ఉరుములు-మెరుపులు- పిడుగులతో బిహార్ ఉలికి పడింది. గత రెండు రోజులుగా ఈ తరహా వాతావరణం నెలకొని ఉందని, రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాట్లతో ఏకంగా 83 మంది మరణించినట్టుగా బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. రుతుపవన ఆరంభ కాలాల్లో ఉరుములూ, మెరుపులతో కూడిన వర్షం, పిడుపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ స్థాయిలో ఒక్క రాష్ట్ర పరిధిలో ఏకంగా 83 మంది మరణించడం మాత్రం విస్మయానికి గురిచేసే అంశం అవుతోంది.
రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పిడుగుపాట్లు సంభవించాయని బిహార్ విపత్తు నిర్వహణ మంత్రి ప్రకటించారు. చాలా జిల్లాల్లో ఈ దుర్ఘటనలు జరిగాయని, గోపాల్ గంజ్ అనే ఒకే జిల్లాలో 13 మంది పిడుగుపాటుకు గురై మరణించారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రకృతి విపత్తుకు బలైన వారి కుటుంబ సభ్యులకు బిహార్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కోరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టుగా బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వరస సంఘటనల పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.