అష్టలక్ష్ముల్లో ఏది కావాలో కోరుకోమంటే ఎవరైనా వెంటనే కోరుకునేది ధనలక్ష్మినే. ఆ లక్ష్మి కటాక్షముంటే ఈ ప్రపంచంలో దేన్నైనా పొందవచ్చనే ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే అష్టలక్ష్ముల్లో ఏది ఎక్కువగా ఉన్నా ఆనందమే కానీ సహజంగా సంతానలక్ష్మీ కటాక్షం ఎక్కువైతే సదరు కుటుంబపెద్దగానీ, పెంచే తల్లిగనీ భారంగానే ఫీలౌతారు. తక్కువమంది సంతానమున్న ఇంటికి, ఎక్కువమందున్న ఇంటికి ఖర్చుల్లో, జీవన స్థాయిలో చాలా తేడా ఉంటుంది.
దేశం కూడా ఒక ఇల్లు లాంటిదే. జనాభా కట్టడి చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది భారతదేశం. అయినా దాని లెక్కలో అది పెరుగుతూనే వచ్చింది. పూర్వం ఇంటికి పది మంది పిల్లలుంటే ఈ రోజుల్లో రెండు లేదా మూడుకి కుదించబడింది. అయినప్పటికీ భారతదేశజనాభా ఇబ్బడిముబ్బడయ్యి ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడు ఆ సంతానలక్ష్మీ కటాక్షమే మనకి సర్వలక్ష్ముల కటాక్షమూ కలిగించేలా చేస్తోంది.
భారతదేశం మునుపటిలా అయితే లేదు. ప్రజల్లో స్పెండింగ్ పవర్ పెరిగింది. సేవింగ్ ఎకానమీ నుంచి స్పెండింగ్ ఎకానమీ వైపుకు పరుగెడుతోంది మన దేశం. అలాగని అసలు సేవింగ్ లేకుండా పూర్తిగా పాశ్చాత్యుల్లా కూడా బతకట్లేదు. ఉన్నంతలో కొంత సేవ్ చేసుకుంటూనే ఖర్చు మాత్రం విరివిగా చేస్తున్నారు. దానివల్ల దేశీయ ఎకానమీయే కాదు అంతర్జాతీయంగా కూడా అనేక ఎకానమీలు భారతదేశ ప్రజల మీద ఆధారపడి ఉన్నాయి. దీనికి వివిధ అగ్రదేశాల్లో స్థిరపడి సంపాదిస్తున్న భారతీయులు కూడా కారణం. ఎన్నారైల వల్ల దేశంలో అనేక కుటుంబాల స్థితిగతులు మారాయి. మధ్యతరగతి ఇళ్లు ఈ ఎన్నారైల వల్ల ఉన్నతశ్రేణి జాబితాలోకి కూడా చేరుతున్నాయి. కనుక భారతదేశ పురోగమనంలో ఎన్నారైలది పెద్దహస్తం.
అమెరికా జనాభా 33 కోట్లనుకుంటే వారిలో స్పెండింగ్ పవర్ ఎక్కువగా ఉన్న ఉన్నతమధ్యతరగతి మరియు పైశ్రేణివారు 14% మందని ఒక అంచనా. అంటే 5 కోట్లకు అటుఇటుగా ఉన్నారన్నమాట. అదే భాతదేశంలో స్పెండింగ్ పవరున్న అప్పర్ మిడిల్ క్లాస్ జనాభా ఎవరంటే వార్షికాదాయం 5 లక్షల నుంచి పదిలక్షలు సంపాదిస్తున్నవారు. వార్షికంగా 10 లక్షలకు పైన సంపాదిస్తున్నవారిని ఉన్నతశ్రేణి జనాభాగా లెక్కేశారు. ఆ స్థాయిలో సంపాదిస్తున్నవారు ఎంతమందో ఇండియాలో ప్రస్తుతం లెక్కతేలడం కష్టం. ఎందుకంటే ట్యాక్సులు కచ్చితంగా కట్టాల్సొస్తున్న ఉద్యోగులు మాత్రమే ఆ లెక్కల్లో కనపడుతున్నారు. కానీ ఎంత సంపాదించినా ఖర్చులు చూపించి ఆదాయాన్ని తక్కువగా చూపించి ట్యాక్స్ తక్కువగా కడుతున్నవారు, లేదా జీరో ట్యాక్స్ ఫైల్ చెస్తున్నవాళ్ళే ఎక్కువ.
అమెరికా నుంచి చాలా గ్యాప్ తర్వాత ఇండియా వస్తున్న ఎన్నారైలు ఇక్కడివారి స్పెండింగ్ పవర్ పెరిగిందని ఇట్టే కనిపెడుతున్నారు. ఆమాటకొస్తే అమెరికాలో పెద్దనగరాలకి ఏమీ తీసిపోకుండా ఉన్నాయి ఇక్కడి ఇళ్ల ధరలు కూడా. కొంటున్న జనం ఉంటూనే ఉన్నారు. అమెరికా నగరాల్లో మాదిరిగా హైద్రాబాదు, ఢిల్లీ, బెంగళూరు, వైజాగ్, చెన్నై, ముంబాయిల్లో ఐదు కోట్లు, పది, పెదిహేను కోట్ల విలువైన విల్లాలు అమ్ముతున్నారు. కొనేవాళ్లు కొనేసుకుంటున్నారు. ఎలా చూసుకున్నా భారతీయుల్ని అస్సలు తక్కు అంచనా వేసే పరిస్థితి అగ్రరాజ్యమైన అమెరికాకు కూడా లేదిప్పుడు. భారతీయులు న్యూనతాభావంతో బతకాల్సిన పరిస్థితులు ఏ మాత్రం ఇప్పుడు లేవు. రానురాను పరిస్థితి ఇంకా మెరుగవుతుందే తప్ప తక్కువకాదు.
మొన్నటికిమొన్న ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడుల విషయంలో ఏవో డిమాండ్స్ చేసాడు. ఇండియా అస్సలు తలొగ్గలేదు. వ్యాపారం పెట్టుకుని కట్టాసిన ట్యాకులు అవీ కడితేనే రమ్మని, లేకపోతే అవతలకి వెళ్లమని చెప్పినట్టు అయింది. ఇండియన్ మార్కెట్ ని వదులుకునేంత గట్స్ ఎలాన్ మస్క్ చేయడు. చివరికి ఇండియాకి తల వంచి ఇక్కడ తన టెస్లా కంపెనీ పెట్టుకోవాలి తప్ప డిమాండ్స్ చెబితే వినేవాడెవడూ లేని స్థితిలో ఉంది ఇండియా.
అమెరికాలో కూడా టెస్లా కార్లు కొంటున్నవారిలో ఇండియన్స్ ఎక్కువ. ఆమాటకొస్తే అమెరికాలో ఉన్న ఇండియన్స్ అక్కడి చాలామంది అమెరికన్స్ కంటే ధనికులు. అందులో ఏమీ సందేహం లేదు. ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టి కార్ల అమ్మకం మొదలుపెడితే, ప్రీ బుకింగ్ లోనే 20 లక్షల కార్లు బుక్కవుతాయనేది వివిధ కార్ల కంపెనీల ప్రాధమిక అంచనా. అంటే ఆ రేంజులో అమెరికాలో కూడా అమ్ముకోలేడు ఎలాన్ మస్క్.
ఇదిలా ఉంటే భారతీయులు ప్రపంచమంతా కమ్మేసారు. బ్రిటన్ కి భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానైతే మనవాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. బ్రిటన్ కి వెళ్లడానికి, అక్కడ చదువులకి, ఉద్యోగాలకి భారతీయులకి మరింత బాగుంటుందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అవన్నీ రిషి ఎజండాలో ఉన్నవే, బయటికి చెప్పినవే. కానీ ఇండియాకి బ్రిటన్ అవసరం కన్నా బ్రిటన్ కి ఇండియా అవసరమే ఎక్కువ. తిప్పి కొడితే ఐదు కోట్ల మంది జనాభా ఉన్న దేశం బ్రిటన్. అంటే ఒక ఆంధ్రప్రదేశులో ఉన్నంతమంది ఉంటారక్కడ సుమారుగా. వాళ్ల కాలేజీలు నిండాలన్నా, కంపెనీల్లో జనం కావాలన్నా అధిక జనాభా కలిగుండి తక్కువ జీతాలకు పని చేసే యూత్ పవర్ ఉన్న ఇండియా అవసరముంటుంది. మన జనాభాయే మనకి సర్వశక్తులు ఇస్తోందిప్పుడు.
చైనా కూడా భారీ జనాభాగల దేశమే. అయితే వాళ్లు స్వయం సంవృద్ధి ఎక్కువ చెందారు. ప్రపంచంలో ఏ వస్తువైనా చైనా తయారీ అవడం వాళ్ల ప్లస్ పాయింట్. అదొక పద్ధతి. వాళ్లూ అగ్రరాజ్యాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇండియన్స్ కి ఉండే ప్రిఫరెన్స్ వాళ్లకి ఉండట్లేదు. కారణాలు అనేకం. అవి చర్చిస్తే మరొక వ్యాసం అవుతుంది.
అయితే ప్రపంచంలోని ఏ దేశం వస్తువునైనా ఎంత ఖర్చైనా కొనే వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు. ఇంకా పెరుగుతున్నారు. వినియోగదారుడే దేవుడనుకుంటే కోట్లాది మంది వినియోదారులున్న భారతదేశం ప్రపంచ విపణికి ముక్కోటి దేవతలున్న గుడిలా కనపడాలి. కనిపిస్తోంది కూడా.
రానున్న రోజుల్లో దేశానికి మరింత సుగతి పడుతుంది. అయితే మారాల్సిందల్లా ఓట్లని నోట్లతో కొనే సంస్కృతి, రాజకీయ రంగ ప్రక్షాళణ. అంతే కాకుండా ప్రతివారూ సంటొషంగా ట్యాక్సు కట్టే విధంగా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టాలి. అది జరిగి అధినాయకత్వం దేశాన్ని నడిపిన నాడు ప్రపంచ విపణి డాలరుతో కాకుండా రూపీతో జరిగే రోజులు కూడా వచ్చేస్తాయి. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. అప్పుడు రూపీ విలువ పెరగడం కూడా చూడొచ్చు. అదేమంత దూరంలో కూడా లేదనిపిస్తోంది.
శ్రీనివాసమూర్తి