లైగర్..దర్శకుడు పూరి జగన్నాధ్ విషయంలో ఇండస్ట్రీ జనాలు డబుల్ గేమ్ ఆడుతున్నారా? బయటకు ప్రచారంలోకి తీసుకు వస్తున్న విషయాలు, లైగర్ కు సంబంధించిన జనాలు పూరికి పెడుతున్న పర్సనల్ వాట్సాప్ మెసేజ్ లు పరస్పర వైరుధ్యంగా వుంటున్నాయి.
పూరి లేదా చార్మితో వాట్సాప్ లో టచ్ లో వుంటూ మనం మనం ఒకటే, మధ్యలో ఎవరో పుల్లలు పెడుతున్నారంటూ ఓ పక్క మెసేజ్ లు పెడుతున్నారు. అంతే కాదు మైహోమ్ రామ్ తో టచ్ లో వున్నాం. మనం కలుద్దాం అని కూడా మెసేజ్ లు పెట్టినట్లు తెలుస్తోంది. పూరి సన్నిహితుల దగ్గర ఈ మెసేజ్ స్క్రీన్ షాట్ లు వున్నాయి. మరోపక్క అదే మనుషుల టీమ్ లు మీడియాకు ఫోన్ లు చేసి ఇలా అవుతోంది..అలా అవుతోంది. రెస్పాండ్ కావడం లేదు అంటూ లీక్ లు ఇస్తున్నారు. ఇదే గమ్మత్తుగా వుంది.
ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వ్యవహారం కూడా అలాగే వుంది. ఓ పక్క పెద్ద మనుషుల్లా పూరి..చార్మిలతో డీల్ చేస్తూనే మరోపక్క సైలంట్ గా ఎగ్జిబిటర్లను ఎగసం తోస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన ఓ బిగ్ డిస్ట్రిబ్యూటర్ నే ఎగ్జిబిటర్లు అందరినీ ఏకం కమ్మని, పూరి ఆఫీసు మీదకు వెళ్లని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. అదే పెద్ద మనిషి పూరి, చార్మిలతో టచ్ లో వుంటూ తాను డీల్ చేస్తున్నట్లు కలర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
పూరి కనుక నేరుగా వరంగల్ శ్రీను కు లేదా శోభన్ కు అమౌంట్ పే చేస్తే ఎగ్జిబిటర్లకు రాదు. ఈ బడా ఎగ్జిబిటర్ కు కూడా ఆంధ్రలో ఓ ఏరియాకు, అలాగే తెలంగాణలో కొన్ని చోట్ల థియేటర్ అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తం వెనక్కు రావాలి. అందువల్ల మిగిలిన ఎగ్జిబిటర్లను రెచ్చగొట్టి రంగంలోకి దించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మొదటికే మోసం వచ్చింది.
నిజానికి శోభన్ మీద పూరికి పెద్దగా కోపం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆత్మహత్యే శరణ్యం అనే టైపులో కొందరు మెసేజ్ లు పెడుతుంటే ఇక ముందు జాగ్రత్తగా ఫిర్యాదు చేయక తప్పలేదని తెలుస్తోంది. ఇలా చేయకపోతే రేపు ఏదన్నా అనుకోనిది జరిగితే అది పూరి కి చార్మికి చుట్టుకుంటుంది.
మొత్తం మీద ఈ వివాదంలో ఆజ్యం పోసి, మంట పెట్టిన పెద్ద మనిషి తెరవెనుక వుండిపోయారు. ముందుకు వచ్చిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.