పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. కాంట్రాక్టులు రద్దుచేసేసి.. రీటెండరింగ్‌కు వెళ్లిన వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. అవినీతిని నియంత్రించడం, అనే ఒకేఒక ఎజెండాతోనే.. కాంట్రాక్టుల విషయంలో ముఖ్యమంత్రి కఠినంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాము తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి మోడీ, అమిత్ షాల ఆశీస్సులు ఉన్నాయని విజయసాయి ప్రకటించారు కూడా. అయితే పోలవరం విషయంలో జగన్మోహన రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర జలశక్తి మంత్రి మాత్రం తక్షణ మద్దతు ఇవ్వలేదు. ‘తర్వాత డిసైడ్ చేద్దాం’ అని మాత్రమే చెప్పారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి… కేంద్రం జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కూడా కలిశారు. పోలవరం విషయంలో తాము ఎందుకు కాంట్రాక్టులను రద్దుచేశామో… దానిద్వారా ప్రభుత్వంలో ఎలాంటి పారదర్శకత తీసుకురావాలని అనుకుంటున్నామో… జగన్ మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. అన్నీ విన్నప్పటికీ.. కేంద్రంమంత్రి షెకావత్ మాత్రం తక్షణ స్పందనను తెలియజేయలేదు.‘స్కాట్లాండ్ వెళుతున్నా… వచ్చిన తర్వాత సమీక్షించి నిర్ణయిద్దాం.. పోలవరం విషయంలో విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్రమే నిర్ణయం తీసుకుటాం’ అని షెకావత్ చెప్పారు.
నిజానికి ఇది జగన్మోహనరెడ్డకి మరీ అంత పాజిటివ్ సమాధానం మాత్రం కాదు. తాను సీఎం అయిన వెంటనే.. రాష్ట్రంలో జరుగుతున్న దాదాపు అన్ని ప్రధానమైన కాంట్రాక్టు పనులను జగన్ నిలుపు చేయించారు. వీటిని ఒక కమిటీద్వారా సమీక్షింపజేస్తున్నారు. ఏ పనుల్లో ఎంతమేర అవినీతి జరిగిందో.. లెక్కతేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇతర పనులన్నింటి మీదా.. ఇలాంటి కట్టుబాటు విధించిన తర్వాత.. తర్వాతి దశలో జగన్ పోలవరం టెండర్లను రద్దుచేశారు. నవయుగ సంస్థకు ప్రధాన డ్యాం, జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణం పనుల ఒప్పందాలు ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రభుత్వం రద్దు చేసేసింది.
అయితే నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించి.. పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దచేసే అధికారం ప్రభుత్వానికి లేదని.. ఇలా కాంట్రాక్టు రద్దు తప్పు అని వాదించింది. హైకోర్టు కూడా ఆ వాదనకు అనుకూలమైన తీర్పునే ఇచ్చింది. ఆ పనుల్లో వారినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో… పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ పనులు కూడా సంశయంలో పడ్డాయి. వీటి రీటెండరింగ్ కు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయి ఉంది. అయితే రీటెండర్లే వద్దంటూ పోలవరం అథారిటీ అభ్యంతర పెడుతోంది. ఈ మేరకు వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు.
కేంద్రానికి కూడా నివేదిక సమర్పించారు. పోలవరం విషయంలో తీసుకునే ప్రతినిర్ణయం తమకు తెలియాల్సిందేనంటూ షెకావత్ ఆగ్రహించారు కూడా. తాజాగా రీటెండర్లకు కేంద్రం ద్వారా పచ్చజెండా ఊపించుకోవడం కోసం సీఎం జగన్, ఆయనను ఆశ్రయించినట్లు కనిపిస్తోంది. అయినా అటువైపునుంచి కోరుకున్న స్పందనలేదు. మరి కేంద్రం జగన్ పట్ల సానుకూలంగానే ఉంటుందో.. లేకపోతే.. జాప్యం, అధికభారం వద్దనుకుని… డిజైన్లపరంగా ఇబ్బందులు రారాదు అనుకుని.. పాత కాంట్రాక్టర్లను కొనసాగించాలని అనడానికే మద్దతు ఇస్తుందో వేచిచూడాలి.