‘‘హిస్టరీ ఈజ్ రిటెన్ బై విక్టర్స్’’ చరిత్ర అనేది విజేతలతోనే రాయబడుతుంది.. అనేది విన్స్టన్ చర్చిల్ చెప్పిన మాటగా మనం చదువుకుంటూ ఉంటాం. నిజానికి చరిత్రను నివేదించే సమయానికి ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగానే రాయబడుతుంది. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. కాశ్మీరం గురించి అక్కడ ప్రస్తుత వాతావరణం ఎలా ఉన్నదనడానికి సంబంధించి.. తతిమ్మా భారతదేశానికి తెలుస్తున్న సంగతులు, సమాచారం… ‘ప్రభుత్వం అనుమతించినవి మాత్రమే’ అని అర్థమవుతోంది. తాజాగా అనంతనాగ్ జిల్లాలో అల్లరి మూకలు రాళ్లురువ్వి ఓ లారీ డ్రైవరు మరణించడంతో.. ఆ వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
370 రద్దును దేశమంతా హర్షించింది. మంచిదే. దానిపట్ల జమ్మూకాశ్మీర్లో ప్రతికూలత ఉంటుందని కూడా అందరూ ఊహించిందే. అందుకే అక్కడ మిక్కిలిగా మిలిటరీని దించి.. పరిస్థితుల్ని ‘కంట్రోల్’లో పెట్టడానికి మోడీ సర్కార్ ప్రయత్నించినప్పుడు.. దేశ ప్రజలెవ్వరూ ప్రశ్నించలేదు. అక్కడ టీవీలను కట్ చేశారు, మొబైల్ సేవలను ఆపేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఆపేశారు. అక్కడ ఏం జరుగుతోందనేది.. ప్రభుత్వం ఎంతచెబితే అంత మాత్రమే బాహ్యప్రపంచానికి తెలిసే ఏర్పాటు చేశారు.
అందుకే అజిత్ దోభాల్ వద్దకు కాశ్మీరీలు సంబరంగా రావడం, వారితో కలిసి ఆయన రోడ్డు మీద తినడం వంటివి మాత్రమే ప్రపంచానికి తెలిశాయి. కొన్నిరోజుల తర్వాత జమ్మూలో ఆంక్షలు ఎత్తేసినా.. కాశ్మీర్లో ఎత్తేయలేదు. కొన్ని చెదురుమదురు సంఘటనలు ఉన్నాయంటూ.. అక్కడి పరిస్థితిని తక్కువ చేసి ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నించారు. ఇవాళ ఓ లారీని సైనిక వాహనంగా భావించి.. అల్లరిమూకల కుర్రాళ్లు రాళ్లు రువ్వడంతో ఆ డ్రైవరు చనిపోయాడు. చనిపోయాడు గనుక- సంగతి బయటకు తెలిసింది. అక్కడ రోజూ ఎక్కడో ఒకచోట కుర్రాళ్లు అల్లరి చేస్తున్నారని, నిరసనలు తెలియజేస్తున్నారని అర్థమవుతోంది.
అయితే ఈ నిరసనలు చేస్తున్నది… పరిమితమైన ఒక అల్లరిమూకల వర్గమా.. కాశ్మీరీ సమాజమా అనేది మనకు క్లారిటీ రావడంలేదు. కొందరు రాళ్లురువ్వి ఒకర్ని చంపగానే.. అక్కడ యావత్తూ అదే భావనతో ఉన్నారని అనుకోలేం. కానీ.. మొత్తానికి.. ప్రభుత్వం చెబుతున్నంత ప్రశాంతంగా కాశ్మీర్లో పరిస్థితి లేదని మాత్రం అనుకోవాల్సి వస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండడానికే.. విపక్ష నేతలను రాహుల్ తదితరులను కూడా విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా తిప్పి పంపుతున్నారని తెలుస్తోంది. ఎన్నాళ్లిలా ఆపగలరు?