సినిమాల్లో లక్ ను దాదాపు పూర్తిగా పరీక్షించుకున్న తరువాత డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నారు నిర్మాత అనిల్ సుంకర. వాస్తవానికి ఆయనకు మహేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వుంది. కానీ అది 2021 చివరకు కానీ వుండకపోవచ్చు. అందుకే ఈ కరోనా నేపథ్యంలో మారుతున్న సినేరియాకు అనుగుణంగా ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెడుతున్నారు.
తెలుగునాట అత్యంత పాపులర్ అయిన షాడో క్యారెక్టర్ సిరీస్ ను అందించాలని, ఆ పాత్ర సృష్టికర్త, పాపులర్ రైటర్ మధుబాబుతో స్క్రిప్ట్ చేయిస్తున్నారు. నిజానికి మధుబాబుకు ఇప్పటికే టీవీ మాధ్యమానికి పనిచేసిన అనుభవం వుంది. అందువల్ల వెబ్ సిరీస్ కు ఆయన సులువుగానే అడాప్ట్ అవుతారు. పైగా షాడో సిరీస్ అన్నది నలభై నుంచి అరవై వరకు ఏజ్ గ్రూప్ అందరినీ ఆకర్షిస్తుంది.
అయితే ఇక్కడ సమస్యలు రెండు వున్నాయి. ఒకటి షాడో క్యారెక్టర్ తగిన హీరో. రెండు కాస్త ఖర్చు. ఇటీవల పాపులర్ అయిన వెబ్ సిరీస్ ల మాదిరిగా దేశంలోనూ, బోర్డర్ కు అటు ఇటు వుండే ప్రాంతాల్లోనూ షూటింగ్ జరిపితేనే ఈ సిరీస్ కు వాల్యూ వస్తుంది. ఎందుకంటే షాడో నవలలు అన్నీ అలాంటి ప్రాంతాల మీద నడిచేవే. అందువల్ల వెబ్ సిరీస్ కు కాస్త గట్టిగానే ఖర్చు పెట్టాల్సి వుంటుంది.
షాడో క్యారెక్టర్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక విజన్, ఒక ఇమేజ్ వుంది. దానికి తగిన హీరో కావాలి. కానీ తెలుగు హీరోలు ఎవ్వరూ వెబ్ సిరీస్ కు రెడీగా లేరు. అది గోపీచంద్ అయినా సరే. బెల్లంకొండ అయినా సరే. క్యారెక్టర్ ఫిట్ అయ్యే నటుడు దొరకడం అన్నదే ఇక్కడ కీలకం. ఈ అడ్డంకులు అధిగమిస్తేనే షాడో సిరీస్ కు ఆదరణ.