హైందవ ధర్మక్షేత్రాల్లో అన్యమత ప్రచారం గురించి జగన్ మీద బురదజల్లడానికి మొదలుపెట్టిన వ్యవహారంతో చంద్రబాబు నాయుడు నిలువునా బుక్ అయిపోవడం గమనార్హం. తిరుపతికి వెళ్లే బస్ ల టికెట్ వెనుక హజ్ యాత్ర, జెరుసలేం యాత్రలకు సంబంధించిన యాడ్స్ ప్రచురణ వెనుక గత ప్రభుత్వమే ఉందని తేలింది. మైనారిటీ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అప్పట్లో చంద్రన్న హజ్ యాత్రలు, చంద్రన్న జెరుసలేం యాత్రలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటికి ప్రచారం కల్పించడం కోసం ఆర్టీసీ బస్సుల టికెట్ల వెనుక కూడా యాడ్స్ వేయించారు.
అలాంటి పేపర్ బండిల్స్ ను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే పక్కన పెట్టాల్సింది. అయితే కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో వాటిని బస్సులకు పంపడం, అవి తిరుపతి బస్ లకు కూడా చేరడం.. దానిపై వివాదం రేగడం జరిగింది. తీరా ఆ వ్యవహారం చంద్రబాబు నాయుడి ప్రచార పర్వంగా తేలడంతో కథ మలుపు తిరిగింది. ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు కిక్కురుమనడం లేదు.
వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో శ్రీశైలంలో అన్యమత వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వ్యవహరం మీదా విచారణ మొదలైంది. శ్రీశైలం దేవస్థాన సంబంధ నియామకాల్లో అన్యమతస్తులు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. విశేషం ఏమిటంటే.. ఆ నియామకాలు అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో చోటు చేసుకున్నవే!
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది, మిగతావాళ్లంతా చంద్రబాబు నాయుడు హయాంలోనే నియమితం అయ్యారని వారి జాయినింగ్ రిపోర్ట్స్ ను బట్టి తేలుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇలాంటి అన్యమత నియామకాలు జరిగిన.. టీడీపీ వర్గాలు జగన్ మీద బురదజల్లే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి.
ఒకవేళ కేవలం మీడియా మాత్రమే జనాల మీద ప్రభావం చూపుతూ ఉంటే ఆ కథ ఎలా ఉండేదో కానీ.. సోషల్ మీడియా యుగంలో అన్నీ వ్యవహారాలూ ప్రజలకు ఇట్టే తెలిసిపోతూ ఉన్నాయి. దీంతో పచ్చ పన్నాగాలు పారుతున్నట్టుగా లేవు.