వివిధ కేసుల్లో జైలుపాలవుతున్న టీడీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించడానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. ఇటీవల ఆయన తాడిపత్రి వెళ్లి జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉంటున్న అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను లోకేశ్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాటలు అచ్చెన్న కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వడానికి బదులు భయపడేలా చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఈఎస్ఐ విషయంలో అచ్చెన్నాయుడుకు సంబంధం లేదు. ఆయన్ని కుంభకోణంలో ఇరికించారు’ అని నారా లోకేశ్ చెప్పడం అచ్చెన్న కుటుంబ సభ్యుల్లో మరింత భయాందోళనలు కలిగించాయని…సొంత పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏకంగా ఇరికించారు లాంటి పెద్దపెద్ద పదాలు వాడడంతో…అంటే ఇక అచ్చెన్న బయటపడే మార్గమే లేదా అనే అనుమానాలు కుటుంబ సభ్యుల్లోనూ, ఆయన అనుచరుల్లోనూ కలుగుతున్నాయంటున్నారు.
అచ్చెన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసు పెట్టారన్నారు. అలాగే యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళ్తే కేసులు పెట్టారని, అయ్యన్న పాత్రుడుపై నిర్భయ కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఫైబర్ గ్రిడ్‌కి.. ఐటీ మంత్రికి సంబంధం లేదని లోకేశ్ అన్నారు. ఫైబర్‌గ్రిడ్‌లో అవినీతిపై జగన్ సర్కార్ సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్న నేపథ్యంలో లోకేశ్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే ఐటీ మంత్రిగా లోకేశ్ ఫైబర్ గ్రిడ్‌లో అవినీతికి పాల్పడ్డారని, ఆయన జైలుకు వెళ్లక తప్పదనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో లోకేశ్ తనకేం సంబంధం లేదని పదేపదే చెబుతుండడం గమనార్హం.