ర‌స‌వ‌త్త‌రంగా ఓవ‌ల్ టెస్ట్

ఓవ‌ల్ టెస్ట్ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకుంది. తొలి రోజే 13 వికెట్ల ప‌త‌నంతో రెండు రోజుల్లో అయిపోతుందేమో అనిపించిన మ్యాచ్ ఆ త‌ర్వాత సెష‌న్ కో మ‌లుపు తిరుగుతూ సాగుతూ ఉంది. మూడో రోజుల…

ఓవ‌ల్ టెస్ట్ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకుంది. తొలి రోజే 13 వికెట్ల ప‌త‌నంతో రెండు రోజుల్లో అయిపోతుందేమో అనిపించిన మ్యాచ్ ఆ త‌ర్వాత సెష‌న్ కో మ‌లుపు తిరుగుతూ సాగుతూ ఉంది. మూడో రోజుల ఆట పూర్త‌య్యింది, మ‌రో రెండు రోజుల ఆట మిగిలిన నేప‌థ్యంలో ఈ మ్యాచ్ ఎలా ముగుస్తుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డ‌ర్ రాణించ‌డం అస‌లైన విశేషంగా నిలిచింది. రోహిత్ శ‌ర్మ త‌న కెరీర్ లో తొలి సారి టెస్టుల్లో ఓవ‌ర్సీస్ సెంచ‌రీని చేశాడు. త‌న శైలికి భిన్నంగా చాలా ఓపిక‌గా ఆడుతూ శ‌ర్మ కెరీర్ లో ఎనిమిదో సెంచ‌రీని, విదేశీ గ‌డ్డ మీద తొలి టెస్టు సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత కూడా బాగానే ఆడినా, కొత్త బంతి రావ‌డంతోనే క‌థ‌లో కొంత మార్పు వ‌చ్చింది. 

ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 80 ఓవ‌ర్ల ఆట పూర్తైన త‌ర్వాత ఇంగ్లండ్ కొత్త బంతి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌డంతోనే రెండు వికెట్లు ప‌డ్డాయి. కొత్త బంతితో ప‌డిన తొలి బంతికే రోహిత్ అనూహ్యంగా ఔట్ అయ్యాడు. ఇక అదే ఓవ‌ర్లో పుజారా కూడా పెవిలియ‌న్ కు చేర‌డంతో ఒక్క‌సారిగా ఇంగ్లండ్ శిబిరంలో ఉత్తేజం వ‌చ్చింది. అయితే విరాట్, జ‌డేజాలు జాగ్ర‌త్త‌గా ఆడారు. అంత‌లోనే వెలుతురు లేమితో ఇంకా 14 ఓవ‌ర్ల ఆట మిగిలి ఉండ‌గానే మూడో రోజు ఆట ముగిసింది. 

ప్ర‌స్తుతానికి భార‌త జ‌ట్టు 171 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యాన్ని వీలైనంత ఎక్కువ స్థాయికి తీసుకెళ్ల‌డం మీదే ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. మూడో రోజు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించింది, అయితే కొత్త బంతితో భార‌త బ్యాట్స్ మెన్ ఇబ్బంది ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో సుర‌క్షిత‌మైన ఆధిక్యం ఎంత‌? అని చెప్ప‌డం క‌ష్ట‌త‌ర‌మైన అంశంగా మారింది. భార‌త జ‌ట్టు ప‌టిష్ట‌మైన ప‌రిస్థితుల్లో అయితే ఉంది. కానీ, నాలుగో రోజు వీలైనంత సేపు ఇండియా బ్యాటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది.

ఐదో రోజుకు పిచ్ పూర్తిగా బౌలింగ్ కు అనుకూలంగా మార‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  ఐదో రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయాల్సిన ప‌రిస్థితిని టీమిండియా క‌ల్పిస్తే.. మ్యాచ్ ను పూర్తి ఆధీనంలో ఉంచుకున్న‌ట్టే అని వారు అంటున్నారు. క‌నీస లీడ్ అయితే అయితే మూడొంద‌ల ప‌రుగుల‌కు మించిన స్థాయిలో పెట్టుకోవాలి టీమిండియా. అప్పుడే ఇంగ్లండ్ ను ఎంతో కొంత ఒత్తిడికి గురి చేసే అవ‌కాశం ఉంటుంది.

అదే స‌మ‌యంలో బౌల‌ర్లు స‌త్తా చూపిస్తే విజ‌యం సునాయాసంగా టీమిండియా వ‌శం అవుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 191 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన స్థితి నుంచి అయితే టీమిండియా చాలా మెరుగైన ప‌రిస్థితుల్లోకి వ‌చ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవ‌డం గురించి అప్పుడే రూట్ నిర్ణ‌యం గురించి చ‌ర్చ మొద‌లైంది. రూట్ పొర‌పాటు చేశాడంటూ అప్పుడే విశ్లేష‌ణ‌లు సాగుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.