చంద్రబాబునాయుడు కోసం శిఖండి పాత్ర పోషించడానికి సీపీఐ ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. వెనుకబడిన ప్రాంతాలకు మద్దతుగా నిలవాల్సిన సీపీఐ, ఆ పని వదిలేసి వ్యతిరేకంగా పని చేయడానికి తహతహలాడడం విమర్శలకు గురవుతోంది. ఒక్క ఓటు, సీటు లేని సీపీఐ, సీమపై విషం కక్కడానికి చంద్రబాబు తరపున ఉత్సాహం చూపుతోంది. తాజాగా ఈ చర్యలో భాగంగా సీపీఐ శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడమే.
దీని వెనుక ఎవరున్నారో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. తిరుపతిలో ఓ ఇంటర్నేషనల్ హోటల్‌లో సీపీఐ రౌండ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుండడమే ఆ పార్టీ దగాకోరు రాజకీయానికి నిదర్శనం. ఖరీదైన ఇంటర్నేషనల్ హోటల్‌లో సమావేశం నిర్వహించే స్థాయికి సీపీఐ ఎదిగిందనే సంతోషించాలో, లేక టీడీపీ కంబంధ హస్తాల్లో ఇరుక్కుందని సిగ్గుపడాలో ఆ పార్టీ శ్రేణులో ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శనను శనివారం నిర్వహించతలపెట్టారు. ఇందుకు అధికార పార్టీ పకడ్బందీగా సమన్వయం చేసుకుంటోంది. అన్ని వర్గాల ప్రజల్ని, విద్యార్థుల్ని ఈ మహాప్రదర్శనలో భాగస్వామ్యం చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఇక్కడే టీడీపీ తన శిఖండి అస్త్రాన్ని రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శనపై ప్రయోగించడానికి సిద్ధమైంది.
మూడు రాజధానుల పేరుతో మహాప్రదర్శనకు విద్యార్థులను తీసుకురావాలని విద్యాసంస్థల యాజమాన్యాలపై అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని, అమరావతి రాజధానికి మద్దతుగా ఇవాళ సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి మీడియాకు ప్రకటన పంపారు.
రాయలసీమ గడ్డపై విద్యాసంస్థలు నెలకొల్పామని, ఆ ప్రాంత విద్యార్థుల వల్లే వ్యాపారం చేసుకుంటున్నామని, మూడు రాజధానులను తాము ఎందుకు వ్యతిరేకిస్తామని విద్యాసంస్థల యజమానుల వాదన. తమ పేరు చెప్పుకుని ప్రతిపక్షాలు పబ్బం గడుపుకోవడం ఏంటని విద్యాసంస్థల యజమానులు నిలదీస్తున్నారు. ఓటు, సీటు లేని సీపీఐ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలతోనే వేర్పాటువాద ఉద్యమాలకు దారి తీస్తోందని తిరుపతి ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఒకవైపు రాయలసీమలో హైకోర్టు పెట్టడానికి సానుకూలమని చెబుతున్న సీపీఐ, అందుకు విరుద్ధంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఎవరికి కోసం, ఎందుకోసం అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. రాయలసీమలో హైకోర్టు పెట్టడానికి సీపీఐ అను కూలమా, వ్యతిరేకమా రౌండ్‌టేబుల్ వేదికగా తేల్చి చెప్పాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. సీపీఐ తన సిద్ధాంతాల్ని, లక్ష్యాల్ని వదిలేసి పూర్తిగా చంద్రబాబుకు తాకట్టు పెట్టిందనే ఆవేదన శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. సీమ పాలిట సీపీఐ శిఖండి పాత్ర పోషిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.