చైనా వస్తువులను బహిష్కరించేయాలి.. చైనా జెండాలను తగలబెట్టాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కొనసాగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టడం దేశభక్తిగా మారిందని వేరే చెప్పనక్కర్లేదు. సరే.. ఈ దేశభక్తి ప్రకారమే ముందుకు వెళ్దామన్నా, ఇలాంటి పోస్టులు పెట్టే వారికి ఇండియాలో తయారీ రంగం ఉన్న దుస్థితి గురించి అవగాహన ఉందా?
చైనా వస్తువులను బహిష్కరించడం అనేది ఏ కాషాయ వాదుల ఆలోచనే కాదు, సగటు భారతీయుడికి కూడా స్వదేశీ వస్తువులను కొనాలనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టేసి తమ దేశభక్తిని నిరూపించుకునేంత హీరోలు కాకపోయినా, మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వైపు మొగ్గు చూపే వాళ్లు దేశంలో కోట్లలో ఉంటారు.
అయితే.. ఇంతకీ మార్కెట్ లో ఇండియాలో తయారీ అయిన వస్తువులు అందుబాటులో ఉన్నాయా? అనేది ప్రశ్న! ఇండియాలో తయారీ రంగం దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మేకిన్ ఇండియా పిలుపులు కేవలం పిలుపుల వరకే!
ఆఖరికి దోమలను చంపేందుకు ఉపయోగించే బ్యాట్స్ ను కూడా ఇండియా చైనా నుంచినే దిగుమతి చేసుకుంటూ ఉంది. అదేమీ రాకెట్ టెక్నాలజీ కాదు. ఆ తరహా పరిశ్రమలు పెట్టేనాథుడే లేనట్టుగా ఉన్నాడు.. అందుకే అవి తప్పనిసరిగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. అవే మార్కెట్ లో కనిపిస్తూ ఉన్నాయి. వాటినే ప్రజలు తప్పనిసరిగా కొనాల్సి వస్తోంది.
ఇక్కడ చైనా వస్తువుల బహిష్కరణ గురించి మాట్లాడటాని కన్నా మునుపు.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చైనా నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి అవుతున్నాయి? వాటి మార్కెట్ రేంజ్ ఎంత? వాటిలో మనం వేటిని తయారు చేసుకోగలం? చైనా నుంచి దిగుమతుల్లో డిమాండ్ ఉన్న అలాంటి వస్తువులను నోట్ చేసి, అలాంటి పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని భారతీయ పారిశ్రామిక వేత్తలకు పిలుపును ఇవ్వొచ్చుగా?
దోమల బ్యాట్ ను కూడా చైనా నుంచి వస్తున్న వాటినే కొంటున్నాం అని సిగ్గు పడటం కాదు, కనీసం మనం దోమల బ్యాట్ ను తయారు చేసుకోలేకపోతున్నాం అని సిగ్గుపడాలి! అది తయారు చేసుకోలేనంత కష్టమైనదా? ఇటీవలే ఎంఎస్ఎంలకు ప్రోత్సాహం, అప్పులిస్తాం.. అని ప్రకటించారు. ఎలాంటి పరిశ్రమలు దేశంలో అవసరమో కూడా చిన్న పరిశ్రమలు పెట్టే వారికి ప్రభుత్వమే సూచనలు ఇస్తే, ఫలానావి దిగుమతి చేసుకుంటున్నాం, ఆ దిగుమతులను ఆపేద్దాం.. మీరు అలాంటి తయారీ చేయండని ఆసక్తి ఉన్న వారికి సూచనలు ఇవ్వలేని దుస్థితిలో మన వ్యవస్థ ఉందా? పారిశ్రామిక వేత్తలతో సదస్సులు అంటూ బోలెడంత ఖర్చుతో ప్రోగ్రామ్స్ పెడుతుంటారు కదా, ఇలాంటి ప్రయోజనకార కార్యక్రమాలు అక్కడ జరగవా?
పిల్లల ఆటబొమ్మల పరిస్థితి కూడా ఇంతే. కొన్ని రకాల పరిశ్రమల్లోని వ్యర్థాలతో బొమ్మలను తయారు చేస్తున్నారు చైనా వాళ్లు. ఇలాంటి అంశాల గురించి కూలంకషమైన అధ్యయనాలు జరిగి.. వాళ్లెలా తయారు చేస్తున్నారు, మనమెందుకు తయారు చేసుకోలేకపోతున్నాం.. .అనే చర్చ విస్తృతంగా జరిగితే, ఈ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటే.. అది కదా, మేకిన్ ఇండియా!
ఊరికే ఉత్త కబుర్లు చెప్పడానికి బదులు ఇలాంటి బాధ్యత తీసుకుంటే దాని ప్రయోజనాలు మాటల కన్నా వందల రెట్లు ఎక్కువ కదా! క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్న మన దేశంలో వందశాతం పూర్తిస్థాయి సొంత టెక్నాలజీతో సెల్ ఫోన్లను తయారు చేసుకోలేకపోతున్నది వాస్తవం కాదా? ఇంతకీ మేకిన్ ఇండియా పిలుపుకు ఉన్న సార్థకత ఏమిటో.. ప్రభుత్వం చెప్పగలదా? మాటలు కాకుండా గణాంకాలతో వాస్తవాలను చెప్పగలరా? మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, మార్కెట్ లోకి వెళితే మళ్లీ మేడిన్ చైనా నే అదీ పరిస్థితి!