అమరావతి బాగోతంలో ఇంటిదొంగలు!

ఇన్‌సైడర్ ట్రేడింగ్.. షేర్ మార్కెట్ వ్యవహారంలో చాలా గుంభనమైన ఆర్థికనేరం ఇది. చట్టాలు చాలా తీవ్రంగా పరిగణించే నేరం కూడా. ఇది ఒకరకంగా ఇంటిదొంగల వ్యవహారం అన్నమాట. మామూలుగా షేర్ మార్కెట్ వ్యవహారాల్లో వినిపించే…

ఇన్‌సైడర్ ట్రేడింగ్.. షేర్ మార్కెట్ వ్యవహారంలో చాలా గుంభనమైన ఆర్థికనేరం ఇది. చట్టాలు చాలా తీవ్రంగా పరిగణించే నేరం కూడా. ఇది ఒకరకంగా ఇంటిదొంగల వ్యవహారం అన్నమాట. మామూలుగా షేర్ మార్కెట్ వ్యవహారాల్లో వినిపించే ఈ నేరం.. ఇప్పుడు రాజకీయ నాయకుల నోట్లో వినిపిస్తోంది. అమరావతి రాజధాని స్థలాల కొనుగోలు బాగోతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఈ ఇంటిదొంగలెవరో? వారి దొంగపని ఏ మోతాదులోనిదో.. త్వరలోనే సరైన సమయంలో బయటపెడతాం అని కూడా బొత్స అంటున్నారు.

అమరావతి ప్రాంతంలో రాజధాని ఉంటుందా? లేదా అనే విషయంలో ఇప్పటికే సవాలక్ష సందేహాలు ముసురుకుంటున్నాయి. అనుమానాలు, పుకార్లకు లెక్కేలేదు. ఇలాంటి నేపథ్యంలో భాజపా కూడా.. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతోంది. ఆ పార్టీకి కొత్త నాయకుడు సుజనా చౌదరి చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. అమరావతి ప్రాంతంలో తనకు కించిత్తు స్థలం కూడా లేదని.. తనకు ముడిపెట్టి ఆరోపణలు చేసేవారు నిరూపించాలని.. చాలా సవాళ్లు కూడా విసిరారు.

వీటన్నిటికీ సంబంధించి.. ఇవాళ బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఈ భూఅక్రమాలకు పాల్పడిన వారి వివరాలను త్వరలోనే  బయటపెడతాం అని ఆయన అంటున్నారు. సవాళ్లు విసిరితే గనుక.. మాజీ కేంద్రమంత్రికి (సుజనా) సంబంధించిన మొత్తం వ్యవహారాలు బయటపెడతాం అని కూడా అంటున్నారు.

ఈ భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటే మరేంకాదు. ఇక్కడ రాజధాని వస్తుందనే ప్రకటనకు ముందే.. తమ వారికి ఉప్పందించుకుని పచ్చదళాలు బినామీ పేర్లతో భూములు కొనేసుకోవడం, ఆ తర్వాత.. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత.. పెద్ద ధరలకు అమ్ముకోవడం లాంటి వ్యవహారాలు అన్నమాట.

నిజానికి షేర్ మార్కెట్లో ఇలాంటి ఇంటిదొంగల మోసానికి నిర్దిష్టమైన చట్టాలు ఉన్నాయి. దీనికి పాల్పడినవారు, ఆ మార్గంలో ఆర్జించిన లాభాలన్నీ కంపెనీకే చెందేలా.. ఆ చట్టం నిర్దేశిస్తుంది. ప్రభుత్వం అదే తరహాలో కొరడా ఝుళిపిస్తే.. అమరావతి భూ అక్రమాలకు పాల్పడిన ఇంటిదొంగలు.. బొక్కిన లాభాలాన్నీ.. ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వస్తుందేమో?

తరలించరు.. కానీ తగ్గిస్తారు!