మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అనేక రకాల పదవులు ఉంటాయి. వాటిల్లో నామినేటెడ్ పదవులు ఒక రకం. మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు దక్కనివారికి ఈ నామినేటెడ్ పదవులు ఇస్తుంటారు. ప్రభుత్వం ఇలాంటి పదవులు ఎన్నైనా సృష్టించుకోవచ్చు. వాళ్లకు ఇచ్చేది ప్రజాధనమే కదా.
నామినేటెడ్ పదవుల్లో సలహాదారు అనేది ఒకరకమైన పదవి. వీళ్లకు ఎలాంటి అధికారాలు ఉండవు. స్వతంత్రంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. కేవలం ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వడమే వీరి పని. ఏ ప్రభుత్వంలోనూ లేనంతమంది సలహాదారులు జగన్ ప్రభుత్వంలో ఉన్నారు. వీరు ఏం సలహాలు ఇస్తారో మనకు తెలియదు. వీరి సలహాలు సీఎం పాటించకపోవవచ్చు. పాటించవచ్చు చెప్పలేం.
మొత్తమ్మీద చెప్పుకోవడానికి ఒక పదవి ఉంటుంది. లక్షల్లో జీతాలు అందుతాయి. వాస్తవం చెప్పాలంటే సినీ నటుడు అలీ జగన్ ప్రభుత్వంలో పదవి కోరుకున్నాడుగానీ ఇలాంటి పదవి ఆయన కోరుకోలేదు. ఈ పదవివల్ల ఆలీకి వచ్చే పొలిటికల్ మైలేజ్ కూడా ఏమీ ఉండదు.
ఇంతకూ ఆలీకి ఇచ్చిన పదవి ఏమిటో తెలుసు కదా. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి. ఆల్రెడీ ఇద్దరు మీడియా సలహాదారులున్నారు. ఈయన మూడో సహాదారు అంతే. పదవి విషయంలో వాళ్ళ కంటే జూనియర్ అని చెప్పుకోవాలి. ఆ మీడియా సలహాదారులిద్దరికీ పదవీకాలం ముగిసినా జగన్ మరో రెండేళ్లపాటు పొడిగించారు. అలీ పదవీ కాలం కూడా రెండేళ్లే. ముగిసిపోతే మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు. ఎన్నికలు వచ్చేస్తాయి.
ముఖ్యంగా సలహాదారులకు ప్రభుత్వంతో ప్రజలతో, మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి వారు తెరవెనుక ఉండిపోవలసిందే. జగన్ ను పొగడటానికి, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికి మీడియా ముందుకు రావలసిందే. గతంలో సినీ నటుడు పృథ్వీ తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వగానే ప్రతిపక్షాల మీద, సినిమా వాళ్ళ మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయాడు. స్వయంకృతాపరాధం వల్ల పదవి ఊడిపోయాక సినిమా రంగం వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అందరినీ క్షమాపణలు వేడుకుంటున్నాడు. అలాంటి పరిస్థితి తనకు ఎదురు కాకుండా అలీ చూసుకోవాలి. ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది నామమాత్రపు పదవి మాత్రమే.
అలీ సలహాలు ఇచ్చినా జగన్ పట్టించుకోరు. జగన్ ఎవరి సలహాలు తీసుకోరని ప్రచారంలో ఉంది. గతంలో సలహాదారుగా పనిచేసిన ప్రముఖ పాత్రికేయుడు రామచంద్రమూర్తి జగన్ తన సలహాలు తీసుకోవడంలేదని, అలాంటప్పుడు ఈ పదవి తనకు ఎందుకని రాజీనామా చేశారు. జగన్ సలహాలు తీసుకోరనే విషయం ఆయన బహిరంగంగానే చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. ఆయనకు నాటి ఎన్నికల్లోనే సీటు ఇస్తారని భావించినా, ఆయన పోటీ చేయలేదు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఒక, కొద్ది రోజుల క్రితం ఆలీ తన సతీమణితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి కలిసారు.
ఆ సమయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు. అప్పుడు అటు రాజ్యసభ – ఇటు ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఆలీని మైనార్టీ కోటాలో రాజ్యసభకు లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని, దీని ద్వారా సినీ ఇండస్ట్రీకి కూడా ప్రాముఖ్యత దక్కినట్లువుతందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ, ఆలీ తాను సీఎం జగన్ తో కలిసిన సమయంలో ఎటువంటి పదవి కావాలని కోరలేదని, ఏ బాధ్యత అప్పగించినా సిద్దమేనని స్పష్టం చేసారు. ఆ తరువాత ఇప్పుడు ఆలీకి ప్రభుత్వంలో సలహాదారు పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
వైసీపీలో పదవి రాకపోవటంతో తిరిగి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పని చేసేందుకు ఆలీ జనసేన లో చేరుతారనే ప్రచారమూ సాగింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ మీడియా సలహాదారు పదవిని ఆలీకి కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఆలీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలుస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.