కొద్దికాలంగా కనిపించకుండా మాయమైన అసెంబ్లీ ఫర్నిచర్ రికవరీ అయింది. కోడెల కుమారుడి షోరూమ్ లో ఉన్న ఈ విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. కోడెల మాయం చేసిన ఈ ఫర్నిచర్, 2 లారీల్లో రాత్రి అసెంబ్లీకి చేరుకుంది. సరిగ్గా ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. జగన్ కాకుండా, చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఫర్నిచర్ పరిస్థితి ఏంటనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.
అసెంబ్లీ విభజన టైమ్ లో హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించాల్సిన ఫర్నిచర్ అది. వాటి విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటుంది. అందులో నైజాం కాలానికి చెందిన పురాతన కుర్చీలు, బల్లలు కూడా ఉన్నాయి. బాబు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే, ఈ ఫర్నిచర్ మొత్తం కోడెల స్వాధీనంలోకి వెళ్లిపోయేదని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసెంబ్లీలో ఉండాల్సిన ఈ పురాతన ఆస్తి, ఆయన కొడుకు షోరూమ్ లో కనిపించేది.
చర్చ ఇక్కడితో ఆగలేదు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే కోడెల మళ్లీ స్పీకర్ అయ్యేవారని, ఈసారి అసెంబ్లీ సరంజామా మొత్తం ఆయన కొడుకు షోరూంకు చేరేదని, దీంతో ఆయన షోరూంలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వచ్చేదంటూ సెటైర్లు పడుతున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి రావడం వల్ల ఈ కుంభకోణం బయటపడిందని, లేదంటే మొత్తం కోడెల వశమయ్యేదని అంటున్నారు.
ఈ చర్చ సంగతి పక్కనపెడితే, స్పీకర్ స్థాయిలో ఎలా వ్యవహరించకూడదో.. తన టర్మ్ మొత్తం అలానే వ్యవహరించారు కోడెల. అప్పటి ప్రతిపక్షం గొంతును పూర్తిగా నొక్కేయడంతో పాటు, స్పీకర్ స్థానంలో ఉంటూ కూడా నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు.
వీటికి అదనంగా ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ఫర్నిచర్ ను కూడా తన ఇంటికి తరలించుకుపోవడంతో, మాజీ స్పీకర్ దురాగతాలు పరాకాష్టకు చేరినట్టయింది. హుందాగా ఉండాల్సిన స్పీకర్ పదవిని కోడెల ఎంత నీచస్థితికి దిగజార్చారో జనాలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది.