వినే వాళ్లుంటే చంద్రబాబు ఎన్ని కబుర్లైనా చెబుతారు. తనపై అభిమానంతో కుప్పం ప్రజలు గెలిపిస్తున్నారని చంద్రబాబు అనడం ఆసక్తికరం. కుప్పం పట్టణానికి చదువుకునేందుకు బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించలేని వైనాన్ని రెండు రోజుల క్రితం ఈనాడు పత్రిక బయట పెట్టిన సంగతి తెలిసిందే. బతుకుదెరువు కోసం ఇప్పటికీ కర్నాటకకు వేలాది మంది కుప్పం నుంచి వెళుతున్న దయనీయ స్థితి ఉంది.
1989 నుంచి ఏకధాటిగా తనను కుప్పం ప్రజలు ఎన్నుకుంటున్నట్టు చంద్రబాబు గొప్పగా చెప్పారు. తన నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పులివెందులలో మాదిరిగా భయాన్ని సృష్టించి ఓట్లు వేయించుకునే అలవాటు కుప్పం లేదన్నారు. అభిమానంతోనే అక్కడి ప్రజలు తనను గెలిపిస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చారు.
1983లో సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చంద్రబాబుకు చుక్కలు చూపించారు. దీంతో అమాయక ప్రజలు కుప్పంలో ఉన్నారని తెలుసుకుని, అక్కడికి వలస వెళ్లారు. మంచోచెడో చంద్రబాబును వరుసగా గెలిపిస్తున్నారు. కానీ కుప్పం ప్రజల రుణాన్ని చంద్రబాబు తీర్చుకునేదెప్పుడు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తన రాజకీయ ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు శూన్యమని చెప్పొచ్చు.
అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, ఆ పార్టీ మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అభిమానం పొందడమే కాదు, ఇవ్వడం తెలిసిన నాయకుడినే జనం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇంకా తననే అభిమానించాలనే చంద్రబాబు ఆలోచనలకు కుప్పం చరమగీతం పాడే రోజు దగ్గర్లో వుంది. ఆ వాస్తవాన్ని గ్రహించకపోతే… స్థానిక సంస్థల్లో ఎదురైన చేదు అనుభవాలే, సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం అవుతాయని చెప్పక తప్పదు.