'హోమ్‌లాండ్' సీరీస్‌ను పరిచయం చేస్తూ 'ఓ గూఢచారిణి ప్రేమకథ' పేర 15 భాగాలు రాసి ఆపేసినందుకు చాలామందికి కోపం వచ్చింది, బాధ కలిగింది. ‘తగినంత ఆదరణ లేదని ఎలా చెప్పగలరు? బాగుందని మేమంతా మెయిల్స్ రాయాలా? సైలెంట్‌గా ఎంజాయ్ చేస్తున్నాం.’’ అని వాదించారు. ఆ మాట కొస్తే నేనూ నచ్చిన ప్రతీ రచన గురించి సంపాదకులకు ఉత్తరాలు రాయను, వ్యాసం కింద కామెంట్స్ పెట్టను. మనలో చాలామంది అంతే. మనం పెరిగిన వాతావరణం వలన మనకు అభినందించడమూ రాదు, అభినందనలు స్వీకరించడమూ రాదు. అందువలన ప్రతి రచయితా తను రాసే రచన అందరినీ మెప్పిస్తోందని అనుకునే రాస్తూ పోవాలి.
అయితే వెబ్‌సైట్లు వచ్చాక ఓ సౌలభ్యం వచ్చింది. ఏ రచనను ఎంతమంది, ఎంతసేపు చదువుతున్నారు అనే గణాంకాలు తెలిసిపోతున్నాయి. దాన్ని బట్టి రచన పాప్యులారిటీపై పబ్లిషరుకి ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రింటు మీడియాలో ఆ సౌకర్యం లేక అంతా ఎడిటరు యిష్టంపై, ఊహపై ఆధారపడి వుంటుంది. మనం ఏదైనా ప్రౌఢమైన, వినూత్నమైన రచన చేస్తే ‘నాకే అర్థం కాలేదు, పాఠకులకు ఏం అర్థమౌతుంది? ఈ మనిషి గురించి నాకే తెలియదు, పాఠకులకేం తెలుస్తుంది?’ అని కొట్టి పారేసేవారు. రచనను పక్కన పడేసేవారు. తన కంటె పాఠకులలో ఒక వర్గానికైనా ఎక్కువ తెలివిడి వుంటుందని వాళ్లకు తోచదు, చెప్తే వినరు.
నేను మేనేజింగ్ ఎడిటరుగా వున్న ‘‘హాసం’’లో నా అభిమాన గాయకుడు జిమ్ రీవ్స్ గురించి వ్యాసం వేయలేకపోయానన్న బాధ నన్ను యిప్పటికీ సతాయిస్తుంది. ఎందుకంటే ఎడిటరుగా నేను నియమించిన వ్యక్తికి జిమ్ గురించి తెలియదు. ‘ఇది ఎవరూ చదవరు.’ అని మొండికేశాడు. సంపాదకుడికి స్వేచ్ఛ యివ్వాలనే సిద్ధాంతంతో నేను పట్టుబట్టలేదు. ‘వేసి చూడండి, తెలుస్తుందిగా’ అని సూచించాను. ‘పై సంచికలో చూద్దాం’ అంటూ దాటవేసి, చివరకు మానుస్క్రిప్టే లేకుండా చేశాడు. మళ్లీ రాసే ఉత్సాహమే లేకుండా జరిగింది.
ప్రింటు మీడియాలో యిబ్బందేమిటంటే దేన్ని ఎంతమంది చదివారో, ఎంతమంది హర్షించారో లెక్కలు తేలవు. ఉత్తరాలు రాయరు. అప్పట్లో వీక్లీలకు ఉత్తరాలు రాసే బ్యాచ్ ఓ 20, 30 మంది వుండేవారు. ఏ పత్రికలో చూసినా వారే కనబడేవారు. ఎవరైనా బాగుందని ఫోన్ చేసి చెపితే, ఉత్తరరూపంలో రాయండి, వేసుకుంటాం అని సూచిస్తే అమ్మానాన్నలకే రాయటం లేదు, మీకేం రాస్తామండి? అనేసేవారు. కొన్ని పత్రికలకు మార్కెటింగు విభాగాలు వున్నాయనేవారు కానీ, వాళ్ల సర్వేలు ఎంతవరకు నమ్మవచ్చో తెలియదు. నేను 50 ఏళ్లకు పై బడి పత్రికలు చదువుతున్నాను కానీ ఏ సర్వేయరూ వచ్చి ఫలానా తెలుగు వీక్లీలో ఏ కథ నచ్చింది? ఏ సీరియల్ నచ్చింది అని అడగలేదు. కొన్ని ఇంగ్లీషు మాగజైన్లు, హిందూ దినపత్రిక మాత్రం ఏ శీర్షికలు చదువుతారు అని లిఖితపూర్వకంగా అడిగినట్లు గుర్తు. అది కూడా చాన్నాళ్ల క్రితం.
దీనివలన ఎవరు పాప్యులర్ రచయిత అనేది ఎవరికి వారు అనుకోవలసినదే. గతంలో అయితే పుస్తకాలు బాగా అమ్ముడుపోయే రోజుల్లో ఎవరి పుస్తకం వేలాది కాపీలు అమ్ముడుపోతే వారే పాప్యులర్ అనేవారు. వెబ్‌సైట్లు వచ్చాక ఎంతమంది చదివారో తెలిసిపోతోంది. కాప్షన్ చూసి వచ్చాక, ఎంతసేపు చదివారు అన్నది తెలిసిపోతోంది. దాన్ని బట్టి ఏ రచనను ప్రోత్సహించాలి అనేది సంపాదకులకు, పబ్లిషర్లకు తెలుస్తోంది. సందేహాలున్న సందర్భాల్లో ప్రయోగం చేసే సౌకర్యం వెబ్‌లో వుంది. ఎందుకంటే స్పేస్ ఎక్కువ. ప్రింటులో అయితే పేజీల పరిమితి వుంది. ప్రింటింగు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వెబ్‌లో అయితే అప్‌లోడ్ చేసిన మర్నాడే ఆదరణ లేనిదాన్ని తీసేసి దాని స్థానంలో మరోటి వేసుకోవచ్చు.
అయినా కొందరు ఎడిటర్లు యీ ప్రయోగం కూడా చేయకుండా ఫలానా రచన నాకు నచ్చలేదు, జనాలకు నచ్చదు, మా పాలసీకి విరుద్ధంగా వుంది అంటూ అని తిరస్కరించవచ్చు. గ్రేట్ ఆంధ్రా పబ్లిషరు, ఎడిటర్ వెంకటరెడ్డిగారితో సుఖం ఏమిటంటే ‘ఈ సబ్జక్టు గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, పెట్టి చూద్దాం, రెస్పాన్సు ఎలా వుందో చెప్తా. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి.’ అంటాడు. అందువలననే నేను రకరకాల సబ్జక్టులపై ఆర్టికల్స్ రాయగలుగుతున్నాను. ఆదరణ వున్నవాటిని కొనసాగిస్తాను, లేనివాటిని ఆపేస్తాను. దీనిలో ఎడిటరును ఏమీ అనడానికి లేదు. అంటేగింటే పాఠకులనే అనాలి. ఆదరణ అస్సలు వుండదా అంటూ ఎంతోకొంత వుంటుంది, కానీ తగినంత, అంటే కాస్ట్-ఎఫెక్టివ్‌గా వుండదని అనుకోవాలి.
ఇంకో యిబ్బంది ఏమిటంటే తక్కినవారు రెండు, మూడు పేరాగ్రాఫ్‌ల్లో ముగించేస్తారు. నేను పేజీలకి పేజీలు 1,2,3.. భాగాలు అంటూ రాసుకుంటూ పోతాను. ‘చదవవలసినంతమంది చదవకపోయినా నాది కంటిన్యూ చేయండి’ అని నేనడగడం భావ్యం కాదు. ‘డైరక్టరు మారుతి కూతురు తీసిన ఫోటోకు ఎవరో ప్రఖ్యాతుడు లైక్ కొడితే అది పెద్ద న్యూసా? నేను మెక్సికోలో డ్రగ్స్ గురించి ఎంతో సమాచారం సేకరించి రాస్తే దానికి అదరణ లేదంటారా?’ అని పేచీ పెట్టుకుంటే మన పరువే పోతుంది. కావాలంటే అదెంతమంది చదివారో, యిదెంతమంది చదివారో గణాంకాలు పంపమంటారా? అని ఆయన అడిగితే మనం బిత్తరపోతాం. మన పాఠకుల అభిరుచి అలా వుంది మరి.
ఈ వెబ్‌సైటే యిలా వుంది, మంచి గంభీరమైన టాపిక్స్ వేసే సైట్ మరొకటి వుంది అని ఎవరైనా చెప్పగలరా? అసలు యింటర్నెట్ చదివేవారందరూ కాలక్షేపానికే చదువుతారు. మీరు ఏవేవో రాసి బోరు కొట్టేస్తున్నారు అంటారు కొందరు. ప్రింటు వెర్షన్లు కనుమరుగై పోతున్న యీ రోజుల్లో యింటర్నెట్‌లో అన్ని రకాల కంటెంట్ రాకపోతే ఎలా అనుకుని నేను వివిధ అంశాలపై రాస్తూంటాను. కొందరు మీ కోసమే ఈ వెబ్‌సైట్‌కు వస్తున్నాం అని ఉబ్బేస్తూంటారు. అది నిజమే కానీ వారి సంఖ్య పరిమితమే. ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే నేను మరీ అంత పాప్యులర్ కాదు. నావి కొంతమందే చదువుతారు, కానీ వాళ్లు లాయల్‌గా వుంటారు. నేను ఏ సబ్జక్టుపై రాసినా, ఏం రాశాడా అని ఓసారి తొంగి చూస్తారు. నచ్చిన అంశమైతే చదువుతారు.
నాతో ఓ చిక్కు ఏమిటంటే నాకు చాలా అంశాలపై ఆసక్తి వుంటుంది. వాటి గురించి రాయాలన్న కుతూహలమూ వుంటుంది. చంద్రబాబు వెన్నుపోటు, జగన్ బందిపోటు అంటూ రాస్తే ఎక్కువ మంది చదువుతారని తెలిసినా, రాయబుద్ధి కాదు. ఒకే సబ్జక్టుపై పత్రికలు, టీవీ ఛానెల్స్ పొద్దూకులా వాయించేస్తూంటే నేనూ రాయడం ఎందుకు దండగ అనుకుంటాను. వాళ్లు చెప్పని జాతీయ, అంతర్జాతీయ విషయాలు, హిస్టరీ, రాజకీయ చరిత్ర, సాహిత్యం, దేశవిదేశాల సంస్కృతి.. యిలాటివాటిపై రాసి పాఠకుల ఆలోచనా పరిధిని విస్తృతం చేద్దామని చూస్తూంటాను.
అయితే దీనిలో కష్టమేమిటంటే తెలియనిదాని జోలికి వెళ్లడానికి సాధారణంగా పాఠకుల మనసు యిచ్చగించదు. సరే రుచి చూద్దాం అని వచ్చేవాళ్లను ఆకట్టుకుని కూర్చోబెడదాం అని నేను ప్రయత్నిస్తూంటాను. దానికి గాను సులభశైలిలో రీడబిలిటీ వుండేట్లు రాయగలగాలి. ఆ కళ నాకు కాస్త అబ్బింది కానీ పూర్తిగా అబ్బలేదు. అందువలన కొన్ని వ్యాసాలు కొందరికి బోరు కొడతాయి. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, ఉదాహరణకి బీటెన్ ట్రాక్‌లో కాకుండా డిఫరెంటుగా సినిమా తీద్దామనుకున్న వారికి కూడా ఎదురౌతుంది. అందువలన డిఫరెంటుగా తీశామని చెప్తూనే రొటీన్ సినిమాలు తీసి, మనముందు పెడతారు. కొత్త తరహా సినిమాలు ఆదరించేవాళ్లు పెరిగే కొద్దీ వాళ్లకూ ధైర్యం వస్తుంది.
తెలుగు పాఠకుల విషయానికి వస్తే వాళ్లు నూతన, అంటే వాళ్లకు అప్పటివరకు పరిచితం కాని అంశాలపై రాసిన రచనలను ఎందుకు ఆదరించటం లేదు? అని గట్టిగా ఆలోచిస్తే మన విద్యావిధానాన్ని, పత్రికా రంగాన్ని తప్పు పట్టాలి. స్కూళ్లల్లో లైబ్రరీలు వుండటం లేదు. కో-కరికురల్ యాక్టివిటీస్ వుండటం లేదు. టీచర్లు రాష్ట్రాల, దేశాల విషయాలు విద్యార్థులకు పరిచయం చేయటం లేదు. ఎంతసేపూ మార్కుల, ర్యాంకుల గోలే. లెక్కలు, సైన్స్ తప్ప తక్కిన సబ్జక్టులకు, అవి చెప్పే టీచర్లకు విలువే లేదు. దాంతో ఆ సబ్జక్టులను ఆస్వాదించే శక్తి కోల్పోతున్నారు.
ఇక తెలుగు మీడియాకు వస్తే దినపత్రికలు, వార్తా పత్రికలు, టీవీ ఛానెల్స్ ఏవైనా చూడండి. ఎంతసేపూ లోకల్ గోలే తప్ప, యితర రాష్ట్రాల గురించి, విదేశాల గురించి సాంస్కృతిక వార్తలు వుండవు. రాజకీయ వార్తలున్నా వాటికి నేపథ్యం చెప్పరు. ఫలానా దేశంలో ఎన్నికలు జరిగి అధికారం చేతులు మారింది అని పొడిగా చెప్పి వూరుకుంటారు. ఆ యా పార్టీల విధానాలేమిటి, గెలుపోటములు ఎందుకు సంభవించాయి? ఇలాటివి ఏవీ వుండవు. నాబోటి వాడు యివన్నీ చెప్పబోతే సబ్జక్టు కొత్తగా తోచి, పేర్లు గుర్తు పెట్టుకోలేక చికాకు కలుగుతుంది. పైపైన చదివి వదిలేస్తారు. ఇలాటివి రెగ్యులర్‌గా చదువుతూంటేనే ఆసక్తి కలుగుతుంది.
ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే అనేక ప్రపంచభాషల్లో వున్న సాహిత్యం ఆంగ్లంలోకి తర్జుమా అయింది. దాన్ని తెలుగులోకి తెచ్చే ప్రయత్నం 1950లలోనే ప్రారంభమైంది. ఆంధ్రవారపత్రిక దీనిలో ముందంజ వేసింది. లబ్ధప్రతిష్ఠులైన వారెందరో అనేక ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్ నవలలను తెలుగులో సీరియల్స్‌గా రాశారు. పాఠకులంతా వెర్రిగా చదివారు. తర్వాత్తర్వాత వీక్లీలు ఆ పని మానేశాయి. ఎంతసేపూ మన వాతావరణంలో రాసిన నవలలే సీరియల్స్‌గా వేశాయి. పాఠకులు వాటికే అలవాటు పడ్డారు. దాంతో ఇతర దేశాల పేర్లు కనబడితే మనవాళ్లకు శిరోభారంగా తోచసాగింది. ‘‘విపుల’’ మాసపత్రిక ప్రపంచకథలను పరిచయం చేసేది. కానీ దానికి ఆదరణ తక్కువే. వారపత్రికలు అనువాద కథలను వేయడం దాదాపు మానేశాయి.
ఈ వాతావరణంలో మనదంతా గుడుగుడుగుంచం బతుకై పోయింది. ఇతర దేశాల గూఢచారి వ్యవస్థలు, మాఫియాలు, యుద్ధచరిత్రలు, పురాణాలు యివన్నీ తెలియవు. చదవాలంటే ఆ విదేశీ పేర్లు పంటికింద రాళ్లలా తగులుతాయి. సబ్జక్టులోని క్లిష్టత స్పీడు బ్రేకరై పోతుంది. ఒకటికి రెండుసార్లు చదివి బోధపరుచు కుందామంటే ఓపిక వుండదు. దానాదీనా మన ఆలోచనా పరిధి విస్తరించదు, మేధస్సు వికసించదు. వికసించకపోయినా మన అన్నపానాదులకు వచ్చే లోటేమీ రాదు కాబట్టి యిలాగే బండి లాక్కువచ్చేస్తాం. మన పాఠకులలో సీరియస్ సబ్జక్టులు చదివేవారి సంఖ్య తక్కువ కావడం చేత రాసే రచయితలూ ఎక్కువ మంది వుండరు. ఉన్నవాళ్లకు ఆదరణ వుండదు.
అయినా నా బోటివాడు ఏదో సమాజసేవ చేస్తున్నానంత బిల్డప్ యిచ్చి మొదలెడితే యిక వ్యాఖ్యలు ప్రారంభమౌతాయి. ‘‘ఇది మనకు అవసరమా?’’ ‘‘ఎక్కడో ఇరాన్‌లో జరిగినది మనకెందుకు? మనదొకటి ఏడిస్తే అదే మహబాగు..’’ లాటి కామెంట్స్ రాస్తారు. కష్టపడి ఈజిప్షియన్ పురాణమేదో సంపాదించి, శ్రమపడి ఆ పేర్లన్నీ వంటబట్టించుకుని, ఎలా పలకాలో తెలుసుకోవడానికి ప్రయత్నించి, అర్థం చేసుకుని ఆ కథలు చెపితే ‘‘రామాయణం రాయవచ్చుగా’’ అంటారు. చిన్నప్పటినుంచి రామాయణం పలురకాలుగా చదివాం కదా, కొత్తది తెలుసుకుందామని వాళ్లకు అనిపించదు. వేరెవరైనా తెలుసుకుంటారేమోనని అడ్డుపడదామని చూస్తారు.
విమర్శకులు (యీ సందర్భంలో వ్యాఖ్యాతలు అనగా కింద కామెంట్స్ రాసేవారు) కానీ పాఠకులు కానీ ఎలా వుండాలి? సహృదయులై వుండాలి. రచయిత్రి శ్రీవల్లీ రాధికగారు యిటీవల యీ విషయంపై చక్కటి వ్యాసం రాశారు. విమర్శకుడు సహృదయుడు అయి వుండాలంటే దాని అర్థం రచనను మెచ్చుకుని తీరాలని, రచనలో తప్పులను ఎత్తి చూపకుండా క్షమాగుణంతో వదిలేయాలి అని కాదని వివరించారు. సహృదయత అంటే ఎంపతీ, అదే వేవ్ లెంగ్త్‌లో ఆలోచించడం. రచయిత ఆర్తితో చెపుతున్నాడా, వ్యంగ్యంగా చెపుతున్నాడా, నీతిబోధ చేస్తున్నాడా అనేది అర్థం చేసుకుని, ఆ కోణంలోంచి రచనను పరామర్శించి అతను చెపుదామనుకున్నది సరిగ్గా చెప్పాడా లేదా అనేది బేరీజు వేయాలని విశదీకరించారు. నేనూ అలాగే అనుకుంటాను.
‘‘ఇథియోపియాలో ఆకలి చావులు’’ గురించి నేను వ్యాసం రాస్తే, ‘…అంటే ఇసుక మాఫియాలో జగన్ హస్తం ఏమీ లేదంటారా?’ అని కామెంటు రాసేవాడి మెంటల్ స్టేటస్ గురించి ఏమనుకోవాలి చెప్పండి. ‘‘ఓ గూఢచారిణి ప్రేమ కథ’’ రాస్తూంటే ‘ఇది కాదు, మరోటి బాగుంటుంది, దానితో పోలిస్తే యీ సీరియల్ వేస్టు’, ‘ఇంగ్లీషు పదాలు వాడకుండా తెలుగు పదాలే వాడండి’, ‘దీని హీరోయిన్ స్వభావం నాకు నచ్చలేదు’ ‘అసలే కరోనాతో ఛస్తూ వుంటే యిది అవసరమా?’ యిలాటి కామెంట్సు రచయితను ఎంత నిరుత్సాహపరుస్తాయో ఊహించి చూడండి. నా ఆర్టికల్స్ పాఠ్యపుస్తకాలు కావు. చదవమని ఎవరూ నిర్బంధించరు. సబ్జక్టు నచ్చితే చదవవచ్చు, లేకపోతే వదిలేయవచ్చు. చదివేవాళ్లు వాళ్ల పాపాన పోతారని వూరుకోకుండా యిలా రాయడం దేనికో తెలియదు.
విదేశీ పేర్లు కన్‌ఫ్యూజ్ చేస్తాయని నాకూ తెలుసు. కానీ సిఐఏ కథను తెలుగు పేర్లతో రాయలేం కదా, అప్పటికీ ఇంటిపేరో, అసలు పేరో ఏది పలకడానికి వీలుగా వుంటే దాన్నే వాడుతూంటాను. మాటిమాటికీ మెయిన్ కారెక్టరుతో వున్న బాంధవ్యాన్ని, సంబంధాన్ని గుర్తు చేస్తూంటాను. క్యారీ కొలీగ్ సాల్, సాల్ భార్య మీరా.. యిలా. సిఐఏ పని తీరు గురించి సీరియల్‌లో విపులంగా చెప్పరు. అమెరికన్ ప్రేక్షకులకు ముందే తెలుసు కాబట్టి! కానీ మనకు అది కొత్త కాబట్టి విడిగా సమాచారం సేకరించి చెప్పాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సులభశైలిలో చెప్పగలుగుతానా లేదా, ఎక్కువమంది పాఠకులు చదువుతారా లేదా అన్న సంశయంతో రాసి స్పందన గురించి ఎదురు చూస్తూ వుంటే యివీ కామెంట్స్!
ఇకపైన కూడా నేను విదేశీ అంశాలపై, సాధారణ తెలుగు పాఠకులకు పరిచయం లేని సబ్జక్టులపై రాస్తూనే వుంటాను. రొటీన్ సబ్జక్టులు తప్ప అలాటివి చదవడం యిష్టం లేనివారు యిటువైపు రానక్కరలేదు. ఇలా చాలాసార్లు రాసినా, నేను అప్‌లోడ్ చేసిన అరగంటలోనే వాళ్లు హడావుడిగా వచ్చేసి ఏదో ఒక కువ్యాఖ్య చేసి వెళ్లిపోతారని తెలుసు. దానికి యాంటీ డోట్ ఏమిటంటే ఇలాటివి చదువుదామనుకునేవారు వాళ్లు చదవడమే కాక, ఓ సారి రుచి చూడమని తమ స్నేహితులను కూడా ప్రోత్సహించడమే! విజిటర్స్ పెరిగినకొద్దీ పబ్లిషరుకి ధైర్యం వస్తుంది, సర్లే కొనసాగిద్దాం అనుకుంటాడు. లేకపోతే ఆపేయండి అంటాడు. ఆ తర్వాత ఎంతమంది నాకు మెయిల్స్ రాసి నిందించినా ప్రయోజనం వుండదు.
ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2020)