భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు ప్రధాని అయిన విషయం మనకు ఆనందదయమైనదే. పుత్రోత్సాహము.. పద్యం లాగ ప్రధాని అయినప్పటి కంటె బ్రిటన్ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినపుడు మనం ఎక్కువ గర్వంగా ఫీలవ్వచ్చు. భారతీయ సంతతి వారు యితర దేశాల్లో ప్రధాని లేదా అధ్యక్ష పదవులు అలంకరించారు. కానీ అవి చిన్న దేశాలు. ఐర్లండ్ ప్రధానిగా కూడా భారతీయ మూలాలున్న లియో వరాడ్కర్ మూడేళ్లపాటు ఉన్నారు. ఇటీవల భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. అనేక దేశాల్లో మనవాళ్లు మంత్రులుగా కూడా ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తు. మనను 150 ఏళ్ల పాటు పాలించిన బ్రిటన్‌కు ప్రధాని కావడం మరొక ఎత్తు. ప్రపంచ అగ్రరాజ్యాల్లో బ్రిటన్ ఒకటి కాబట్టి, అనేక రంగాల్లో బ్రిటన్ పాత్ర గణనీయమైనది కాబట్టి, బ్రిటన్ ప్రధాని కావడమనేది హర్షించదగ్గ విషయం.
రిషి మనవాడు అని అనుకోవడం మంచిదే కానీ, మనవాడు మాత్రమే అనుకోవడానికి లేదు. అతని అమ్మమ్మ గారి కుటుంబం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతానికి చెందినది. అందువలన పాకిస్తానీలూ మనవాడే అనుకోవచ్చు. అమ్మ వైపు కుటుంబం అఖండ భారత్ నుంచి టాంజానియా ద్వారా బ్రిటన్‌కు చేరగా, నాన్న వైపు కుటుంబం పంజాబ్ నుంచి కీన్యా ద్వారా బ్రిటన్ చేరింది. అందువలన టాంజానియా, కీన్యాలు కూడా మనవాడే అనుకోవచ్చు. భారతీయ కన్నడ అమ్మాయిని పెళ్లాడాడు కాబట్టి కన్నడిగులు మా అల్లుడే అనుకోవచ్చు. రిషి మాతామహుడు రఘుబీర్ బెర్రే పంజాబ్‌కు చెందినవాడు. టాంజానియాలో రైల్వే యింజనియర్‌గా పని చేస్తూ అక్కడే నివాసముంటున్న పంజాబీ కుటుంబానికి చెందిన స్రక్ష అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె కోరికపై టాంజానియాలోనే స్థిరపడి ప్రభుత్వాధికారి అయ్యాడు. అక్కడే రిషి తల్లి ఉష, మరో యిద్దరు పిల్లలు కలిగారు.
బ్రిటన్ వెళితే బాగా ఎదగగలం అనే ఆలోచనతో 1966లో స్రక్ష ఇంగ్లండులో భారతీయులు ఎక్కువగా ఉండే లెస్టర్ చేరింది. ఒక కంపెనీలో ఎక్కౌంటెంటుగా పని చేస్తూ, డబ్బు దాచుకుని ఏడాది తర్వాత భర్తను, పిల్లల్ని తన దగ్గరకు రప్పించింది. అప్పటికి రిషి తల్లి ఉషకు 15 ఏళ్లు. ఆమె పై చదువులు చదివి ఆస్టన్ యూనివర్శిటీలో ఫార్మకాలజీ చేస్తూండగా యశ్వీర్ సునాక్ అనే పంజాబీ వైద్యవిద్యార్థి పరిచయమయ్యాడు. అతని కుటుంబం కీన్యాలోని నైరోబి నుంచి బ్రిటన్‌కు వలస వచ్చింది. 1977లో యిద్దరికీ పెళ్లయింది. సౌంతాప్టన్లో స్థిరపడ్డారు. 1980లో రిషి పుట్టాడు. ఆక్స్‌ఫర్డ్‌లో ఎకనామిక్స్, ఫిలాసఫీ, పాలిటిక్స్‌లో డిగ్రీ చదివి, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఎంబిఏ చదివాడు. అక్కడ ఉండగానే సాటి విద్యార్థి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతతో ప్రేమలో పడ్డాడు. 2009లో పెళ్లి చేసుకున్నాడు.
రిషి గోల్డ్‌మన్ శాక్స్‌లో పని చేసి, తర్వాత హెడ్జ్ ఫండ్ కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నాడు. అక్షతకు ఇన్ఫోసిస్‌లో వాటాలున్నాయి. భార్యాభర్తలిద్దరికీ కలిసి రూ. 7 వేల కోట్ల ఆస్తులున్నాయి. బ్రిటన్ ధనవంతుల్లో వారిది 222వ స్థానం. ఇంత డబ్బున్నవాడికి రాజకీయాల్లోకి రావాలని ఎందుకనిపించిందో తెలియదు. తన ఆలోచనలకు సన్నిహితంగా ఉన్న కన్సర్వేటివ్ (టోరీ) పార్టీలో చేరి 2015 ఎన్నికలలో నార్త్ యార్క్‌షైర్ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపీగా ఎన్నికయ్యాడు. 2016 నాటి రిఫరెండంలో బ్రెగ్జిట్‌ను ఉత్సాహంగా బలపరిచాడు. 2017 ఎన్నికలలో మళ్లీ గెలిచాడు. థెరిసా మే అతన్ని 2018లో ప్రభుత్వంలో పార్లమెంటరీ అండర్ సెక్రటరీగా తీసుకుంది. ఆమె రాజీనామా తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో గెలిచి యితను ప్రధానిగా బోరిస్ జాన్సన్‌ను సమర్థించాడు. అతను యితన్ని ఆర్థిక శాఖలో సహాయ మంత్రి (చీఫ్ సెక్రటరీ)గా తీసుకున్నాడు. ఆర్థికమంత్రి సాజిద్ జావిద్ 2020 ఫిబ్రవరిలో రాజీనామా చేశాక అతని స్థానంలో యితన్ని తీసుకున్నాడు. అప్పణ్నుంచి 2022 జులై వరకు ఆ పదవిలోనే పని చేశాడు.
అతను ఆర్థికమంత్రిగా ఉండగానే కోవిడ్ వచ్చింది. బ్రెగ్జిట్ తదనంతర సమస్యలు చుట్టుముట్టాయి. చివర్లో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన సమస్య వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో తగిన విధానాలు అమలు చేసి పరిస్థితిని నిభాయించుకుంటూ వచ్చినందుకే యిప్పుడీ పదవి దక్కింది. అది అండర్లైన్ చేయదగిన అంశం. సుస్థిర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ రిషి చేసినదాన్ని బ్రిటిషు వారు మెచ్చి, ప్రమోషన్ యిచ్చారు. మన దేశంలో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూనే, అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను చక్కదిద్దిన పివిని పదవీకాలం పూర్తి కాగానే యింటికి పంపించాం. మన కిక్కడ సామర్థ్యం కంటె మతం, కులం, కుటుంబ వారసత్వం, ప్రాంతం, పార్టీలో బలం వంటి యితర అంశాలు ముఖ్యం.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే రిషి తన మూలాలను దాచలేదు. తన మతవిశ్వాసాన్ని దాచలేదు. భగవద్గీత సాక్షిగానే పదవీ ప్రమాణస్వీకారం చేశాడు. పార్లమెంటు సమావేశానికి మంత్రించిన ఎఱ్ఱతాడు మణికట్టుకి కట్టుకుని వచ్చాడు. తన పేరును ఆంగ్లిసైజ్ చేయలేదు. తను ఆర్థికమంత్రిగా ఉండగా ‘ఇండియన్స్ యిక్కడకు వచ్చి చదువుకుని, అవకాశాల కోసం ప్రయత్నించడం కాదు. ఇండియాలో కూడా గొప్ప విద్యాసంస్థలున్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్న కార్పోరేట్స్ ఉన్నాయి. మనవాళ్లు అక్కడకు వెళ్లి చదువుకోవాలి, అక్కడి ఉద్యోగాలకు ప్రయత్నించాలి.’ అంటూ హితబోధ చేశాడు. ఇండియాను అండర్ డెవలప్డ్ కంట్రీగా చూపించే యత్నం చేయలేదు. కమలా హ్యేరిస్ తన భారతీయ పార్శ్వాన్ని ఎక్కువగా చెప్పుకోకుండా, హాఫ్ బ్లాక్గానే ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంది. రాజకీయాల కారణంగానే కావచ్చు. రిషి కూడా రాజకీయవాదే, కానీ తన భార్య నాన్-రెసిడెంట్ అని ప్రజలకు తెలిసినా భయపడలేదు. మా అత్తామామల కంపెనీ గొప్పది అంటూ ప్రజలకు తన యిండియన్ కనక్షన్ గుర్తు చేస్తూనే ఉన్నాడు.
ఇన్ని చేసినా ఆంగ్లేయులు అతన్ని ప్రధానిగా ఆమోదించారంటే విశేషమే. ఇక్కడో మాట చెప్పాలి. యావన్మంది ఆంగ్లేయులు అతనే కావాలని అనుకున్నారని చెప్పలేం. అధికారంలో ఉన్న అతని పార్టీ ఎంపీలలో అత్యధికులు అతన్ని కోరుకున్నారంతే. మూడు నెలల క్రితమే అతనికి ఆధిక్యత యిచ్చారు. కానీ ధనికుల పార్టీగా పేరు బడిన కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువమంది రిషికి వ్యతిరేకంగా ఉండడంతో లిజ్ ప్రధాని అయింది. రిషికి వ్యతిరేకం అంటే అతను బ్రౌన్ కాబట్టి అనే అనుకోనక్కరలేదు. ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తాను, పన్ను రాయితీలు యివ్వను అనే అతని విధానం నచ్చక కూడా ఓటేసి ఉండకపోవచ్చు. అటు చూస్తే లిజ్ అరచేతిలో స్వర్గం చూపించింది. ప్రజలకు ఏ కష్టమూ కలిగించకుండా, వ్యవస్థను బాగు చేసేస్తానని నమ్మబలికింది. పార్టీలో శ్వేతజాతీయ వృద్ధులు చాలామంది ఉండడంతో ఆమె వైపు మొగ్గు చూపారు.
ఇక్కడ రిషిలో మెచ్చుకోవలసిన అంశమేమిటంటే ప్రజామోదం పన్నుల తగ్గింపుకే వుంది కదాని తన విధానాన్ని మార్చుకోలేదు. అతనితో పాటు పదవికి పోటీ పడ్డవాళ్లందరిదీ ఒక దారిది, యితనొక్కడిదీ వేరే దారి. లిజ్ చెప్పేదంతా ‘ఫెయిరీటేల్ ఎకానమీ’, అలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పాడు. ఇలాటివాటిని పొలిటికల్లీ ఇన్కరక్ట్ స్టేటుమెంట్స్ అంటారు. ఓడిపోతే ఓడిపోయాను కానీ నెగ్గడానికి మెరమెచ్చు కబుర్లు చెప్పను అని రిషి నిలబడ్డాడు. మన దేశపు నాయకుల్లో యీ సిద్ధాంతబలిమి కొరవడింది. ఈ రోజుల్లో హిందూత్వకే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు అనగానే అప్పటిదాకా పట్టించుకోని వాళ్లంతా గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. సభల్లో మంత్రాలు పఠిస్తున్నారు. బాబాలకు సాష్టాంగ పడుతున్నారు. వీటికీ, రాజకీయాలకు సంబంధం లేదు అని ఒక్క ప్రకటన యివ్వటం లేదు. మతపరమైన పక్షపాతం కనబడినపుడు కూడా ఖండించడం మానేశారు.
అలాగే ఉచితాలు అభివృద్ధికి అవరోధాలు అని ప్రతిపక్షంలో ఉండగా అనడం, అదే సమయంలో మేం అధికారంలోకి వస్తే యీ ఉచితపథకాలు ఆపేస్తాం అని అనకపోవడం, అధికారంలోకి వచ్చాక మరిన్ని పెంచడం. ఏమిటిదంతా? అన్ని వర్గాలకూ రాయితీలిస్తామని చెప్పడం, డబ్బెక్కణ్నుంచి తెస్తావని అడిగితే అభివృద్ధి ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించి, డబ్బు సమకూరుస్తామని నమ్మబలకడం, తీరా అధికారమిస్తే అప్పులు తేవడం, కేంద్రాన్ని నిందించడం, కేంద్రమేమో ప్రభుత్వాస్తులను అమ్మేయడం.. యిదీ జరుగుతోంది యిక్కడ. ఒక్కడైనా నేను ఫలానా వర్గానికి పన్ను రాయితీలివ్వను, ఫలానా వర్గాన్ని కాపాడతాను అని స్పష్టంగా చెప్పడు. బిసిలకు నష్టం కలగకుండా ఫలానా అగ్రకులాన్ని బిసిల్లో చేరుస్తాం, ఎస్సీలకు నష్టం కలగకుండా ఫలానా బిసి కులాన్ని ఎస్సీల్లో చేరుస్తాం అంటూ హామీలిస్తారు. చివరకు కోర్టులు అనుమతించలేదు అంటూ తప్పు కోర్టుల మీదకు నెట్టేస్తారు.
రిషి విధానాలను మనం ఆమోదించవచ్చు, నిరాకరించవచ్చు కానీ అతని కన్విక్షన్‌ను, దానికై అతను నిలబడిన తీరును మనం మెచ్చుకోక తప్పదు. లిజ్ తనిచ్చిన హామీలను మూర్ఖంగా అమలు చేయబోయి బొక్కబోర్లా పడుతుందని, నెలన్నరలోనే రాజీనామా చేస్తుందని రిషితో సహా ఎవరూ ఊహించలేదు కదా. తనకు యిప్పట్లో ప్రధాని ఛాన్సు రాదని తెలిసినా రిషి తన స్టాండ్‌పై నిలబడ్డాడు. బోరిస్ జాన్సన్ అరాచకాన్ని సహించలేక యితను ఆర్థికమంత్రిగా రాజీనామా చేయడంతోనే బోరిస్‌కు గట్టి కుదుపు కలిగి, గద్దె దిగాల్సి వచ్చింది. వేరే ఎవరైనా ఫర్వాలేదు, రిషి మాత్రం కాకూడదని అతను పంతం పట్టి, పార్టీ ఎన్నికలలో రిషిని ఓడించాడు. అలా చేస్తాడని తెలిసినా, రిషి తన విధానాన్ని డైల్యూట్ చేయలేదు. బోరిస్ ఇప్పుడు కూడా పోటీ చేయాలని ఉబలాటపడ్డాడు కానీ మద్దతిచ్చే ఎంపీలు వందకు దాటకపోవడంతో వెనక్కి తగ్గాడు.
ఈ నాటకీయ పరిణామం ఎలా సంభవించింది? తక్కిన దేశాల్లో విపరీత జాతీయతావాదం, మతవాదం, హరితవాదం, సెంటిమెంటు యిలాటి వాటితో పదవులు దక్కుతూంటే బ్రిటిషు వాళ్లు మాత్రం యిప్పుడు ఆర్థిక కారణాల చేత రిషి పట్ల మొగ్గు చూపారు. ఈ తెలివితేటలు బ్రెగ్జిట్ సమయంలో లేక బయటివాళ్లు వచ్చి అవకాశాలు తన్నుకుపోతున్నారు, మన దేశంలో మనమే ఆధిక్యంలో ఉండాలి, తక్కిన యూరోపియన్లు కూడా ఉండకూడదు అనుకుంటూ యూరోపియన్ యూనియన్‌లోంచి బయటకు వచ్చేశారు. ఏడేళ్ల తర్వాత కట్ చేసి చూస్తే, ప్రధానిగా ఒక ఆసియన్ను ఎన్నుకున్నారు! జాతీయవాదం ముదిరితే ఏమౌతుందో యిది చక్కగా నిరూపించింది. బ్రెగ్జిట్ ఒక ఎమోషనల్ నిర్ణయం. అది సృష్టించిన గందరగోళంలోంచి బ్రిటన్ యింకా బయటపడలేదు. ఇప్పట్లో పడకపోవచ్చేమో కూడా. ఇయులోంచి బయటకు వచ్చేశాక ప్రపంచదేశాలన్నిటితో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. అది నత్తనడక నడుస్తోంది. ఇయుకు సంబంధించిన అనేక అంశాలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. బ్రెగ్జిట్ తర్వాత అడ్డూ, అదుపూ లేకుండా ఎదిగిపోతాం అనుకుంటే అవకాశాలే రాకుండా పోయాయి. దేశం ఆర్థికంగా దెబ్బ తింటూ వచ్చింది. బ్రెగ్జిట్ తర్వాత కొన్ని యూరోపియన్ దేశాలు మేమూ బయటకు పోతాం అంటూ గంతులేశాయి. బ్రిటన్ పరిస్థితి చూసి అవి కిమ్మనటం లేదు.
ఆ తర్వాత కోవిడ్ వచ్చి యూరోప్‌ను దారుణంగా దెబ్బ కొట్టింది. బ్రిటన్ బాగా నష్టపోయింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పి ధరలు విపరీతంగా పెరిగాయి. అది చాలనట్లు అమెరికా ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిపెట్టింది. బ్రిటన్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అమెరికా చెప్పినట్లు ఆడడం చాలా దశాబ్దాలుగా సాగుతోంది. రష్యా నుంచి యింధన సరఫరా ఆగిపోవడంతో బ్రిటన్‌లో ఎనర్జీ బిల్లులు ఐదారింతలు పెరిగి పోయాయి. సరుకుల రవాణాకు పెట్రోలు, గ్యాస్ కావాలి కాబట్టి వాటి కొరతతో అన్ని వస్తువుల ధరలూ పెరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి యిప్పట్లో తెరపడే సూచనలు కనబడటం లేదు. అక్టోబరు నుంచి బ్రిటన్‌లో శీతాకాలం మొదలైంది. చలి కాచుకోవాలంటే యింధనం మరింత అవసరం. లిజ్ విధానాలతో కరెంటు బిల్లులు ఏ మేరకు పెరుగుతాయో ఊహించుకుని ఇంగ్లీషువాళ్లు డిసెంబరు రాకుండానే గజగజ వణికారు. ఏ రంగు తోలైతే ఏమిటి, ఎవడో ఒకడు వచ్చి ఆ ఉపద్రవం నుంచి కాపాడుతాడేమో ననుకుని రిషిని ప్రధానిని కానిచ్చారు.
రేపు యితను ఫెయిలయితే, పరాయివాణ్ని తెచ్చి పెట్టుకుంటే యిదే గతి అని అనుకోవచ్చు. లేబరు పార్టీ వాళ్లే కాదు, టోరీలు కూడా అదే పాట పాడవచ్చు. టోరీలు 2010 నుంచి పాలిస్తున్నారు. తర్వాతి ఎన్నికలు 2024లో అనుకుంటే 14 ఏళ్ల పాలన అన్నమాట. 1997 నుంచి 2010 దాకా 13 ఏళ్లపాటు ఏలిన లేబరు పార్టీని దించి ప్రజలు వీళ్లను ఎక్కించారు. 14 ఏళ్లయింది కాబట్టి వీళ్లను సాగనంపడానికే ఛాన్సు ఎక్కువుంది. దానికి తోడు యింత అధ్వాన్నంగా పాలించి, 2019 నుంచి మూడేళ్లలో ముగ్గురు ప్రధానులు మారవలసిన అవసరం తెచ్చుకున్నారంటే ప్రజలు క్షమిస్తారా? 2024లో టోరీల అపజయం నిశ్చయం అనుకుంటే ఆ నింద రిషి మీద పడడం ఖాయం. అందువలన రిషి నెత్తి మీద ఉన్నది ముళ్లకిరీటమే!
ఇంకో విషయం కూడా మనం ఒప్పుకోవాలి. ఇంతటి విషమ పరిస్థితి రాకపోతే రిషిని వాళ్లు ప్రధాని కానిచ్చేవారే కాదు. ఈ అవస్థ తెచ్చిన ఘనత లిజ్ ట్రస్ది! ఆమె తండ్రివి వామపక్షభావాలు. ఈవిడవి పూర్తి కాపిటలిస్టు విధానాలు. ధనికులకు సకల సౌకర్యాలు అమర్చి, ఆర్థిక నియంత్రణ మార్కెట్‌కు వదిలేస్తే చాలు, అన్నీ అవే సర్దుకుంటాయి అని నమ్మే రకం. ధనిక వర్గాలకు పన్ను రాయితీలిస్తానంటూ వాగ్దానం చేసి, టోరీ పార్టీ ఎన్నికలలో 57% ఓట్లు తెచ్చుకుని, సెప్టెంబరు 6న ప్రభుత్వంలోకి రాగానే నిజాయితీగా అమలు చేసింది కూడా. అలా చేసే ముందు పార్టీలో, ప్రభుత్వంలో ఎవరితోనూ మంతనాలు జరపలేదు. తన ఆలోచనలతో విభేదించేవారితో చర్చలు జరపలేదు. తనలాటి భావాలే ఉన్న తన ఆర్థికమంత్రి క్వాసీ కార్టెంగ్తో కలిసి మంతనాలు జరిపి, నిర్ణయాలు తీసేసుకుంది. ట్రెజరీని, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను, బజెటరీ రెస్పాన్సిబిలిటీ ఆఫీసును కానీ సంప్రదించలేదు. తీవ్ర ప్రభావం కలిగించే యిలాటి ఆలోచనలను అమలు చేసేటప్పుడు ట్రేడ్ యూనియన్ల సంగతి వదిలేయండి, వ్యాపార సంఘాలను కూడా అడగలేదు.
కార్పోరేషన్ టాక్స్‌ను 25% నుంచి 19% కు తగ్గించింది. ఇన్కమ్ టాక్స్ రేట్లలో హైయ్యస్ట్ స్లాబ్ రేటైన 45% తీసేసింది. ఏడాదికి లక్షన్నర పౌండ్ల ఆదాయం వచ్చేవారిపై విధించే యీ స్లాబ్ తీసేయడం వలన ఖజానాకు 2 బిలియన్ పౌండ్ల మేరకు నష్టం వాటిల్లుతుంది. మొత్తం మీద ఆమె ప్రభుత్వం 45 బిలియన్ పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించింది. ఎనర్జీ బిల్లుల భారం ఎక్కువై పోతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు కాబట్టి 2022 ఏప్రిల్ నాటి స్థాయి దగ్గర ఫ్రీజ్ చేస్తానని, తక్కినది సబ్సిడీ యిస్తానని లిజ్ హామీ యిచ్చింది. ఈ సబ్సిడీ కూడా పేదలకు, ధనికులకు సమానంగా యిస్తాననడం అందర్నీ విస్మయపరిచింది. దీనివలన ధనికులకు 4700 పౌండ్ల వెసులుబాటు కలిగితే, పేదలకు 2200 పౌండ్ల వెసులుబాటు మాత్రమే కలుగుతుంది. ఈ స్కీము వలన 65 లక్షల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేకుండా పోతుందని నిపుణులు చెప్పారు.
పన్నులు తగ్గిస్తే సంబంధిత వర్గాలు సంతోషిస్తాయి సరే, కానీ బజెట్‌లో ఆ లోటును ఎలా పూడ్చుకుంటారో చెప్పాలి కదా! ప్రధాని, ఆర్థికమంత్రి కలిసి సెప్టెంబరు 23 న ‘గ్రోత్ ప్లాన్’ పేరుతో వెలువరించిన మినీ బజెట్‌లో అప్పు తెస్తాం అని ప్రకటించారు. ఇది ఆర్థిక బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. దాంతో వాణిజ్యవర్గాలకే కాదు, ప్రభుత్వ సంస్థలకు కూడా ప్రభుత్వ సామర్థ్యంపై నమ్మకం పోయింది. ఇన్వెస్టర్లకు ప్రభుత్వంపై విశ్వాసం నశించడంతో ప్రభుత్వ బాండ్ల విలువతో పాటు పౌండు విలువ పడిపోసాగింది. వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రంగంలోకి దిగి మార్కెట్లను నిలబెట్టడానికై 65 బిలియన్ పౌండ్ల మదుపు కార్యక్రమాన్ని ప్రకటించి ప్రభుత్వ బాండ్లను కొంటానంది.
ధరలు పెరిగాయి. దాన్ని అదుపు చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లు పెంచింది. దాంతో గృహఋణాలు తీసుకున్న లక్షలాదిమందిపై వడ్డీభారం పెరిగి, వాళ్లు గగ్గోలు పెట్టారు. జనవరి 2020తో పోలిస్తే ఇన్ఫ్లేషన్ 10.1% కు పెరిగింది. విద్యుత్, గ్యాస్, యితర యింధనాల రేట్లు 70% పెరిగాయి. 40 ఏళ్లలో యిది అత్యధికం. ఇదంతా చూసిన లిజ్ తప్పంతా ఆర్థికమంత్రిదే అని నింద మోపి అక్టోబరు 14న అతన్ని తీసేసి జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థికమంత్రిగా తెచ్చింది. (ఇప్పుడు రిషి అతన్నే కొనసాగిస్తున్నాడు). కార్పోరేషన్ టాక్స్‌ను మళ్లీ 25% కు తెచ్చేసింది. అత్యధిక ఆదాయపు పన్ను రేటైన 45%ను పునరుద్ధరించింది. పార్లమెంటులో ప్రతిపక్షాలు గోల చేస్తే ‘ఐ యామ్ ఏ ఫైటర్, నాట్ ఎ క్విటర్’ అని గర్జించింది.
అయినా ప్రజలకు నమ్మకం చిక్కలేదు. దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారినప్పుడు ఆదుకోవలసినది మధ్య, కింది వర్గాలను! సమాజంలో వాళ్లే ఎక్కువమంది ఉంటారు కాబట్టి, వాళ్లను ఉద్ధరిస్తే వాళ్ల దగ్గర కాస్త డబ్బాడితే, మార్కెట్లో కదలిక బాగా వస్తుంది. కానీ లిజ్ ధనిక వర్గాలను మరింత ధనికులుగా చేసి సంతృప్తి పరచాలని చూసింది. అందుకే ఆమెను దింపేశారు. కరోనా సమయంలో వ్యాపార వర్గాలతో పాటు, పేద, మధ్యతరగతి వాళ్లకు ఊరట కల్పించిన రిషిని గుర్తు పెట్టుకున్న టోరీ ఎంపీలు అతన్ని ప్రధానిని చేశారు. ఎందుకంటే టోరీ ఎంపీల్లో చాలామంది 2019 ఎన్నికలలో తమ నియోజకవర్గాల్లో లేబరు పార్టీపై తక్కువ మార్జిన్లతో గెలిచారు. వాటిలో పేద వర్గాల ఓటర్లు ఎక్కువమంది. ఈ విధానాలతో పేదలు ఆగ్రహించారంటే లేబరు పార్టీ ఆ సీట్లను తన్నుకుపోతుంది.
బోరిస్ వర్గాలకు, రిషివర్గాలకు మధ్య రాజీ అభ్యర్థిగా పెన్నీ మోర్డాంట్ రిషితో పోటీ పడబోయింది కానీ ఆమెకు ఆర్థిక వ్యవహారాల్లో అనుభవం తక్కువ కావడంతో ఆమెను సమర్థించిన ఎంపీలు పెద్దగా లేరు. అందుకని ఆమె పోటీలోంచి తప్పుకుంది. ఇప్పుడు రిషి ప్రధాని అయ్యాడు. అద్భుతాలు చేస్తానని చెప్పటం లేదు కానీ సుస్థిరత తేవడానికి ప్రయత్నిస్తానంటున్నాడు. ఎలా చేస్తాడో వేచి చూడాలి. ఈ లోగా లిజ్ నుంచి మన దేశం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయి. మన దగ్గర కూడా కార్పోరేట్లకు విపరీతంగా పన్ను రాయితీలు యిస్తున్నారు. వాళ్ల ఋణాలను మాఫీ చేస్తున్నారు. ఎందుకలా అంటే ఉద్యోగాలు కల్పిస్తారని అంటున్నారు. అంతకంటె ఆ డబ్బుతో పేద, దిగువ మధ్యతరగతి వాళ్లకు ప్రోత్సాహాలిచ్చి నిలబెడితే వాళ్లే తమ తమ ఉపాధి మార్గాలు వెతుక్కుంటారు.
మధ్యతరగతి వాళ్ల పరిస్థితి దుర్భరంగా తయారైంది. ధనికుల ఋణాలు మాఫీ అవుతాయి, పేదలకు పథకాల పేరుతో డబ్బులు కురిపిస్తారు. కానీ మధ్యతరగతి వాళ్లకు యిచ్చిన అప్పులపై వడ్డీ రేట్లు పెంచుతూనే పోతారు. వారికి ఏ పథకాలూ లేవు. ధరలు చూస్తే నానాటికీ పెరిగిపోతున్నాయి. గతంలో కంటె జనాభాలో మధ్యతరగతి శాతం పెరిగింది. వాళ్లు బిడియం విడిచి కార్యాచరణలోకి దిగిన రోజున పాలకులకు భయం వేస్తుంది. లిజ్ ఎవర్నీ సంప్రదించనట్లే, మోదీ కూడా నోట్ల రద్దు విషయంలో రిజర్వ్ బ్యాంక్‌తో సహా ఎవర్నీ అడగలేదు. పథకం విఫలమైంది. దేశ ఆర్థికవ్యవస్థకు పెద్ద కుదుపు వచ్చింది. ప్రభుత్వం ఆర్థిక సలహాదారులుగా తెచ్చినవారందరూ అసంతృప్తితో తప్పుకుంటున్నారు. తమ కంటె భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్నవాళ్లతో చర్చించడం ఎప్పటికైనా మంచిది.
పన్ను రాయితీల వలన కలిగే లోటును ఎలా పూరిస్తావంటే లిజ్ అప్పులు తెచ్చి.. అని చెప్పింది. అదే మన ప్రభుత్వమైతే ప్రభుత్వ ఆస్తులమ్మి.. అని సమాధానమిచ్చి ఉండేది. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలిచ్చిన పన్నులతో కూడబెట్టిన ఆస్తులను అమ్మవలసిన దుస్థితి ఏమొచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. ఆ డబ్బుతో విలాసవంతమైన రైళ్లు వేస్తాం, విగ్రహాలు నెలకొల్పుతాం, గుళ్లు కడతాం అంటే.. రేపు ఏ యుద్ధమో వచ్చి, నిజంగా పెద్ద క్రైసిస్ ఎదురైతే అమ్మడానికి ఏం మిగులుతుంది? చిత్రమేమిటంటే, ఓ పక్క అమ్ముతూనే మరో పక్క భారీగా అప్పులు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వాలు అదే ఎత్తి చూపాయి.
చివరగా, రిషిని బ్రిటన్ ప్రధానిగా ఆమోదించింది కానీ సోనియాను భారతదేశం ఆమోదించ లేకపోయిందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. వాళ్లిద్దరి మధ్య పోలిక లేదు. రిషి బ్రిటన్‌లోనే పుట్టాడు, పెరిగాడు, అక్కడి పౌరుడు, అక్కడే చదువుకున్నాడు, ఉద్యోగవ్యాపారాలు చేశాడు, మంత్రిగా చేశాడు. సోనియా పెళ్లి తర్వాతనే ఇండియాలో అడుగుపెట్టింది. ప్రధాని కోడలిగా వచ్చినా చాలాకాలం దేశపౌరసత్వం తీసుకోలేదు. సోనియాను పోల్చాలంటే అక్షతా మూర్తితో పోల్చాలి. ఆమెను బ్రిటిషు వాళ్లు ప్రధానిగా ఆమోదించినపుడు యీ పోలిక తేవాలి. రిషి తనపై ఆంగ్లేయులు ఉంచిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి, బ్రిటన్‌తో పాటు తనకు సంబంధించిన ఇండియా, పాకిస్తాన్, కీన్యా, టాంజానియాలు కూడా గర్వపడేలా విజయవంతం కావాలని ఆశిద్దాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)