బాలీవుడ్ లో నెపోటిజం పై చర్చ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో పలుకుబడి కలిగిన పలువురు హీరోలు తమకు నచ్చని వారిని తొక్కేస్తారు.. అనే అంశంపై చర్చలో భాగంగా కెరీర్ పరంగా రాణించలేకపోయిన పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగా వివేక్ ఒబెరాయ్ పేరు కూడా తెర మీదకు వచ్చింది.
వివేక్ ఒబెరాయ్ కూడా వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తే. ఇతడి తండ్రి సురేష్ ఒబెరాయ్ బాలీవుడ్ లో విలన్ పాత్రలు చేశారు. అలాగే ఒక ధనిక కుటుంబం వీళ్లది. అలాంటి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన వివేక్ మొదట్లో సినిమాలతో కన్నా ఐశ్వర్యరాయ్ తో ఎఫైర్ ద్వారా దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు.
సల్మాన్ కు బ్రేకప్ చెప్పి దూరం అయిన ఐశ్వర్యరాయ్ వివేక్ తో సన్నిహితంగా మెలగసాగింది. ఆ దశలో సల్మాన్ తనను బెదిరించాడని వివేక్ ఒబెరాయ్ ఒకప్పుడు చెప్పిన వీడియోలను కొన్ని మీడియా వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. ఆ వీడియోల్లో వివేక్ సంచలన ఆరోపణలు చేశాడు.
ఒక రోజు తనకు సల్మాన్ నుంచి ఫోన్ వచ్చిందని, ఐశ్వర్యకు దూరంగా ఉండమని సల్లూ తనను బెదిరించాడని వివేక్ చెప్పుకొచ్చాడు. అంతేగాక.. బాలీవుడ్ లో అప్పుడు ఊపు మీదున్న పలువురు హీరోయిన్లతో తనకు శృంగార సంబంధాలున్నాయని సల్మాన్ తనతో చెప్పాడని వివేక్ అన్నాడు. సదరు హీరోయిన్ల పేర్లను కూడా వివేక్ ప్రస్తావించాడు. వాళ్లవ్వరో కాదు.. రాణీ ముఖర్జీ, దియా మీర్జా, సోమీ అలీ లాంటి వాళ్లు తనతో గడిపిన వారేనంటూ సల్మాన్ తనతో అన్నాడని వివేక్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. సల్మాన్ తనను హెచ్చరించడానికి చేసిన ఫోన్ కాల్ లో ఆ విషయాలన్నింటినీ చెప్పాడని వివేక్ ఒబెరాయ్ అన్నాడు.
ఈ వీడియో ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంది. సల్మాన్ గురించి ఇలా మాట్లాడాకా.. వివేక్ ఒబెరాయ్ కెరీర్ చాలా దెబ్బతిన్నదని, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ లో స్టార్ కాలేకపోయాడని, వివేక్ ను సల్మాన్ ఆ స్థాయిలో తొక్కేశాడని కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. మసాలా విషయాలతో వివేక్ చెప్పిన ఆ వీడియో వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ తీరు గురించి చర్చ జరుగుతూ ఉంది.