ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ నేతృత్వంలో తెరకెక్కిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు ఆరోపణ చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ మొత్తంతో బీజేపీ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిందనే అధికార పార్టీ ఆరోపణలపై ఆయన సీరియస్‌గా స్పందించారు.
సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి వుంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని లక్ష్మణ్ విమర్శించారు. ఓటమి నైరాశ్యంలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రగతిభవన్‌లో కుట్రలు పన్నుతూ టీఆర్ఎస్ నేతలు అభాసుపాలవుతున్నారని ధ్వజమెత్తారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉప ఎన్నికలో 86 మంది ఎమ్మెల్యేలను మోహరించారని, కానీ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఫాంహౌస్‌కు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
ఈ ఫాం హౌస్ ఎవరిది? దాంతో సంబంధాలున్న వ్యక్తులెవరు? ఎమ్మెల్యేల కొనుగోలు కథ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్‌తో పాటు నటులు కూడా మీరే అని టీఆర్ఎస్ నేతలను వెటకరించారు. హీరో, విలన్లు, హాస్యనటుల పాత్రలను పోషించి రక్తి కట్టించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు సినిమా అట్టర్ ప్లాప్ అయిందని ఆయన అన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలు పెట్టించారని, ఈ రోజు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదని ఆయన నిలదీశారు.
ఎమ్మెల్యేలు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పొంతన లేని మాటలు చెబుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీని అభాసుపాలు చేసే ప్రయత్నాలను తమ పార్టీ తిప్పి కొట్టిందన్నారు. వందల కోట్లతో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టామని చెబుతున్నారని, నిన్ననే ఆ డబ్బును ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ చేస్తున్న కుట్రలో పోలీసులు భాగస్వామ్యం కావడం బాధాకరమన్నారు. దీని వల్ల పోలీస్ వ్యవస్థపైన ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము అవుతోందన్నారు.
మునుగోడు ప్రజలను స్వేచ్ఛగా వదిలేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ నాలుగు రోజుల్లో ఎన్ని డ్రామాలు సృష్టిస్తారో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. ఓటమితో భయంతో చేసే ఇలాంటి కుట్రలను తెలంగాణ సమాజం ఏ మాత్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులొస్తున్నాయన్నారు.