ఈసారి గట్టిగా చెబుతున్నాను, నన్ను నమ్మండి

హాయ్ నాన్న ప్రమోషన్స్ జోరు పెంచాడు నాని. దీపావళి సందర్భంగా ఇంటర్వ్యూ రిలీజ్ చేశాడు. సినిమాలో తనకు కూతురిగా నటించిన చిన్నారితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర…

హాయ్ నాన్న ప్రమోషన్స్ జోరు పెంచాడు నాని. దీపావళి సందర్భంగా ఇంటర్వ్యూ రిలీజ్ చేశాడు. సినిమాలో తనకు కూతురిగా నటించిన చిన్నారితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రతి సినిమాకు ఒకేలా ప్రచారం చేస్తానని, కాని కొన్ని సినిమాలకు మాత్రం కాస్త గట్టిగా చెబుతానని, అలాంటి టైమ్ లో ప్రేక్షకులు తన నమ్మకంతో ఏకీభవించారని, హాయ్ నాన్న గురించి కూడా కాస్త గట్టిగా చెబుతున్నానని అన్నాడు.

“అన్ని సినిమాలకు దాదాపు ఒకేలా ప్రచారం చేస్తాం, రిలీజ్ కు ముందు సినిమా గొప్పగా ఉందని చెబుతుంటాం. కొన్ని సార్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం, ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు. హాయ్ నాన్న సినిమా ఆ కోవకు చెందిన మూవీ. నేను నా సినిమాలకు సంబంధించి ఏదైనా గట్టిగా చెప్పినప్పుడు, దాన్ని నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. ఈసారి అలా గట్టిగా చెబుతున్నాను. ప్రామిస్ కూడా చేస్తున్నాను. హాయ్ నాన్న చాలా స్వీట్ ఫిలిం. ప్రేక్షకుడు కంప్లీట్ గా తృప్తి చెందుతాడు. నాది గ్యారెంటీ.”

ఇలా హాయ్ నాన్న సినిమాపై తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు నాని. ఓ పరిపూర్ణమైన ప్రేమకథను, కుటుంబ భావోద్వేగాల్ని మంచి మ్యూజిక్ తో, గ్రాండ్ విజువల్స్ తో బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైందని.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేసుకునేలా హాయ్ నాన్న సినిమా ఉంటుందని చెబుతున్నాడు.  

డిసెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది హాయ్ నాన్న. మృణాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హేషమ్ సంగీతం అందించాడు.