కొనుగోలు డీల్ – నాడు రేవంత్‌…నేడు?

ఓటుకు నోటు కేసులో డ‌బ్బు క‌ట్ట‌ల‌తో దొరికిపోయిన రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ మ‌రొక‌టి తెలంగాణ‌లో పున‌రావృత‌మైంది. తెలంగాణ‌లో నాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేసేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5…

ఓటుకు నోటు కేసులో డ‌బ్బు క‌ట్ట‌ల‌తో దొరికిపోయిన రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ మ‌రొక‌టి తెలంగాణ‌లో పున‌రావృత‌మైంది. తెలంగాణ‌లో నాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేసేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఆఫర్‌ ఇచ్చి.. రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చే క్ర‌మంలో అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్యే, నేటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ అదే అధికార పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి రూ.100 కోట్ల ఎర వేసి, ప్ర‌లోభ పెట్టి పార్టీ మార్చే క్ర‌మంలో ముగ్గురు వ్య‌క్తులు ప‌ట్టుబ‌డ్డారు. అయితే రూ.400 కోట్ల డీల్‌ను ఏ పార్టీ పెద్ద‌లతో కుదుర్చుకోవ‌డానికి భేర‌సారాలు ఆడారో పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించ‌లేదు. ఇదంతా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప‌నే అని టీఆర్ఎస్ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

మ‌రోవైపు ఈ ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర‌మంత్రి, తెలంగాణ బీజేపీ నాయ‌కుడు కిష‌న్‌రెడ్డి ఖండించారు. మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో అక్క‌డ ఒక్క ఓటు కూడా ప్ర‌భావితం చేసే శ‌క్తి లేని ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని కిష‌న్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఇదంతా కేసీఆర్ స్క్రిప్ట్‌గా ఆయ‌న పేర్కొన్నారు.

హైద‌రాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌న‌గ‌ర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు తంతు సాగింది.  టీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట‌, పినపాక‌, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, రేగా కాంతారావు, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డ‌బ్బు, కాంట్రాక్టులు, ప‌ద‌వులు ఇస్తామంటూ కొంద‌రు ప్ర‌లోభ పెట్టార‌ని పోలీసులు చెప్పారు. ఈ వ్య‌వ‌హారంలో రామ‌చంద్ర‌భార‌తి, సింహ‌యాజి, నందకుమార్‌ల‌ను అరెస్ట్ చేశారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం గురించి ఎమ్మెల్యేలే త‌మ‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్టు సైబ‌రాబాద్ పోలీసులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.100 కోట్లు డీల్ కుదిరిన‌ట్టు స‌మాచారం. నాడు స్టీఫెన్‌స‌న్ కూడా ఇదే రీతిలో ఏసీబీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చి, రేవంత్‌రెడ్డిని ప‌ట్టిచ్చారు. నేడు న‌లుగురు ఎమ్మెల్యేలు స‌ద‌రు వ్య‌క్తుల‌ను ట్రాప్‌లోకి దింపి వ్య‌వ‌హారం న‌డిపించారు.

ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉంటున్న ఒక పార్టీ అగ్ర‌నేత‌తో ఫోన్లో సంభాషించ‌డం, అదంతా పోలీసులు వీడియో, ఆడియో రికార్డ్ చేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను సైబ‌రాబాద్ పోలీసులు మీడియా స‌మావేశం పెట్టి బ‌య‌ట పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఎపిసోడ్‌లో ఏ రాజ‌కీయ పార్టీ పెద్ద త‌ల‌కాయ‌లు బ‌య‌ట ప‌డ‌తాయో అనే ఉత్కంఠ నెల‌కుంది.