ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పేరు ఖరారైనట్టు తెలిసింది. ప్రస్తుత చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. మళ్లీ ఆయనకు పదవీ కాలం పొడిగించే అవకాశం లేదని సమాచారం. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా గ్రూప్‌లో కొమ్మినేని జర్నలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సాక్షి చానల్‌లో కేఎస్ఆర్ పేరుతో డిబేట్లు నిర్వహిస్తుంటారు.
కృష్ణా జిల్లా గన్నవరం కొమ్మినేని స్వస్థలం. 1978లో ఆయన జర్నలిజంలో ప్రవేశించారు. ఈనాడు పత్రికలో కొమ్మినేని 24 ఏళ్ల పాటు జర్నలిస్టుగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పునఃప్రారం భమైన సమయంలో కొమ్మినేని అందులో చేరారు. నాలుగేళ్ల పాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యూరో చీఫ్‌గా పని చేశారు. 2003లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లే వార్తను ముందే పసిగట్టి రాసిన క్రెడిట్ కొమ్మినేనికే దక్కుతుంది.
2007 నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన నూతన ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ రాజకీయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉమ్మడి ఏపీ రాజకీయాలపై వివిధ కోణాల్లో ఆయన పలు పుస్తకాలు రాశారు. జర్నలిస్టులకు అవి రెఫరెన్స్‌గా ఉన్నాయి. “గ్రేట్ ఆంధ్ర” వారపత్రికకు గెస్ట్ జర్నలిస్ట్‌గా విలువైన వార్తా కథనాలు కొమ్మినేని అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా ఒక ప్రముఖ చానల్‌లో పని చేస్తున్న సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యక్తిగతంగా కొమ్మినేనిపై పగ పెంచుకున్నారు. అదే ఆ చానల్ నుంచి కొమ్మినేని బయటకు రావడానికి కారణమైంది. ఆ తర్వాత ఆయన్ను నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదరించారు. అప్పటి నుంచి సాక్షి చానల్‌లో క్రమం తప్పకుండా డిబేట్లు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఏడాది కాలానికి కొమ్మినేనికి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి తిరిగి సాక్షికి సేవలు అందించాలని జగన్ కోరినట్టు తెలిసింది.