ఏపీ స్కూళ్లలో కరోనా భయం.. సర్కారు కిం కర్తవ్యం..?

ఆగస్ట్ 16 నుంచి ఏపీలోని స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా.. అక్కడక్కడా ఒకటీ రెండు కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రెండు వారాలు దాటిన తర్వాత ఇప్పుడు కేసుల సంఖ్య…

ఆగస్ట్ 16 నుంచి ఏపీలోని స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాగా.. అక్కడక్కడా ఒకటీ రెండు కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రెండు వారాలు దాటిన తర్వాత ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 

నెల్లూరు జిల్లాలో ఏకంగా 26మందికి కరోనా సోకగా.. గుంటూరు జిల్లాలో మొత్తం 10 మందికి కరోనా నిర్థారణ అయింది. విద్యార్థులతోపాటు, టీచర్లు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం స్కూల్స్ నడపడంపై పునరాలోచించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ హైకోర్టు విద్యాసంస్థలకు రావడం స్టూడెంట్స్, పేరెంట్స్ ఇష్టానికే వదిలేయాలని తీర్పు చెప్పడంతో ఆ రాష్ట్రంలో విద్యార్థుల హాజరు పలుచగానే ఉంది. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా పూర్తి స్థాయిలో తరగతులు మొదలుకాలేదు. ఇక ఏపీ విషయానికొస్తే అలాంటి ఆంక్షలేవీ లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్ కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళనకు దారి తీస్తోంది.

నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గురుకుల పాఠశాలలో మొత్తం 19మంది విద్యార్థులకు ఒక టీచర్ కు కరోనా సోకింది. పిల్లల్ని గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్షణాలున్నా కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం లేకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఇదే జిల్లాలో మనుబోలు మండలంలోని ఎలిమెంటరీ స్కూల్, హైస్కూల్ లో నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు శానిటైజేషన్ చేయిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో కూడా భయం భయం..

అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10మందికి కరోనా సోకింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఓ ఉపాధ్యాయినికి కరోనా సోకింది. బాలయోగి గురుకుల పాఠశాలలోని ఐదుగురు విద్యార్థినులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. గురుకులాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం కష్టసాధ్యంగా మారడంతో విద్యార్థులకు ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ముందు జాగ్రత్తగా ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసింది. స్కూల్స్ లో కూడా గురు పూజోత్సవాలు జరపొద్దని ఆదేశాలిచ్చింది. అదే సమయంలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై కూడా ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.