా వేశారు. గ్యాంగ్ లీడర్ సినిమా 13కు వచ్చేస్తుంది. ఇకపై కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నిర్మాతలమంతా కూర్చొని పరిష్కరించుకుంటామంటున్నాడు దిల్ రాజు.
“గ్యాంగ్ లీడర్ 13కి, వాల్మీకి 20కి రావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకుంటేనే అన్ని విధాలుగా మంచిది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మా గిల్డ్ సభ్యులు జోక్యం చేసుకుంటాం. సమస్యల్ని పరిష్కరించుకుంటాం. పండగలప్పుడు ఎలాగూ పోటీతప్పదు. పండగలు లేని టైమ్ లో ఇలాంటి రిలీజ్ సమస్యలొస్తే మేమంతా కూర్చొని పరిష్కరించుకుంటాం.”
అయితే రన్నింగ్ లో లేని నిర్మాతలకు ఈ వెసులుబాటు ఉండదంటున్నాడు దిల్ రాజు. అంటే రెగ్యులర్ గా సినిమాలు తీయరో వాళ్ల సమస్యలు తమ బాధ్యత కాదన్నట్టు మాట్లాడాడు. మరోవైపు డబ్బింగ్ సినిమాల క్లాష్ పై కూడా రియాక్ట్ అవ్వలేదు. అటు పండగ సీజన్ కూడా దీనికి అతీతమని ప్రకటించాడు. పండగ టైమ్ లో పెద్ద సినిమాలు ఎన్నయినా రావొచ్చంట.