కేసీఆర్ డైలమా.. కొడుకా, మేనల్లుడా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం వెదుకుతున్నారు. శ్రావణమాసం ముగిసేలోపే మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 18మంది ఉండాల్సిన కేబినెట్ లో ప్రస్తుతం 12మందే ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్ పై వేటుపడే అవకాశం…

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం వెదుకుతున్నారు. శ్రావణమాసం ముగిసేలోపే మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 18మంది ఉండాల్సిన కేబినెట్ లో ప్రస్తుతం 12మందే ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్ పై వేటుపడే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. సో.. 7 ఖాళీలు ఉంటాయన్నమాట. ఇద్దరు మహిళల్ని తీసుకుంటే ఐదుగురు పురుషులకు అవకాశం ఉంటుంది. ఈ ఐదుగురిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కేటీఆర్.

కొడుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి టీఆర్ఎస్ భావినేతగా ఓ క్లియర్ పిక్చర్ క్రియేట్ చేసిన కేసీఆర్, ఇప్పుడాయన్ని కేబినెట్ లోకి తీసుకురాబోతున్నారు. అయితే కేసీఆర్ కు మరో ఇబ్బంది హరీష్ రావుతో ఎదురవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో అహం దెబ్బతిన్నవేళ, హరీష్ కి బీజేపీ గాలమేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, కేసీఆర్ తన మేనల్లుడిని మంత్రిపదవితో బుజ్జగిస్తారని చాలామంది భావిస్తున్నారు. తాజా విస్తరణలో కేటీఆర్ ని మంత్రిని చేసి, హరీష్ కి మొండిచేయి చూపిస్తే మాత్రం పార్టీలో అలజడి రేగడం ఖాయం.

గతంలో తెలంగాణ మంత్రివర్గంలో హరీష్ రావుకు స్ధానం దక్కలేదని తెలిసిన వెంటనే కేసీఆర్ తప్పు చేస్తున్నారనే భావన చాలామందిలో వచ్చింది. అయితే కొడుక్కి కూడా కేబినెట్ బెర్త్ ఇవ్వకపోవడంతో.. వ్యూహాత్మకంగానే వీరిద్దర్నీ పక్కనపెట్టారని, వీరితో కేసీఆర్ కి ఇంకేదో పెద్ద పనే ఉందని అనుకున్నారంతా. రోజులు గడుస్తున్నాయి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ దూసుకెళ్తున్నారు, మరోవైపు హరీష్ రావు పార్కుల శంకుస్థాపనలు, వాకర్స్ క్లబ్ మీటింగ్ లు అంటూ పూర్తిగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

అంతలోనే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంతో ఆందోళన మొదలైంది. తెలంగాణలో కీలక నేతలందరికీ బీజేపీ గాలమేస్తోంది. అందులో హరీష్ కూడా ఒకరు. తాను టీఆర్ఎస్ కి వీర విధేయుడిని అని చెప్పుకునే హరీష్ రావు.. ఎవరు రెచ్చగొట్టినా లొంగేరకం కాదు. కానీ ఆయన ఇగో కూడా పూర్తిగా దెబ్బతింటే అప్పుడెవరూ ఏం చేయలేరు. ఇప్పుడా స్టేజ్ వచ్చిందని అంటున్నారంతా.

విస్తరణలో కేటీఆర్ కి మంత్రిపదవి ఇచ్చి హరీష్ ని పక్కనపెడితే పార్టీలో హరీష్ వర్గం ఊరుకునే ప్రసక్తేలేదు. నిరసన సెగలు ఎక్కువై, కార్యకర్తలపై క్రమశిక్షణ వేటుపడటం మొదలైతే హరీష్ లో కూడా సహనం చచ్చిపోయే అవకాశముంది. అలాంటి అదను కోసమే బీజేపీ కాచుక్కూర్చుంది. తానే పక్కన పెట్టిన మేనల్లుడిని కేసీఆర్ కోరి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారా? కొడుకు కోసం మేనల్లుడిని జాగ్రత్తగా పక్కకు నెట్టేసిన రాజకీయ చాణక్యుడు, తన మనసుకి నచ్చనిపని చేస్తాడా? కుటుంబం కోసం కేసీఆర్ పార్టీని పణంగా పెడతారా? ఈ సస్పెన్స్ కి మరికొద్ది రోజుల్లో తెరపడుతుంది. 

తరలించరు.. కానీ తగ్గిస్తారు!