ఎక్కడైనా కరెంట్ షాక్ కొట్టడం చూశాం. ఇటీవల కరెంట్‌కు బదులు దాని బిల్లు షాక్ కొడుతోంది. ఇదో విచిత్ర పరిస్థితి. లాక్‌డౌన్‌లో సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ అందరూ కరెంట్ బిల్లు బాధితులే అని చెప్పక తప్పదు.
లాక్‌డౌన్‌లో విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో కరెంట్ బిల్లు తీయలేదు. ఈ నేపథ్యంలో మూడు నెలల కరెంట్ బిల్లు ఒకేసారి తీశారు. దీంతో శ్లాబ్‌లో మారి బిల్లు అమాంతం రెట్టింపైంది. వేలల్లో, లక్షల్లో బిల్లు రావడంతో జనం షాక్‌కు గురి అయ్యారు.
తాజాగా తనకు కరెంట్ బిల్లు ఎలా షాక్ కొట్టిందో హీరోయిన్ కార్తీక చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కరెంట్ సరఫరాతో పాటు దాని బిల్లు వివరాలు వెల్లడించారు. ముంబైలో తన ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉన్నట్టు తెలిపారు.
ఇటీవల తన బిల్లు గతంలో ఎన్నడూ లేనంతగా రావడంతో షాక్‌కు గురయ్యానన్నారు. అక్షరాలా లక్ష రూపాయల బిల్లు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు.
‘సహజంగా నా హోటల్ బిల్లు కాస్తా ఎక్కువే. కానీ దాన్ని మించి నా ఇంటి కరెంట్ బిల్లు రావడం ఆశ్చర్యం వేసింది. నిజానికి మేము మినిమం కరెంట్ కూడా వాడలేదు. అదేం మాయో తెలియదు కానీ, లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. అంత బిల్లు ఎలా వచ్చిందో మీరే చెప్పాలి’ అంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు కార్తీక ట్యాగ్ చేశారు.