అబార్షన్ హక్కు విషయంలో మూడు నెలల తేడాలో ఇండియా, అమెరికాలలో భిన్నమైన తీర్పులు వచ్చాయి. పాశ్చాత్యసమాజం కాబట్టి అక్కడి తీర్పు ఉదారంగా ఉండి వుంటుందని, యిక్కడ ఛాందసంగా ఉంటుందని అనుకునే వీలుంది. కానీ ఆశ్చర్యకరంగా పరిస్థితి తారుమారైంది. సెప్టెంబరు నెలాఖరులో సుప్రీం కోర్టులో జస్టిస్ చంద్రచూడ్ (ఇప్పుడాయన చీఫ్ జస్టిస్) నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అబార్షన్ విషయంలో వివాహితలకు, అవివాహితలకు మధ్య 51 ఏళ్లగా ఉన్న వివక్షతను తొలగించి వేసింది. 20-24 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునే హక్కు వివాహిత మహిళకు ఎంత ఉందో, అవివాహిత మహిళకూ అంతే ఉందంది.
1971 నాటి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటిపి) చట్టం అవివాహిత మహిళలు తమ 20-24 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకోవడాన్ని వ్యతిరేకించింది. శిశువును కనాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు యిద్దరికీ సమానంగా ఉంది అంది యిప్పుడీ కోర్టు. నిజానికి నన్నడిగితే ఒంటరి మహిళకు యింకా ఎక్కువుంది. వివాహిత మహిళైతే భర్త దన్ను ఉంటుంది. ఒంటరి మహిళ అయితే ఆ నిర్ణయం ఆమె ఒక్కరిదే. ఒంటరి మహిళకు అవాంఛిత గర్భం వస్తే అన్నీ చిక్కులే కదా! ఆమె ఎవరి చేతిలోనో మోసపోయి ఉండవచ్చు. బలాత్కారానికి గురై ఉండవచ్చు. గర్భం బయటపడితే సమాజం హీనంగా చూస్తుంది. తండ్రి ఎవరో చెప్పుకోలేని బిడ్డ మానసిక వేదనకు గురై, తల్లిని కూడా చీదరించుకుంటాడు.
వివాహితకైతే కుటుంబ రక్షణ ఉంటుంది. శిశువు ఎలా పుట్టినా ఆలనాపాలనా చూసేందుకు భర్త, యితర బంధువుల దన్ను ఉంటుంది. వివాహం కాని తల్లికి యిలాటి సౌకర్యం ఎక్కడుంటుంది? తన పొట్ట పోసుకోవడమే కష్టమైతే బిడ్డను ఎలా పోషిస్తుంది? ఏ అనాథాశ్రమంలోనే వదిలేస్తే వాళ్లు సవ్యంగా పెరుగుతారన్న నమ్మకం ఏముంది? వాళ్లు సమాజానికి చీడపురుగులుగా కూడా మారవచ్చు, సంఘవ్యతిరేక శక్తులుగా మారవచ్చు. దాని కంటె వారిని భూమి మీదకు తీసుకురాకపోడమే మేలు కదా! పెళ్లి కాకపోయినా బిడ్డను కని పోషించగల శక్తి ఉన్న మహిళకు అబార్షన్ ఐడియాయే రాదు కదా! ఐడియా వచ్చిందంటే ఆమె నిస్సహాయ మహిళ అనే అర్థం. ఆమెకు గర్భం నిలుపుకోవాలో వద్దో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ యివ్వకపోతే ఎలా?
వివాహేతర శృంగారాన్ని నియంత్రించే ఉద్దేశంతో, కడుపు వస్తే తీయించుకోవడం కుదరదు అనే భయంతో పెళ్లికాని ఆడవాళ్లు జాగ్రత్త పడతారనే ఊహతో, అవివాహిత అబార్షన్ చేయించుకుంటే శిక్షార్హురాలు అని 1973 చట్టం చేశారేమో తెలియదు. కానీ దీనివలన చట్టవిరుద్ధమైన అబార్షన్లు పెరిగాయి. ఎవరికీ తెలియకుండా చాటుగా చేయించుకోవాలి కాబట్టి, సరైన వైద్యుడి చేతనో, సరైన ఆసుపత్రిలోనో చేయించుకోవడం కుదరక ప్రమాదాల్లో పడడం జరుగుతోంది. 2007-11 మధ్య జరిగిన అబార్షన్లలో 57% ‘అన్‌సేఫ్’ (సురక్షితం కానివి) అని తేలింది. ఇప్పటికీ ప్రమాదకరమైన అబార్షన్ల కారణంగా దేశంలో రోజుకి 8 మంది స్త్రీలు మరణిస్తున్నారని కోర్టే చెప్పింది. క్షేత్రస్థాయి వాస్తవాలు యిలా ఉండగా దిల్లీ హైకోర్టు మాత్రం అనాలోచితమైన తీర్పు యిచ్చింది.
25 ఏళ్ల వయసున్న ఈశాన్య ప్రాంతానికి చెందిన ఒక యువతి ఒకతనితో సహజీవనం చేసి, గర్భవతి అయింది. అతను పెళ్లి చేసుకోనన్నాడు. రైతు కుటుంబంలో పుట్టి, ఆర్థిక స్తోమత, తలిదండ్రుల మద్దతు లేని తను ఒక బిడ్డకు జన్మనిచ్చి సాకలేనని, 22 వారాల తన గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునే వెసులుబాటు యివ్వాలని ఆమె హైకోర్టుకి వెళ్లింది. చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ (యీయన తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్‌గా పని చేశారు), జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో ఆమె సుప్రీం కోర్టుకి వెళ్లింది. సుప్రీం కోర్టు తన తీర్పు వచ్చేలోపున ఆమె గర్భం పెరిగిపోతుంది కాబట్టి జులై 21న మధ్యంతర ఉత్తర్వు యిస్తూ అబార్షన్ చేయించుకో నిచ్చింది. తర్వాత సెప్టెంబరు 29న పూర్తి తీర్పు వెలువరించింది.
1971 నాటి ఎంటిపి చట్టంలో కొన్ని గ్యాప్‌లు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం 2021లో కొన్ని సవరణలు చేసింది. అక్రమ సంబంధం లేదా బలాత్కారం ద్వారా గర్భం దాల్చినా, మైనర్లయినా, గర్భవతిగా ఉండగా భర్త పోయినా, విడాకులిచ్చాక గర్భం వచ్చినా, వికలాంగులైనా, పిండం సక్రమంగా ఎదగకపోయినా, శిశువు పుట్టిన తర్వాత బతకకపోవచ్చు అనో శారీరక లేదా మానసిక వైకల్యం రావచ్చు అని వైద్యులు నిర్ధారించినా, ఎమర్జన్సీ కేసుల్లో అబార్షన్‌ను అనుమతించవచ్చు అని సవరణలు చెప్తున్నాయి. అయితే యివన్నీ వివాహిత మహిళలకే వర్తిస్తాయి. అవివాహితల విషయంలో గర్భనిరోధక విధానాల వైఫల్యం వలన గర్భం దాల్చానంటూ అబార్షన్ కోరవచ్చు. కానీ ఆ గర్భం 20 వారాలకు లోపే ఉండాలి. ఈమె కేసులో గర్భం 22 వారాలది కాబట్టి ఆ చట్టం యీమెకు వర్తించదు అని హైకోర్టు అభిప్రాయ పడింది. ఇప్పుడు సుప్రీం కోర్టు అవివాహిత లేదా ఒంటరి మహిళలకు కూడా 20-24 వారాల రూలు వర్తింప చేయాలి అంటోంది.
ఇంకో విషయం కూడా చెప్పింది. రేప్ అనగానే బయటివాళ్లు బలాత్కరిస్తేనే రేప్ అనకూడదు, వివాహిత మహిళకు యిష్టం లేకపోయినా భర్త ఆమె చేత గర్భం దాల్పిస్తే దాన్ని కూడా రేప్ కింద పరిగణించి, ఆమెకు అబార్షన్ హక్కు ఉండాలి అని చెప్పింది. పిల్లల్ని కనాలా వద్దా అన్నది మహిళ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం ఆమెకు సిద్ధించిన వ్యక్తిగత స్వేచ్ఛ. దీనికి వైవాహిక స్థితితో సంబంధం లేదు. 24 వారాల లోపు సురక్షిత అబార్షన్‌ను వివాహితలకే పరిమితం చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. వైద్యులు కొందరు కుటుంబసభ్యుల అనుమతి కావాలి అంటూ చట్టానికి షరతులు పెడుతున్నారు. కుటుంబసభ్యులకు దీనితో ప్రమేయం లేదు. వైద్యులు నిరాకరించరాదు అని కూడా స్పష్టం చేసింది.
ఈ తీర్పు విని మామూలుగా అయితే హర్షించి ఊరుకోవచ్చు కానీ మూడు నెలల కితం జూన్ 24న అగ్రరాజ్యంగా, నాగరిక దేశంగా పేరుబడిన అమెరికా సుప్రీం కోర్టు డాబ్స్ వెర్సస్ జాక్సన్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కేసులో అబార్షన్‌పై యిచ్చిన తిరోగమన తీర్పుతో పోల్చి చూస్తే ఎగిరి గంతేయాల్సిందే. అక్కడి మహిళలకు అబార్షన్ హక్కు 1973లో సిద్ధించింది. రియో వర్సెస్ వేడ్ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కును 49 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు మూడు నెలల క్రితం తీసివేసింది. మధ్యలో 1993లో వచ్చిన పా వర్సెస్ కేసే కేసులో కూడా 1973 తీర్పుని నొక్కి వక్కాణించింది. అలాటిది యిప్పుడు ఆ తీర్పుని తిరగతోడింది. చెప్పిన కారణం ఏమిటంటే అబార్షన్ గురించి రాజ్యాంగం ప్రస్తావించలేదు, అబార్షన్ హక్కు యివ్వలేదు అని. ఆ మాటకొస్తే స్వలింగ వివాహాల గురించి, గోప్యతా హక్కు యిలాటి వాటి గురించి కూడా రాజ్యాంగంలో లేదు కదా, ఆ హక్కులను కూడా తీసేస్తారా?
జనాభా ఎక్కువగా ఉన్న చైనాలో అయితే 1958 నుంచి అబార్షన్‌ను చట్టబద్ధం చేసి, జనాభాను తగ్గించాలని చూశారు. అయినా జనాభా పెరిగిపోవడంతో 1970 తర్వాత బలవంతపు అబార్షన్లను కూడా ప్రభుత్వం ప్రోత్సహించింది. దీనివలన పిల్లలు పుట్టడం తగ్గిపోయారు. మరో పక్క ఆయుర్దాయం పెరిగి, జనాభాలో వృద్ధుల శాతం పెరిగిపోసాగింది. దీన్ని నియంత్రించడానికై ‘అనవసరంగా అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు’ అంటూ 2021లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అబార్షన్ చేయించుకోవడం మహిళా చైతన్యం చురుగ్గా ఉన్న యూరోప్ దేశాల్లో అబార్షన్ అతి సులభం. 1960లలోనే చట్టాలు వచ్చాయి. కేథలిక్కులు మతరీత్యా అబార్షన్‌ను వ్యతిరేకిస్తారు. కానీ యూరోప్, లాటిన్ అమెరికాలలో కేథలిక్ దేశాల్లో కూడా అబార్షన్‌ను చట్టబద్ధం చేశారు. ఐర్లండ్‌లో అబార్షన్ చట్టానికి పరిమితులు విధిద్దామా అని 2018లో రిఫరెండం పెడితే మహిళలు దాన్ని తిరస్కరించారు.
ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్ చట్టవిరుద్ధం. వీటిల్లో ఆఫ్రికా దేశాలు అత్యధికంగా ఉంటే మధ్య అమెరికా, మధ్య ప్రాచ్యంలోని దేశాలు కూడా ఉన్నాయి. 50 దేశాల్లో పరిమితులతో కూడిన హక్కులున్నాయి. జనాభాను ఎలాగైనా పెంచాలనే లక్ష్యంతో పోలండ్ ప్రభుత్వం గత ఏడాది అబార్షన్‌పై నిషేధాన్ని విధించింది. అమెరికా కోర్టు ఏ ఉద్దేశంతో యీ హక్కును నిరాకరించిందో అర్థం చేసుకోవడం కష్టం. దీనిలో రాజకీయాలే కనబడుతున్నాయి. రిపబ్లికన్‌లు ఛాందసవాదంతో అబార్షన్ హక్కును వ్యతిరేకిస్తారు. ఉదారవాదులైన డెమోక్రాట్లు సమర్థిస్తారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒక సర్వేలో 61% మంది యీ హక్కును సమర్థించగా, 37% మంది వ్యతిరేకించారు. పార్టీల పరంగా చూస్తే డెమోక్రాట్లకు ఓట్లేసేవారిలో 80% మంది హక్కుకు మొగ్గు చూపగా, రిపబ్లికన్ పార్టీ అభిమానుల్లో 62% మంది మాత్రమే మొగ్గు చూపారు. ఇప్పుడీ కోర్టు యిలా వ్యవహరించడానికి కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో రిపబ్లికన్ పార్టీ అభిమానులు ఎక్కువమంది ఉండడం ఒక కారణమంటున్నారు.
మొత్తం 9 స్థానాలుంటే వారిలో ఎంతమంది న్యాయమూర్తులు కన్సర్వేటివ్‌లు, ఎంతమంది లిబరల్ అని సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ రైట్స్ వారి చార్టు ఒకటి చూశాను. 1970 లో కన్సర్వేటివ్స్, లిబరల్స్ 5-4 నిష్పత్తిలో ఉండేవారు. తర్వాత ఏడేళ్ల పాటు అది 6-3 అయింది. తర్వాతి ఐదేళ్ల పాటు 5-4 అయింది. 1991, 92లో ఏకంగా 7-2 అయింది. తర్వాత చాలాకాలం 5-4 మేన్‌టేన్ అయింది. 2014-16 మధ్య మాత్రం 4-5 అయింది. 2017 నుంచి 2019 వరకు 5-4 అయింది. 2020 నుంచి 6-3 నడుస్తోంది. ఈ ఆరుగురిలో కన్సర్వేటివ్ జజ్‌లలో ట్రంప్ హయాంలో నియమించిన ముగ్గురున్నారు. 6గురు హక్కును వ్యతిరేకించగా ముగ్గురు సమర్థించారు. ఇలా కన్సర్వేటివ్ పార్టీ తన పంతం నెగ్గించుకుంది. ఈ న్యాయమూర్తులు ‘1973 నాటికే కేసులో ఆర్గ్యుమెంట్స్ తప్పుడు రీతిలో నడిచాయని, అందుకే ఆ తీర్పును తిరగతోడుతున్నామని వ్యాఖ్యానించారు. పైగా అబార్షన్‌లను నియంత్రించే హక్కు ప్రజలకు, ప్రజాప్రతినిథులకు యివ్వాలిట!
అమెరికాలో 50 రాష్ట్రాలు. ప్రతీ రాష్ట్రానికి విడివిడి చట్టాలు. మొత్తం 50 రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలో అబార్షన్ నిషేధించే చట్టాలను అనుమతించవచ్చు. అంటే ఆ రాష్ట్రాలలో స్త్రీలు రేప్‌కు గురై గర్భం దాల్చినా అది తొలగించే హక్కు కోల్పోతారు. తక్కిన 25 రాష్ట్రాలలో ఒకసారి అబార్షన్‌ను అనుమతించే అవకాశం ఉంది. అందువలన గర్భం తీయించు కుందామనుకున్న మహిళలు ఆ 25 రాష్ట్రాలలో వేటికైనా వెళ్లి తీయించుకోవచ్చేమో. వాటికి సహాయం అందించడానికి మహిళా సంఘాలు ముందుకు రావచ్చు. ఇలా ఆ చట్టం ఆచరణలో విఫలం కావచ్చు. గర్భస్థ శిశువును కనాలా వద్దా నిర్ణయించుకునే హక్కు తల్లిది. దాన్ని నిలబెట్టడానికి మన సుప్రీం కోర్టు ప్రయత్నిస్తూ ఉంటే, హరించడానికి అమెరికా సుప్రీం కోర్టు ప్రయత్నించింది. దాని వెనుక రాజకీయ భావజాలం ఉందనే మాట వినిపిస్తోంది. అది దురదృష్టకరం. మహిళల హక్కుల్ని కాపాడడానికి అన్ని పార్టీలు ఏకం కావలసిన సందర్భం యిది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)