కర్ణాటకలో ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ దాన్ని నిలుపుకోవడానికి అన్ని మార్గాలనూ ట్రై చేస్తోంది. ఉన్నది బోటాబోటీ మెజారిటీ. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని అయితే ఎలాగోలా నిలుపుకోవచ్చు. కానీ ఇప్పుడు గనుక ప్రభుత్వం పడిపోతే అప్పుడే ఎన్నికలను ఎదుర్కొనడానికి ఆ పార్టీ నేతలు ఎవరూ అంత రెడీగా లేరట!
వరసగా ప్రతి యేడాదీ ఎన్నికలను ఎదుర్కొనాలంటే కష్టమని కర్ణాటక కమలం పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారట. అందుకే బోటాబోటీ మెజారిటీ ప్రభుత్వాన్నే నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై రోజుల తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అయితే ఆ విషయంలోనూ అసంతృప్తి జ్వాలలు రేగాయి. మంత్రి పదవులు దక్కనివారు అసంతృప్తి వ్యక్తంచేశారు. వారికి ముందు ముందు అవకాశాలు ఇస్తామంటూ ఊరడిస్తున్నారట యడియూరప్ప. ఇక శాఖల కేటాయింపు అనే మరో తతంగం మిగిలి ఉంది.
మంత్రిపదవి దక్కడం ఒక ఎత్తు అయితే ఎవరికి ఏ శాఖ అనేది మరోఎత్తు. ఈ విషయంలో అందరినీ సంతృప్తి పరచడం ఈజీ కాదు. అందుకే వీలైనంతమంది డిప్యూటీ సీఎంలను నియమిస్తారట. తమకు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని యడియూరప్ప కేబినెట్లోని చాలామంది మంత్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారిలో ఎవరో ఒకరికి ఆ పదవి ఇవ్వాలని యడియూరప్ప అంటున్నారట.
కానీ.. కనీసం ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఖాయమనే టాక్ వినిపిస్తూ ఉంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించిన సంగతి తెలిసిందే. జగన్ కు ఫుల్ మెజారిటీ ఉన్నా ఐదుగురు డిప్యూటీలను నియమించారు. కర్ణాటకలో మాత్రం బీజేపీకి అసంతృప్తులు తలెత్తకుండా ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించనున్నారని తెలుస్తోంది.