ఇది పాయింటే మరి. ఎవరైనా దీని మీద ఎపుడైనా ఆలోచించారా. అసలు భారతదేశానికి ఢిల్లీ రాజధాని ఎలా అయింది. చరిత్రలో ఈ దేశానికి ఢిల్లీ రాజధాని అని చట్టం రాసినట్లుగా ఉందా. ఆ మాటకు వస్తే భారత దేశం పరాయి వారి పాలనలో ఉన్నపుడు ఒక దశలో కోల్ కటా కూడా రాజధాని అన్నారు. అలా మారిన తరువాత ఢిల్లీని రాజధాని చేసుకున్నారు. ఇది దేశానికీ ఒక మూలాన ఉంది. అయినా తరువాత వచ్చిన వారు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు.
నిజమే కొన్ని సార్లు ఆనవాయితీలు కూడా చట్టం లాగానే ఉంటాయి. అలా ఢిల్లీ రాజధాని విషయం సరిపెట్టుకోవచ్చు అనుకున్నా అసలు రాజధాని కోసం చట్టాలు చేయాలని రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు అని మేధావులు అంటున్నారు. నిజానికి రాజధాని గురించి కానీ దాని స్వరూప స్వభావాల గురించి కానీ ఎలాంటి ప్రస్థావనలు లేవని, నిర్వచించలేదని కూడా అంటున్నారు.
ఒక రాజధాని ఉండాలా లేక మూడు ఉండాలా అన్నది పాలకుల ఇష్టమే తప్ప దీని మీద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏమీ నిర్వచించలేదని అంబేద్కర్ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ లాలా లజపతిరాయ్ అంటున్నారు. రాజధాని అన్నది కేవలం పాలనా సౌలభ్యం కోసం, అంతిమంగా ప్రజా శ్రేయస్సు కోసం అని మాత్రమే ఉండాలని ఆయన అంటున్నారు.
ఆ విధంగా చూసుకుంటే రాజధాని అన్నది ఆ రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఉండాలి తప్ప గుదిబండగా ఉండకూడదు అని నిపుణులు అంటున్నారు. లక్షల కోట్లు పెట్టి మొత్తం రాష్ట్ర సంపద అంతా తీసుకెళ్ళి ఒకే చోట కుప్పపోసి రాజధాని అని ఆర్భాటం చేయడం వల్ల సామాన్యులకు ఒరిగేది ఏముంటుంది అన్నదే మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న.'
విశాఖ రాజధాని కోరుతూ జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో ఇలా ఎన్నో మౌలిక అంశాల మీద కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ రాజధాని అని ఏ చట్టంలో ఉంది అని మేధావుల నుంచి వచ్చిన ప్రశ్న ఆలోచింపచేసేదే. ప్రజల ఆకాంక్షలను అడ్డుపెట్టే విధంగా కాకుండా రాష్త్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని రౌండ్ టేబిల్ సమావేశం అభిప్రాయపడింది. ఏపీ లాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందే అని తీర్మానించింది.