జగన్ నోటి వెంట ఆ మాట రావాల్సిందేనా..?

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజధాని రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనతో పాటు మంత్రులందరూ రాజధాని మారదు అని క్లారిటీ ఇచ్చినా కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గడంలేదు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్,…

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజధాని రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనతో పాటు మంత్రులందరూ రాజధాని మారదు అని క్లారిటీ ఇచ్చినా కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గడంలేదు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ… అంతా తలో చేయివేసి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని మారదు బాబూ అంటున్నా వినకుండా, మారిస్తే మా ఉగ్రరూపం చూస్తారంటూ సవాళ్లు విసురుతున్నారు. వివాదానికి కారణమైన బొత్స నాలుగైదు సార్లు మీడియా ముందుకొచ్చినా ఎవ్వరూ శాంతించడం లేదు. తాజాగా రాజధాని రైతులుగా చెప్పుకునే ఓ బ్యాచ్.. పురుగు మందుల డబ్బాతో నిరసనకు దిగడం ఈ ఎపిసోడ్ కి పరాకాష్ట.

అసలు ఈ నిరసనలన్నీ ఎప్పుడు చల్లారతాయి, రాజధాని మార్చే ఆలోచన లేదు అని ప్రభుత్వం స్పష్టంచేసినా ఎందుకీ రాద్ధాంతం. కేవలం జగన్ కోసమే ఈ సవాళ్లన్నీ అని స్పష్టంగా అర్థమవుతోంది. రాజధాని రచ్చ జరిగిన సమయంలో జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కనీసం ఆయన వచ్చిన తర్వాత కూడా స్పందించలేదు. బొత్స వ్యాఖ్యల్ని ఖండించలేదు, సమర్థించలేదు, అసలీ విషయం తెలియనట్టే ఉన్నారు.

రాజధాని పేరుతో జరిగిన వృథాపై జగన్ గతంలో స్పందించారు. నిర్మాణాలపై వెచ్చించిన డబ్బు నీళ్లపాలు కాకుండా కేవలం మొదలు కాని నిర్మాణాలను మాత్రమే ఆపేయమని ఆదేశాలిచ్చారు. జరుగుతున్న వాటిని జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతానికి జగన్ ఆలోచన రాజధాని గురించి కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజా శ్రేయస్సు గురించి. ప్రజా శ్రేయస్సుని గాలికొదిలేసి, రాజధాని పేరుతో కోట్ల రూపాయలు కొట్టేయాలనుకున్న టీడీపీ.. దాన్ని సక్సెస్ ఫుల్ గానే మొదలు పెట్టింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడీ అవకతవకలన్నీ బైటపడుతున్నాయి.

అయితే ప్రభుత్వంపైకి ప్రజల్ని రెచ్చగొట్టేందుకే ఇప్పుడీ రాద్ధాంతం జరుగుతోందన్నది సుస్పష్టం. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే జగన్ స్పందించాల్సిందే. జగన్ నోటి వెంట అమరావతి నిర్మాణం అనేమాట వస్తేనే ఈ రచ్చ అంతా ఆగిపోయే అవకాశం ఉంది. అయితే జగన్ ఇలాంటి బెదిరింపులకు లొంగి అమరావతిపై ప్రకటన చేస్తారా అనేదే తేలాల్సిన విషయం. జగన్ స్టేట్ మెంట్ కోసం అటు ప్రతిపక్షాలే కాదు, అధికార పక్ష నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

తరలించరు.. కానీ తగ్గిస్తారు!