జగన్ కేబినెట్లోని ఇద్దరు బీసీ మంత్రులు పిల్లి సుభాస్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో….త్వరలో వాళ్లద్దరూ తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. దీంతో రెండు మంత్రి పదవుల కోసం ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. రెండు పదవులను కూడా తిరిగి బీసీలతోనే భర్తీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది.
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్నమోపిదేవి వెంకటరమణ స్థానాన్ని తిరిగి ఆ జిల్లా వాసులతోనే భర్తీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. గుంటూరు జిల్లాలో గెలిచిన ఏకైక బీసీ నాయకురాలు రజిని మాత్రమే. ఒకవేళ ఈ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కేవలం ఒక్కరితో మాత్రమే సరిపెట్టినవుతుంది.
రాజధాని తరలింపు నేపథ్యంలో, అందులోనూ ఆ ప్రాంతం నుంచి కేబినెట్లో ఏ మాత్రం ప్రాతినిథ్యం తగ్గిన జగన్ సర్కార్‌పై నెగిటివ్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మొదటి సారి ఎమ్మెల్యేగా విడదల రజిని ఎన్నికైనప్పటికీ…తన సేవా కార్యక్రమాల ద్వారా తక్కువ సమయంలోనే ఆమె ఎక్కువ గుర్తింపు పొందగలిగారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రజినీకి మంత్రి పదవి దక్కకుండా చేయాలనే పట్టుదలతో చిలకలూరిపేటలో ఆధిపత్యం చెలాయిస్తున్న సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారం గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది.
రజినీకి మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు…సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేటలో జగన్ ఇచ్చిన హామీని తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. విడదల రజినీని ఎమ్మెల్యేగా గెలిపించుకొస్తే…మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని నాడు జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సదరు నేత మహాభారతంలో “శ్రీకృష్ణుడి”లా ఉపాయాన్ని పన్ని…రజినీకి చెక్ పెట్టాలని శత విధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
గత ఎన్నికల ముందు వరకు చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ చూసుకున్నారు. రాజశేఖర్‌కు పిల్లనిచ్చిన మామ సోమేపల్లి సాంబయ్య అంతకుముందు ఈ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. టీడీపీకి ప్రత్యర్థిగా పేట నియోజకవర్గంలో 40 ఏళ్లుగా సోమేపల్లి కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనూహ్యంగా బీసీ సామాజికవర్గానికి చెందిన విడదల రజినికి పార్టీ టికెట్టు ఇచ్చారు.
వరుసగా రెండు సార్లు ఓటమి చవిచూడటం, నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత, ఆర్థికంగా బలవంతుడుకాకపోవడం.. ఇలా పలు కారణాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్‌కు గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ టికెట్టు దక్కలేదు. విడదలను గెలిపించుకొస్తే మంత్రి పదవి ఇస్తానని మర్రి రాజశేఖర్ కు మాత్రం ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అయితే విడదల రజిని గెలుపు కోసం పనిచేయడం అటుంచితే…ఆమె ఓటమి కోసం మర్రి రాజశేఖర్ పనిచేశారని ఆ తర్వాత అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.
అందుకు సంబంధించిన పూర్తిడేటా, సాక్ష్యాలను కూడా రజిని వర్గీయులు సీఎంకు అందజేశారు. దీనికి తోడు మర్రి రాజశేఖర్‌తోపాటు ఆయన వర్గీయులు కూడా సీఎం వైఎస్ జగన్‌ను దూషించిన విషయాన్ని కూడా సాక్ష్యాలతో సహా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పేట రాజకీయ ముఖచిత్రం కూడా క్రమంగా మారుతూ వచ్చింది.
మర్రి రాజశేఖర్, అక్కడి స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరూ బలమైన ఒకే సామాజికవర్గానికి చెందిన నాయకులు. చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ వారి సామాజికవర్గానికి చెందిన ఓటర్లే అధికం. విడదల రజిని ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజు నుంచి సొంత పార్టీలోని ఈ ఇద్దరు నాయకులతోనే పోరాడాల్సి వస్తోందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికీ మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలుతో నిత్యం యుద్ధమే అన్నట్టు విభేదాలున్నాయి.
ఇంకా చెప్పాలంటే విడదల రజినికి ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ ప్రజాప్రతినిధులతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. అపార రాజకీయ అనుభం కూడా తోడవడంతో సాధ్యమైనంతగా రజినిని ఇబ్బందుల పాలుచేసేందుకు మర్రి తెరచాటున పని చేస్తున్నారని ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న సీఎం జగన్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకంగా కలిశారు. ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే విడదల రజిని కూడా సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. విడదల రజినికి మంత్రి పదవి ఇవ్వడానికి వీల్లేదని, పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.
అయితే పార్టీ అధిష్టానం మాత్రం విడదల రజిని వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. బీసీ సామాజికవర్గం, అందునా మహిళ కావడంతో సహజంగానే సీఎం విడదల రజినికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఉన్నత విద్యావంతురాలు, పలు భాషల్లో ప్రావీణ్యం, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తుండటం, ప్రజలకు వీఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు.. ఇవన్నీ విడదల రజినికి సానుకూల అంశాలుగా కనబడుతున్నాయి. ఇలాంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతోందనేది ఉత్కంఠగా మారింది.