సినీ పరిశ్రమలో చాలా మంది మధ్యన విబేధాలను, తగాదాలను, చాలా మంది సమస్యలను పరిష్కరించారనే పేరు దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావుకు ఉందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఆయన తనయుల మధ్య మాత్రం ఆస్తుల వివాదం ఇంకా పరిష్కారం కానట్టుగా ఉంది. దాసరి నారాయణ రావు జీవించి ఉన్నప్పుడు కూడా కొన్ని వివాదాలు వార్తల్లోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఆయన తనయుడు ప్రభు, అరుణ్ కుమార్ ల మధ్యన ఆస్తి వివాదం రచ్చకు ఎక్కింది. తమ మధ్యన ఆస్తి వివాదం ఉందని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. అంతకు మించి వేరే వివాదాలు లేవని ఆయన అంటున్నారు.
జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంటి విషయంలో వివాదం ఉందని, ఆ ఇంటి విషయంలో దాసరి సంతతికి అంతా వాటా ఉందని అరుణ్ అంటున్నారు. అయితే ఆ ఇంటిని తన తండ్రి తన కూతురు పేరు మీద రాశారని తన అన్న ప్రభు అంటున్నారని, ఆ మేరకు వీలునామా చూపించమని అడుగుతున్నట్టుగా అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. తన అన్న కూతురు పేరిట ఆ ఇంటిని రాసింది నిజమే అయితే, ఆ వీలునామాను చూపించాలని డిమాండ్చ చేస్తున్నట్టుగా చెప్పారు. అలాంటి వీలునామా ఏదీ లేని పక్షంలో ఆ ఇంట్లో తమ అన్నదమ్ములకు, సోదరికి కూడా వాటా ఉంటుందని అరుణ్ కుమార్ అంటున్నారు.
ఇటీవలే ఆ ఇంట్లోకి తను ప్రవేశించి దౌర్జన్యం చేసినట్టుగా తన అన్న పోలిస్ కేసు పెట్టారని, తన ఇంట్లోకి తను వెళ్లడం ఎలా దౌర్జన్యం అవుతుందని ఆయన ప్రశ్నించాడు. ఇక ప్రభు స్పందిస్తూ.. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆయన అంటున్నారట. అరుణ్ దౌర్జన్యం చేస్తున్నాడనే ఆరోపణలకు ఆయన కట్టుబట్టారట. మొత్తానికి దాసరి తనయుల ఆస్తి వివాదం రచ్చకు ఎక్కింది. మరి సినీ పరిశ్రమ వాళ్లు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేస్తారా?