జనసేనతో టీడీపీ పొత్తు వుంటుందని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సమీక్షలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షిస్తూ, అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికి 111 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశమై, రాజకీయ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పద్ధతి మార్చుకోవాలని కొందరికి చీవాట్లు పెట్టారు. మరికొందరికి టికెట్లను ఖరారు చేసి, విజయంతో తిరిగి రావాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జనసేన పరిస్థితి ఏంటనే చర్చకు తెరలేచింది. టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తే, జనసేనకు ఎలా సర్దుబాటు చేస్తారనే అనుమానాలు ఇరు పార్టీల్లోనూ నెలకున్నాయి. జనసేన 40 అసెంబ్లీ టికెట్లు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ దృష్టిలో ఈ సంఖ్య చాలా పెద్దదే. జనసేనతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా లాభం సంగతి పక్కన పెడితే, 40 సీట్లు ఇస్తే మాత్రం నష్టపోవడం ఖాయమని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
అయితే తమను పరిగణలోకి తీసుకోకుండానే చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై జనసేన ఒకింత ఆందోళనకు గురవుతోంది. ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించి, ఆ తర్వాత వద్దని ఏ పార్టీ అన్నా… అది రివర్స్ కాక తప్పదు. ఫలానా చోట జనసేనకు టికెట్ కేటాయించామని చివరి నిమిషంలో ప్రకటిస్తే… అప్పటి వరకూ ప్రచారం చేసుకున్న టీడీపీ అభ్యర్థి ఊరికే వుంటారని అనుకుంటే పొరపాటే. తనకు కాదని మరెవరికో టికెట్ ఇస్తే మాత్రమే, సొంత పార్టీపై అక్కసుతో స్వతంత్రగా లేదా మరో పార్టీ తరపున బరిలో నిలిచి నష్టం చేస్తాడు.
జనసేన 40 టికెట్లు అడుగుతున్నా, 10 సీట్లతో సరిపెట్టే నైపుణ్యం చంద్రబాబు సొంతమనే ప్రచారం జరుగుతోంది. జనసేన అడిగినట్టు కాకుండా, తాను ఇవ్వాలనుకున్న చోట మాత్రం అభ్యర్థులను ప్రకటించకుండా…. చివరి వరకూ నాన్చుతారనే ప్రచారం జరుగుతోంది. జనసేనకు ఇచ్చే టికెట్లపై ఇంకా క్లారిటీ రాలేదన్నది వాస్తవం. ఎప్పుడైతే పవన్ తనకు తానుగా అత్యుత్సాహం ప్రదర్శించడం మొదలు పెట్టారో, అప్పుడే డిమాండ్ చేసే అర్హత కోల్పోయారని చెప్పొచ్చు.