అమరావతి రచ్చ.. సుజనా చౌదరి గోలేంటి.?

రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది.? మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు గురించి మాట్లాడలేదుగానీ, రాజధాని ప్రాంతం ముంపు ప్రమాదంలో వుందని ప్రకటించేసరికి.. ఒక్కసారిగా అమరావతి వార్తల్లోకెక్కింది. అధికార పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా…

రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది.? మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు గురించి మాట్లాడలేదుగానీ, రాజధాని ప్రాంతం ముంపు ప్రమాదంలో వుందని ప్రకటించేసరికి.. ఒక్కసారిగా అమరావతి వార్తల్లోకెక్కింది. అధికార పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందా.? లేదా.? అన్న సంగతి పక్కన పెడితే, విపక్షాలకు మాత్రం 'పబ్లిసిటీ స్టంట్‌' కోసం అద్భుతమైన 'ఐటమ్‌' దొరికిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకేనేమో, బొత్స మళ్ళీ మళ్ళీ ఈ వ్యవహారాన్ని కెలుకుతున్నారు.
 
తాజాగా, ఈ ఎపిసోడ్‌లోకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే బొత్స – సుజనా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 'బొత్సకి ఏమీ తెలియదు' అనేశారు సుజనా. 'సుజనా, రాజధానిలో నడిపిన భూ పందేరానికి సంబంధించిన లెక్కలు మా దగ్గర వున్నాయ్‌' అని బొత్స తేల్చిచెప్పారు. 'సెంటు భూమి నా పేరు మీద వుంటే నిరూపించాలి' అని సవాల్‌ విసిరేశారు సుజనా. 'అన్ని లెక్కలూ త్వరలో వస్తాయ్‌..' అని బొత్స రిటార్ట్‌ ఇచ్చారు.

కామెడీ కాకపోతే, అమరావతిలోనే కాదు.. రాజకీయ నాయకులు ఎక్కడ భూముల్ని బొక్కేసినా, వాటికి లెక్కలుంటాయి.? పైగా, సుజనా చౌదరి మీద ఇప్పటికే అనేక కేసులున్నాయి. అందులో బ్యాంకుల్ని ముంచేశాడన్నది ప్రధానమైన కేసు. 'ఆ కేసుతో నాకు సంబంధం లేదు..' అని ఇప్పటికీ బుకాయిస్తున్న సుజనా, అమరావతిలో తనకు భూములున్నాయని ఎలా ఒప్పుకుంటారు.? అయినా, రాజధాని ఎపిసోడ్‌లో సుజనా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు.!

ఒకప్పటి చంద్రబాబుతో బహిరంగ సాన్నిహిత్యం.. ఇప్పుడు తెరవెనుకాల సాన్నిహిత్యం సుజనా చౌదరిని, అమరావతిలోకి దూసుకొచ్చేలా చేసిందన్నది నిర్వివాదాంశం. తాజాగా, జగన్‌కి అమరావతి రైతుల సెగ తగిలేలా చేయడంలో ఇటు బీజేపీ, అటు టీడీపీ రెండూ సఫలమయ్యాయి. రాజధాని ప్రాంతంలో రైతుల పేరుతో గత రెండు మూడు రోజులుగా 'పెయిడ్‌' ఆందోళనలు జరుగుతున్న మాట వాస్తవం. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్‌లోకి మూడో కృష్ణుడు.. అదేనండీ పవన్‌ కళ్యాణ్‌ ఎంటర్‌ అవలేదు. ఆ ముచ్చటా రేపోమాపో తీరిపోనుంది.

ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి విషయంలో జగన్‌ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. అది రాజధాని మార్పు.. అని ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం తరఫున నిర్ణయం వుంటే, ఒక్క దెబ్బకి మూడు పిట్టలు (టీడీపీ, బీజేపీ, జనసేన) అవుతుందన్నది నిర్వివాదాంశం.

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..