ఎన్నిక చిన్నదే కానీ అయ్యన్నకు గట్టి షాక్

ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు గట్టి షాక్ తగిలింది. జరిగింది చిన్న ఎన్నిక కావచ్చు కానీ అయ్యన్న ప్రతిష్టకు సవాల్ గా మారింది.…

ఉమ్మడి విశాఖ జిల్లా నర్శీపట్నానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు గట్టి షాక్ తగిలింది. జరిగింది చిన్న ఎన్నిక కావచ్చు కానీ అయ్యన్న ప్రతిష్టకు సవాల్ గా మారింది. అటూ ఇటూ టీడీపీ వైసీపీ మోహరించిన ఈ ఎన్నికలో చివరికి వైసీపీ ఘనవిజయం సాధించి అయ్యన్నకు గట్టి షాక్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే నర్శీపట్నంలోని గొలుగొండ మండలంలోని  తాండవ స్వదేశీ మత్య్సకార సొసైటీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ గెలిచి టీడీపీకి దెబ్బ కొట్టింది. ఈ సొసైటీ గత పదేళ్ళుగా టీడీపీ ఆధీనంలోనే ఉంది. ప్రెసిడెంట్ గా ఆ పార్టీకి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆ సంప్రదాయానికి గండి కొట్టి టీడీపీకి చెక్ చెప్పాలని లోకల్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ డిసైడ్ అయ్యారు.

దాంతో ఆయన పట్టుదల పట్టి ఎక్కడెక్కడో ఉన్న సొసైటీ సభ్యులను ఓటింగ్ రోజున నర్శీపట్నం రప్పించి మరీ ఓటు చేయించుకున్నారు. దాంతో సోసైటీలో మొత్తం 192 మంది సభ్యులకు గానూ 180 మంది ఓటేస్తే అందులో 128 మంది వైసీపీకి మద్దతుగా నిలిచి భారీ ఆధిక్యతను కట్టబెట్టారు. కేవలం 44 మంది మాత్రమే టీడీపీకి మద్దతు ఇచ్చారు.

ఈ ఎన్నిక కోసం క్యాంప్ రాజకీయాలు కూడా జోరుగా సాగాయి. అచ్చం సాధారణ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా  సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి అయ్యన్నకు మరో పరాజయాన్ని రుచి చూపించింది అంటున్నారు. మూడున్నరేళ్ళుగా నర్శీపట్నంలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీనే గెలుస్తూ రావడం బట్టి చూస్తే ఒకనాటి టీడీపీ కంచుకోటకు 2024లో కూడా మరోమారు బీటలు పడతాయని వైసీపీ వారు గర్వంగా చెబుతున్నారు.