తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ వున్న దర్శకులే చాలా తక్కువ. ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా ఒక స్టార్ డైరెక్టర్ అందుబాటులోకి రావడం కష్టమే. అలాంటిది ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఒకే ప్రాజెక్ట్‌తో చాలా కాలంగా స్టక్ అయిపోయి వున్నారు.
‘రంగస్థలం’ లాంటి నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన తర్వాత సుకుమార్ సినిమా ఇంతవరకు సెట్టెక్కలేదు. ముందుగా మహేష్‌తో అనుకున్న సినిమా ఏడాది తర్వాత కాన్సిల్ అయింది.
అప్పటికప్పుడు అల్లు అర్జున్‌ని కలవగా, అక్కడ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. కానీ అప్పటికే త్రివిక్రమ్‌కి కమిట్ అయి వున్న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పూర్తయ్యే వరకు సుకుమార్ వేచి చూడాల్సి వచ్చింది.
ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత ‘పుష్ప’ మొదలు పెట్టవచ్చునని అనుకుంటే కరోనా కల్లోలం వచ్చి షూటింగ్స్ చేయడానికి వీలు లేకుండా చేసింది.
కొరటాల శివది మరో కథ. భరత్ అనే నేను తర్వాత చిరంజీవితో సినిమా చేద్దామని వెళ్లిన శివ అక్కడ లాక్ అయిపోయాడు.
సైరా అయ్యే వరకు ఎదురు చూసి, ఆచార్య షూటింగ్ ఒక నలభై శాతం పూర్తి చేసిన తర్వాత కరోనా వల్ల సదరు సినిమా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది.
అలా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ రెండేళ్లకు పైగా ఒకే చోట ఆగిపోయి వున్నారు.