ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంత బాగాలేదు. ఎలాంటి సినిమాలు అయినా సోలో విడుదల లేకుంటే సమస్యగా మారుతోంది. అలాగే వీకెండ్ కాకుండా, వీక్ డేస్ లో జనాలు థియేటర్ కు రావడం బాగా తగ్గిపోయింది. ఇలాంటి నేపథ్యంలో నలభై కోట్లు, యాభై కోట్ల రేంజ్ సినిమాలు ఒకే రోజు విడుదలై క్లాష్ కావడం అంటే రిస్క్ తో కూడిన వ్యవహారమే.
సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ వాల్మీకి, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు ఇలాంటి పరిస్థితిలో చిక్కుకున్నాయి. వాస్తవానికి ప్రభాస్ భారీ సినిమా సాహో రావడంతో గ్యాంగ్ లీడర్ ఆగస్ట్ 30 నుంచి తప్పుకుని, సెప్టెంబర్ 13 కు వచ్చింది.
ఇలాంటి నేపథ్యంలో వాల్మీకి కూడా ఒక వారం వెనక్కు వెళ్తే బెటర్ అని డిస్ట్రిబ్యూషన్ పెద్దలైన దిల్ రాజు, అల్లు అరవింద్ లు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
గత రెండు మూడు రోజులుగా ఈ మేరకు డిస్కషన్లు సాగాయి. ఆఖరికి వాల్మీకి ఓ వారం వెనక్కు వెళ్లడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ప్రకటించలేదు. బహుశా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం వుంది.
ఇండస్ట్రీ జనాలు అయితే వాల్మీకి నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.