మంగళగిరి జనసేన వాటాలోకి

నారా లోకేష్ స్వయంగా పోటీ చేసి కోట్లకు కోట్ల రూపాయలు ముడుపులుగా, కానుకలుగా వెదజల్లినప్పటికీ గెలవడం చేతకాకపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి జనసేన వాటాలోకి పంచి ఇచ్చేసి, చేతులు దులుపుకోవాలని తెలుగుదేశం…

నారా లోకేష్ స్వయంగా పోటీ చేసి కోట్లకు కోట్ల రూపాయలు ముడుపులుగా, కానుకలుగా వెదజల్లినప్పటికీ గెలవడం చేతకాకపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి జనసేన వాటాలోకి పంచి ఇచ్చేసి, చేతులు దులుపుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. 

మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఘనమైన మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించాలని కొడుకుకు దిశా నిర్దేశం చేశారు. 

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువగా ఉన్నానని, తాను సొంతంగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నానని నారా లోకేష్ పార్టీ అధ్యక్షుడు అయిన తండ్రికి వివరణ చెప్పుకున్నారు. ‘ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాను’ అని హామీ కూడా ఇచ్చారు. కానీ ఇదంతా కూడా పార్టీ సమీక్ష సమావేశానికి సంబంధించి మీడియాకు అందించిన అధికారిక సమాచారం మాత్రమే. 

తెలుగుదేశం పార్టీ తండ్రీకొడుకులు ఇద్దరూ వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో పోటీ చేసే ఆలోచనను విరమించుకుని, జనసేన వాటాకు పంచి ఇస్తే సరిపోతుంది అని యోచిస్తున్నట్లుగా విశ్వనీయ సమాచారం. 

నారా లోకేష్ 2019 ఎన్నికల సమయంలోనే మంగళగిరి నియోజకవర్గంలో విపరీతంగా నిధులు ఖర్చు చేశారు. ఏసీలు, ఫ్రిజ్లు లాంటి ఖరీదైన గిఫ్ట్ లు కూడా ఓటర్లకు పంచి పెడుతూ ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్ని డ్రామాలు చేసినా విజయం మాత్రం ఆయన దరికి చేరలేదు. అనునిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజలతో మమేకమై పనిచేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి లోకేష్ ను చిత్తుగా ఓడించారు. 

ఈ పరాభవం మొత్తం తెలుగుదేశం పార్టీకి జీర్ణించుకోలేని అనుభవంగా మిగిలిపోయింది. అప్పటి నుంచి మళ్లీ పోటీ చేయాల్సి వస్తుందనే భయంతో నారా లోకేష్ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్న మాట నిజమే కానీ, ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే. అనుయాయులు, పార్టీ వందిమాగధులు, భజనపరులు మాత్రమే ఆయన పర్యటనల్లో వెంట కనిపిస్తుంటారు. 

పైకి డాంబికంగా ఎన్ని మాటలు పలికినప్పటికీ ఇలాంటి భజన పరులను నమ్ముకుని ఎన్నికల్లో గెలవ గలగడం అసాధ్యం అనే సంగతి నారా లోకేష్ కు కూడా చాలా స్పష్టంగా తెలుసు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి నిత్యం ప్రజలతోనే ఉంటూ తన మంచి పేరును మరింతగా పెంచుకుంటూ నే ఉన్నారు. 

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి నియోజకవర్గ సమీక్షలో బహిరంగంగా ఏ మాటలు మాట్లాడుకున్నప్పటికీ.. లోలోపల తండ్రి కొడుకుల ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి అని పార్టీ వర్గాల సమాచారం. జనసేనతో సీట్లు పంచుకునే క్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గాన్ని వారికి అప్పగించాలని కూడా యోచిస్తున్నారు.

నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడే మరో గణాంకాలను కూడా తండ్రి కొడుకులు బేరీజు వేశారు. 1983, 1985 లలో తప్ప ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు చరిత్రలో లేవు. 2019లోని సాధ్యం కానిది.. ఇప్పుడు గెలిచి చరిత్ర సృష్టించే అంత హీరోయిజం నారా లోకేష్ కు లేదు గాక లేదు. 40 ఏళ్ల కిందటి విజయాలని రిపీట్ చేయడానికి నందమూరి తారక రామారావు ఇప్పుడు లేరు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఈ వాస్తవాలను బోధపరుచుకుని మంగళగిరిలో వచ్చే ఎన్నికలకు పోటీ చేయకుండా ఉండడమే మేలని తండ్రీకొడుకులు భావిస్తున్నట్లు సమాచారం. 

ఆ సీటును జనసేనకు ఇచ్చేస్తే నారా లోకేష్ త్యాగమూర్తి కింద ముద్రపడతారు. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తూ ఉంటే ఒకవేళ పార్టీ అధికారంలోకి రాగలిగితే గనక అప్పుడు డైరెక్ట్ గా మంత్రి పదవిలోకి వచ్చేయొచ్చు అనేది వారి దూరాలోచన. ఈ తండ్రి కొడుకుల కుట్రపూరిత వ్యూహం ఎలా వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి.