యంగ్ టాలెంటెడ్ డైరక్టర్లు టాలీవుడ్ లోకి వస్తున్నారు. అయితే మాస్ మూస చట్రాల్లో ఇరుక్కున్న పెద్ద హీరోలకు వీరి కథలు అంతగా రుచించడం లేదు. దాంతో వాళ్లు బాలీవుడ్ బాట పడుతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో మాంచి డైరక్టర్ అనిపించుకున్న సందీప్ వంగా ఓ సినిమాను మహేష్ తో చేయాలనుకున్నారు. కానీ ఎంతకీ కథ సెట్ కాలేదు. కానీ ఇంతలో బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి భయంకరమైన హిట్ కావడంతో ఆయన అక్కడ సెటిల్ అయిపోయేలా కనిపిస్తున్నారు.
మళ్లీరావా సినిమాతో దర్శకుడిగా వచ్చి, జెర్సీ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు ఇతగాడు కూడా బాలీవుడ్ బాట పడుతున్నాడు. జెర్సీ సినిమాను హిందీలో అల్లు అరవింద్, దిల్ రాజులతో కలిసి రీమేక్ చేస్తోంది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. హిందీ వెర్షన్ కు కూడా గౌతమ్ నే డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు.
హిందీ సినిమా స్టార్ట్ అయ్యేలోగా గౌతమ్ కు మరో తెలుగు సినిమా దొరికితే ఓకె. లేదూ అంటే బాలీవుడ్ కు వెళ్లి, ఇక అక్కడే ఫిక్స్ అయిపోతారేమో? ఎప్పటి నుంచో తెలుగులో అవకాశాలు లేని దేవాకట్టా హిందీకి వెళ్లి, తన ప్రస్థానం సినిమాను అక్కడ రీమేక్ చేసారు.
ఆ సినిమా ట్రయిలర్ చూసిన వారికి దాదాపు షాక్ నే. అంత టెర్రిఫిక్ గా వుంది. ఈ లైనప్ అంతా చూస్తుంటే మనదగ్గర వున్న టాలెంటెడ్ డైరక్టర్లు ఒక్కొక్కరు, బాలీవుడ్ బాటపట్టేలా వుంది వ్యవహారం.