వాహ్ ఫస్ట్ సెట్ : ఫెదరర్‌ను ఓడించిన సుమిత్!

అంతర్జాతీయ క్రీడారంగంలో మనదేశపు క్రీడాకారులకు టెన్నిస్‌లో మరీ అంత గొప్ప కీర్తి ప్రతిష్ఠలేమీ లేవు. పైగా పురుషుల టెన్నిస్ అదీ సింగిల్స్‌లో ఇటీవలి కాలంలో ఘనకార్యాలేమీ లేవు. సానియా మీర్జా తర్వాత.. అంతర్జాతీయ టెన్నిస్‌లో……

అంతర్జాతీయ క్రీడారంగంలో మనదేశపు క్రీడాకారులకు టెన్నిస్‌లో మరీ అంత గొప్ప కీర్తి ప్రతిష్ఠలేమీ లేవు. పైగా పురుషుల టెన్నిస్ అదీ సింగిల్స్‌లో ఇటీవలి కాలంలో ఘనకార్యాలేమీ లేవు. సానియా మీర్జా తర్వాత.. అంతర్జాతీయ టెన్నిస్‌లో… దేశీయ క్రీడాభిమానులకు ఆసక్తికరమైన సంఘటనలేమీ లేవంటే అతిశయోక్తి కాదు. కానీ.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం ఒక అద్భుతం చోటు చేసుకుంది. భారతీయ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్, ప్రపంచ టెన్నిస్ మహామహుడు రోజర్ ఫెదరర్ ను మొదటి రౌండ్‌లో మొదటి సెట్‌లో ఓడించాడు.

మామూలుగా అయితే.. ఒక సెట్ గెలవడం పెద్ద విశేషం ఎంతమాత్రమూ కాదు. కానీ.. ఈ మ్యాచ్ వేరు. సాధారణంగా ప్రత్యర్థిని బట్టి మాత్రమే మన విజయానికి విలువ ఉంటుంది. సాదాసీదా ప్రత్యర్థి మీద ఎన్నిసార్లు గెలిచినా రాని కీర్తి, గుర్తింపు… బలమైన ప్రత్యర్థి మీద ఓడిపోయినప్పుడు కూడా వస్తుంది. ఇది కూడా అలాంటి మ్యాచే. ఇప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో కలిగి ఉన్న టెన్నిస్ హీరో రోజర్ ఫెదరర్ ను తొలిరౌండ్లోనే ఒక సెట్ ఓడించడం అనేది చిన్న విషయం కాదు. సుమిత్ నాగల్.. 6-4 పాయింట్ల తేడాతో ఈ అరుదైన ఫీట్ ను సాధించాడు.

సాధారణంగనా రోజర్ ఫెదరర్ మామూలు ఆటగాడు కాదు. ఒకటిరెండు సందర్భాల్లో తప్ప తాను పాల్గొన్న ప్రతి గ్రాండ్ స్లామ్ టోర్నమెంటుల్లోనూ సెమీస్ వరకు చేరే ఆటగాడు అతను. తమాషా ఏంటంటే… సెమీస్ వరకు కూడా.. ఎన్ని రౌండ్లు ఆడినా… ఒక్క సెట్ కూడా ప్రత్యర్థికి కోల్పోకుండా.. గెలుస్తూ వచ్చి… సెమీస్ లో ప్రవేశించే అనన్యమైన క్రీడాప్రతిభకు నిదర్శనం ఫెదరర్. అలాంటి ఫెదరర్ ను తొలిరౌండ్ లోనే.. ఒకటో సెట్ లోనే ఓడించడం అంత చిన్న విషయం కాదు.

రోజర్ ఫెదరర్ ఆటలో పరిణతి, ప్రతిభ ముందు సుమిత్ నాగల్ చివరిదాకా నిలవలేదు. తర్వాతి మూడు సెట్లను వరుసగా కోల్పోయి యూఎస్ ఓపెన్ నుంచి తొలిరౌండ్ లోనే వెనుతిరిగాడు. అయినా సరే సుమిత్ ను ప్రశంసించాల్సిందే. హర్యానాలోని ఝజ్జర్ కు చెందిన 22 ఏళ్ల సుమిత్.. 2015 వింబుల్డన్ టోర్నీలలో బాలుర డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు. పెద్ద ఆటగాళ్లతో తలపడేప్పుడు బాగా ఒత్తిడి ఉంటుంది. అలాంటిది మొదటి సెట్ లోనే గెలిచాడంటే.. అతడి ప్రతిభను అభినందించాల్సిందే. మరింత మంచి భవష్యత్తు ఉంటుందని ప్రోత్సహించాల్సిందే.

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..